
నూతన విద్యార్థులకు పిడిఎస్ఓ స్వాగతం
కొత్త విద్యా సంవత్సరం జోరుగా మొదలైంది. పాత విద్యారంగ సమస్యలు మళ్లీ ముసురుకొస్తున్నాయి. విద్య - దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆయుధం, పిల్లలను జాతి సంపదగా మలిచే అమూల్య శక్తి. అయితే ఈ రోజు ఏం జరుగుతోంది? మన విద్యా వ్యవస్థ నిజంగా పిల్లల కలలకు బలమైన రెక్కలు తొడుగుతోందా? ప్రభుత్వ బడులు ఎందుకు క్షీణిస్తున్నాయి? విలీనాల పేరుతో విద్యార్థుల డ్రాపవుట్‌లు పెరిగే చర్యలకు ప్రభుత్వం ఎందుకు పాల్పడుతోంది? కార్పొరేటీకరణ అనే చీడపురుగు విద్యను వ్యాపార సరుకుగా మార్చి, పేద పిల్లల కలలను అధిక ఫీజుల భారంతో ఎలా చిదిమేస్తోంది? అందరికీ సమానమైన, ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణకు ఎందుకు ఊతమిస్తోంది? పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా విద్యా వ్యవస్థ తీరు ఎందుకు మారడం లేదు? ఈ ప్రశ్నలన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
టిడిపి కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణల పేరుతో ‘తొమ్మిది రకాల బడులు’, ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ వంటి మార్పులు చేసింది. కానీ ఇవి కేవలం ప్రచార హంగుగానే మిగిలాయి. గత వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఈపీ-2020లో భాగంగా జీవో నెంబర్ 117 ద్వారా 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీంతో విద్యార్థులు సమీపంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అనేక ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఈ పరిస్థితిని సరిదిద్దుతామని హామీ ఇచ్చినప్పటికీ 1, 2 తరగతులను కూడా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను చేపట్టింది. గత ఏడాది 2.10 లక్షల డ్రాపవుట్‌లతో 'ఆంధ్రప్రదేశ్ ' దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ‘అమ్మఒడి’, ఇప్పుడు ‘తల్లికి వందనం’ అన్నా, డ్రాపవుట్‌ల సమస్య అలాగే ఉంది. తల్లికి వందనం పథకంలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లలకు రూ.15,000 ఇస్తామని ప్రకటించి, రూ.13,000కు తగ్గించారు. మొదటి ఏడాది అమలు చేయకుండా, రెండో ఏడాది పథకాన్ని ప్రారంభించారు. దీనికి అనేక షరతులు విధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తీవ్ర నిర్లక్ష్యంతో కునారిల్లుతున్నాయి. చాలా కళాశాలల్లో కనీస సౌకర్యాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లేవు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని కళాశాలల్లో 60% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గత ఏడాది ఇంటర్మీడియట్ డ్రాపవుట్ రేటు 22%కి చేరింది. కార్పొరేట్ కళాశాలలు అధిక ఫీజులతో, మార్కులు, ర్యాంకులే పరమావధిగా ఇంటర్మీడియట్ విద్యను మార్చేయడంతో, అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం వాటిపై తగు చర్యలు చేపట్టడం కానీ, నియంత్రించడం కానీ లేదు. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమంగా ఎగ్గొడుతోంది. ఒక క్వార్టర్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.700 కోట్లు, వసతి దీవెన కోసం రూ.1,100 కోట్లు చొప్పున, సంవత్సరానికి రూ.3,900 కోట్లు, రెండేళ్లకు రూ.7,800 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో తల్లిదండ్రులే ఫీజులు చెల్లించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది.
ఎన్‌ఈపీ 2020లో సెమిస్టర్ విధానం, ఇంటర్న్‌షిప్‌లు, నాలుగేళ్ల డిగ్రీ, మైనర్-మేజర్ సబ్జెక్టులు వంటి గందరగోళ విధానాల వల్ల విద్యార్థులు కోర్సులను మధ్యలో వదిలేస్తున్నారు. డిగ్రీలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఎడెక్స్ కంపెనీతో రూ.50 కోట్ల ఒప్పందం ద్వారా స్వయం యాప్‌లో పీజీ విద్యార్థులు తమ కోర్సుతో సంబంధం లేని నాలుగు ఆన్‌లైన్ కోర్సులను తప్పనిసరిగా చేయాలి. ఒక్కో కోర్సుకు రూ.1,000, నాలుగు కోర్సులకు రూ.4,000 చెల్లించాలి. అటెండెన్స్ తప్పనిసరి. ఆన్‌లైన్ కోర్సుల్లో ఫెయిల్ అయితే పీజీ కోర్సు కూడా ఫెయిల్ అవుతుందని, ఈ పనికిరాని కోర్సులు విద్యార్థులను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నాయి.
ప్రభుత్వ రంగంలో వికసించాల్సిన విద్య, కార్పొరేట్ - ప్రైవేట్ ఆధిపత్యం కిందికి వచ్చినప్పటి నుంచి వ్యాపార సరుకుగా మారిపోయింది. "నీ ఆర్థిక స్థోమతను బట్టి విద్య" అనే ధోరణితో ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా సాగుతూ, విద్యా బడ్జెట్‌లో కోతలు, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం గత వైసీపీ విధానాలను విమర్శించి అధికారంలోకి వచ్చినప్పటికీ, గతంలో వ్యతిరేకించిన విధానాలను రద్దు చేయకుండా, వాటిని మరింత బలపరిచే చర్యలు తీసుకుంటోంది. ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంటూ, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరుస్తూ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను దిగజార్చి, పేద విద్యార్థుల భవిష్యత్తును అగాథంలోకి నెట్టివేస్తోంది.
"స్ట్రగుల్ తోటి నీ స్టడీ చెడదురా! స్టడీ కోసమే స్ట్రగుల్ సోదరా!! సంఘటితంగా స్ట్రగుల్ చేయరా! సాధ్యం కానిది లేనేలేదురా!!" అనే నినాద స్ఫూర్తితో విద్యారంగ సమస్యలకు కారణమైన పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయమైన, నాణ్యమైన విద్యను హక్కుగా సాధించడానికి విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పిడిఎస్ఓ స్వాగతం పలుకుతూ, ఉజ్వల భవిష్యత్తు కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిస్తోంది.
తేదీ : 29-06-2025,
విజయవాడ