మన ఊళ్లో ప్రభుత్వ బడి మూతపడితే ఏమవుతుంది? గ్రామం నిశ్శబ్దంలో మునిగిపోతుంది. చిన్నారుల సందడి ఆగిపోతుంది. చదువు అనే కల చేజారుతుంది. విద్య అనే హక్కు కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోతుంది. మన వాడల్లో, పేటల్లో విద్యా దీపం ఆరిపోతుంది. ఒక తరం చదువు కోల్పోతుంది. వారి బాల్యం బంజరవుతుంది. విద్యా వ్యాపారం మరింత విస్తరిస్తుంది. పేదలకు చదువు అందని సరుకుగా మారుతుంది. అది ధనికులకు మాత్రమే సొంతమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేసే ప్రతిపాదనలతో, ముఖ్యంగా 25 మందికి తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా 12,000కు పైగా పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో 15 పాఠశాలల విలీనంతో 12 దళిత వాడల్లో స్కూళ్లు లేకుండా పోయాయి. దీంతో మూడు నుంచి ఐదు తరగతులు చదువుతున్న చిన్న పిల్లలు 2-3 కిలోమీటర్ల దూరంలోని ఇతర గ్రామాల స్కూళ్లకు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది కేవలం ప్రకాశం జిల్లాకే పరిమితం కాదు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం తదితర రాష్ట్రవ్యాప్త జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అందుకే ఈ విలీనాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
పాలకుల విధానాల కారణంగా ప్రభుత్వ విద్య రోజురోజుకీ కునారిల్లుతోంది. కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గుతోంది. "జీరో" నమోదు బడుల సంఖ్య ఏటా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థ రూపురేఖలను మార్చేస్తామని ప్రకటించిన పాలక పార్టీలు, అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేయకపోగా వాటిని కనుమరుగు చేస్తున్నాయి. ఈ విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ విద్యా వ్యతిరేక విధానాలు రూపొందిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం జీవో 19, 21 ద్వారా 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తూ, ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే అశాస్త్రీయ విభజనకు శ్రీకారం చుట్టింది. అవి: 1) పీపీ-1, 2తో (అంగన్‌వాడీలు) శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ 2) పీపీ-1,2తో 1,2 తరగతుల ఫౌండేషన్ స్కూల్స్ 3) 1-5 తరగతులు, 45 మంది విద్యార్థులలోపు బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 4) 1-5 తరగతులు, 60 మంది పైబడి (లేదా ప్రత్యేకంగా 45 మంది)తో మోడల్ ప్రైమరీ స్కూల్స్ 5) 1-8 తరగతుల యూపీ స్కూల్స్ 6) 6-10 తరగతుల ఉన్నత పాఠశాలలు 7) 1-10 తరగతులతో బేసిక్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు
1-10 తరగతులతో మోడల్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు (ప్రైమరీ రోలు 45 దాటితే) 9) బాలికల కోసం 1-12 తరగతుల హైస్కూల్ ప్లస్.

గత ప్రభుత్వం జీవో 117 ద్వారా 6 రకాల బడులను సృష్టించి, 10 లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ బడులకు తరలించింది. ఈ విధానం తల్లిదండ్రులను, విద్యార్థులను, ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేసింది. ప్రస్తుత ప్రభుత్వం జీవో 117ను రద్దు చేస్తామని వాగ్దానం చేసి, జీవో 19, 21 ద్వారా మరింత నష్టకరమైన 9 రకాల బడుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభజన 5,000కి పైగా ఫౌండేషన్ స్కూల్స్‌ను ఏకోపాధ్యాయ బడులుగా మారుస్తోంది. ఇవి ఒకే ఉపాధ్యాయుడితో నాణ్యమైన విద్యను అందించలేవు. గతంలో జీవో 117 ద్వారా 12,000 ఏకోపాధ్యాయ బడులు ఏర్పడగా, ఇప్పుడు మరిన్ని జోడించబడుతున్నాయి. ఒకే ఉపాధ్యాయుడితో నాణ్యమైన విద్య అసాధ్యం, ఈ బడుల మనుగడ ప్రశ్నార్థకం. గ్రామీణ ప్రాథమిక బడులు (1-5 తరగతులు) దశాబ్దాలుగా విద్యా కేంద్రాలుగా ఉండగా, 3-4 తరగతులను ఉన్నత పాఠశాలలకు బదిలీ చేయడం అనాలోచితం. ఈ అశాస్త్రీయ విభజన గ్రామీణ ప్రాథమిక విద్యను నాశనం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతోంది.
ప్రపంచ బ్యాంకు (డబ్ల్యూబి), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్)ల ఆదేశాలు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తూ, విద్యను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నాయి. 2017లో వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో 2030 నాటికి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 30%కి తగ్గించాలని నిర్ణయించారు. ఈ లక్ష్యం కోసం ప్రపంచ బ్యాంకు రుణాలపై ఆధారపడిన ప్రభుత్వాలు అశాస్త్రీయ విధానాలతో బడులను ప్రయోగశాలలుగా మారుస్తున్నాయి. వాటి నిబంధనలకు లోబడి, ఏకోపాధ్యాయ బడులను పెంచడం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని అసమంజసంగా నిర్ణయించడం వంటి చర్యలతో విద్యను నాశనం చేస్తున్నాయి. అమ్మఒడి/తల్లికి వందనం పథకంలో 15,000 రూపాయలు ఇస్తూ, ప్రైవేట్ బడుల్లో చేరమని స్థానిక నాయకులు తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకం ప్రపంచ బ్యాంకు ఓచర్ విధానంలో భాగమే. జాతీయ విద్యా విధానం-2020 విద్యను కార్పొరేటీకరణ దిశగా నడిపిస్తోంది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు, విధానాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు లబ్ధి చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏకమై పోరాడాలి.
ప్రభుత్వ బడులు మన హక్కు!
వాటిని కాపాడుకోవడం మన బాధ్యత!!
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO), ఆంధ్రప్రదేశ్
తేదీ : 06-07-2025,
విజయవాడ
వివరాలకు : 9701924714