ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమై, జూన్ నెల ముగిసినప్పటికీ డిగ్రీ నోటిఫికేషన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కోవిడ్‌కు ముందు మే నెలలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమై, జూన్ నెలలోపు పూర్తయ్యేది. కోవిడ్-19 మహమ్మారి ఉదృతంగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియ గందరగోళంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అనేక రాష్ట్రాలు విద్యాసంవత్సరాన్ని సర్దుబాటు చేసి, అడ్మిషన్లను సకాలంలో నిర్వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ సమస్య ఇంకా కొనసాగుతోంది.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రైవేటు కళాశాలలు ముందస్తుగా విద్యార్థులను తమ వద్దకు ఆకర్షిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు ఎక్కువగా మొగ్గే ప్రమాదం ఏర్పడింది. అడ్మిషన్ల ఆలస్యం వల్ల ఫలితాలు ఆలస్యమవడం, APPGCET, ICET వంటి ఉమ్మడి పరీక్షలు వాయిదా పడటం, రాష్ట్ర లేదా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతున్నాయి. అంతేకాక 90 రోజులు నిర్వహించాల్సిన సెమిస్టర్‌ను కుదించడం, కొన్నిసార్లు సెమిస్టర్ ప్రారంభమై రెండు నెలలకే పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఒక సెమిస్టర్ పూర్తయ్యేలోపే మరో సెమిస్టర్ ప్రారంభమవడంతో, సిలబస్ పూర్తి చేయడానికి అధ్యాపకులు, చదువుకోవడానికి సమయం సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం NEPలో భాగంగా సింగిల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని స్థానంలో డ్యూయల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉందని, విద్యార్థులు, అధ్యాపకులతో చర్చలు జరుపుతున్నామని చెబుతోంది. ఈ కారణంగా ప్రైవేటు కళాశాలల గుర్తింపు ప్రక్రియను కూడా నిలిపివేశారు. అడ్మిషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో కొనసాగించాలా, ఆఫ్‌లైన్‌కు మార్చాలా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి చర్చలు జరపడం ఏమిటి? ఉన్నత విద్యా మండలి ఇంత సీరియస్ అంశాలపై ఇంతకాలం నిర్ణయం తీసుకోకుండా ఏం చేస్తోంది? ఇది అకడమిక్ షెడ్యూల్‌పై, ఇతర ఉమ్మడి పరీక్షలపై ఎంతటి ప్రభావం చూపుతుంది? కొత్త విధానాలను వెంటనే అమలు చేయడం వల్ల కళాశాలలు ఆ విధానాలకు అనుగుణంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? విధానాలను ఒక్కసారిగా మార్చడం, వాటిని విద్యార్థులపై బలవంతంగా రుద్దడం వారి మానసిక స్థితి, చదువు పట్ల ఆసక్తిపై ఎంతటి ప్రభావం చూపుతుంది? ఈ విషయాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇది ఉన్నత విద్య పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని స్పష్టంగా తెలియజేస్తోంది.
కాబట్టి డిగ్రీ అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని, ఈ సమస్య ఇకపై పునరావృతం కాకుండా విద్యాశాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన, సమర్థవంతమైన అడ్మిషన్ విధానాన్ని అమలు చేయాలని PDSO డిమాండ్ చేస్తోంది.
ఎ.సురేష్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
తేదీ : 05-07-2025,
విజయవాడ