పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక చదవండి! చదివించండి!! - కార్తీక రాజు

0
PDSO 'స్టూడెంట్' పేరిట ఒక బులిటెన్ ప్రచురిస్తున్న సంగతి విదితమే కదా! గత ఏడాది డిసెంబర్ లో గుంటూరులో జరిగిన పాలస్తీనా సంఘీభావ సభలో వక్తలు చేసిన ఉపన్యాసాలకు అక్షరరూపం కల్పించి, 2025 జనవరిలో ప్రత్యేక సంచికగా ప్రచురించింది పిడిఎస్ఓ బృందం. పిడిఎస్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎ. సురేష్ గారి ద్వారా ఈ సంచిక అందింది. నాలుగు రోజుల్లో వీలు దొరికినప్పుడల్లా చదివాను. వక్తల ప్రసంగపాఠాలు ఎన్నో తెలియని విషయాల పట్ల అవగాహన కల్పించాయి. ఇన్నాళ్ళూ నేను పెద్దగా పట్టించుకోని, దృష్టిపెట్టని దేశవిదేశీ విషయాల పైకి నా దృష్టిని మరల్చాయి. సంచిక చదువుతున్నంతసేపు ఇలాంటి సమకాలీన విషయాల మీద కదా మనం దృష్టి పెట్టాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది, బాధ్యత తీసుకోవాల్సింది, మన వంతుగా ఏదో ఒకటి చేయాల్సింది అని అనిపించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలకు చెందిన అనేక విషయాలను చర్చించింది ఈ సంచిక. దేశదేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను చూపెట్టింది. వాస్తవాలను బట్టబయలు చేసి పడేసింది. చాలా విషయాల్ని లెక్క తేల్చి చూపింది. మచ్చుకు కొన్ని ఈ కింద మెన్షన్ చేసాను చదవండి. (ఈ పత్రికలో కొన్ని కవితలూ ఉన్నాయి. వాటిలో నచ్చిన ఖండికలను మరో పోస్ట్ లో మీకు చెప్తాను.)
◆ ఫాసిజం ఎప్పుడూ ఏం చేస్తుందంటే ఎక్కడైతే వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారో అక్కడ చుట్టుపక్కల దేశాల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడుతుంది. క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. రేపొద్దున జైన్లు కావచ్చు. బౌద్ధులు కావచ్చు. అక్కడ ఎవరైతే మైనారిటీ ఉన్నారో వాళ్లను టార్గెట్ చేస్తుంది ఫాసిజం.
◆ ఇప్పటికీ మనం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా అంటూ ఘర్షణలకు దిగుతున్నాం. ఇది ఉపయోగించుకొని మతోన్మాదులు ఈ దేశాలలో ప్రజలను మెజారిటీ, మైనారిటీ మతాలుగా విభజించి అధికారంలోకి రావడానికి చూస్తున్నారు. ఇరుపక్షాలు కొట్టుకుంటుంటే మధ్యలో బ్రిటీష్ వాడు, అమెరికా వాడు వచ్చి తగువు తీరుస్తానని అంటాడు లేదా ఆయుధాలు అమ్ముతాను అంటాడు. ఇదొక వాణిజ్య వ్యూహం. మనమెప్పుడూ యుద్ధాలు చేసుకుంటూ ఉండాలి, వాళ్లేమో ఆయుధాలు అమ్ముతూ అధిక లాభాలకు డబ్బు సంపాదించుకోవాలి. ఇది సింపుల్ రాజకీయం.
◆ మతోన్మాదులకి చాలా ఎజెండాలు ఉంటాయి. అఖండ భారతదేశం అనే నినాదంలా ఇజ్రాయిల్కి కూడా అఖండ ఇజ్రాయిల్ అనే నినాదం ఉంది.
◆ మొత్తం దేశాన్ని, దేశ ప్రజల్ని, సహజ సంపదలని అంతా నాశనం చేసిన తర్వాత పాలస్తీనా వాళ్ళు వేసిన రాకెట్లు ఎంత?! మనం దీపావళికి కాల్చుకునే చిన్న టపాసులు వంటివి అవి. వీళ్ళు పంపించిన 300ల క్షిపణులు గాని నిజంగా పేలితే ఆ రోజు టెల్ అవివ్ (ఇజ్రాయిల్ రాజధాని) ఉంటుందా?! ఇజ్రాయిల్ దాడులకు ప్రతి దాడిగా ఏదో ఒకటి చేయాలని పాలస్తీనాలో తిరుగుబాటు వచ్చింది.
◆ 2023 అక్టోబర్ 7న హమాస్ క్షిపణులు వేస్తే సుమారు ఒక వెయ్యి మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోయి, ఒక 300 మంది బందీలుగా అయ్యారు. 1947 సంవత్సరంలో జరిగిన హింసలో సుమారు ఒక 70 వేల మంది పాలస్తీనీయులు చనిపోయారు. సుమారు 7 లక్షల మంది పక్కనున్న జోర్డాన్, సిరియా, ఇరాక్, ఈజిప్టు దేశాలకి వలస వెళ్లిపోయారు. హమాస్ దాడిని ప్రచారం చేస్తున్న ప్రస్తుత మీడియా, ఆ ఘటనలను బయటకు తీయడం లేదు.
◆ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పశ్చిమాసియా తరఫున మనం పోరాడాలి. రేపు మన భారతదేశం అమెరికా విధానాలను వినలేదనుకోండి (వ్యతిరేకించిందనుకోండి) అప్పుడు భారతదేశం మీద కూడా దాడి చేయగలదు. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఆపితే భవిష్యత్తులో ఇతర దేశాల సార్వభౌమాధికారానికి, స్వతంత్రతకి భంగం కలగకుండా ఉంటుంది. కనుక మనం ముందే మేలుకొని పాలస్తీనాకు సంఘీభావంగా నిలవాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా ముందుగా మనం మన గొంతు వినిపించాలి.
◆ భూభాగం కోసం చేసిన యుద్ధాలే కాకుండా, వ్యాపారం కోసం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆ దేశంలోని వనరులను గుప్పెట్లో పెట్టుకోవడం కోసం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగాయి. ప్రపంచాన్ని వాళ్లు పంచుకోదలుచుకున్నారు. అయితె ఆ ఆరాటంతో, ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలే మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధం. దానివల్ల ప్రజలకు ఒనగూరింది ఏంటి?! మొదటి ప్రపంచ యుద్ధంలో మూడు కోట్ల మంది ప్రజలు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. చనిపోయింది కేవలం సైనికులు కాదు. మూడు కోట్ల మందిలో కోటి మంది మాత్రమే సైనికులు ఉన్నారు. మిగతా రెండు కోట్ల మంది సాధారణ ప్రజలే. ప్రధానంగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధం అయిపోయి, జర్మనీ లొంగిపోతున్నది అని తెలిసి కూడా అమెరికా హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసింది. వ్యాప్తి కొన్ని నిమిషాల్లోనే లక్షల మంది చనిపోయారు. యుద్ధం చేయాల్సిన అవసరం లేకపోయినా, ప్రత్యర్థులు లొంగిపోయినా కూడా అమెరికా తన అణుబాంబులను పరీక్షించుకోవడం కోసం, ప్రపంచాన్ని భయపెట్టడం కోసం ఆ అణుబాంబులను వేసింది. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని సోవియట్ రష్యా నిరోధించింది. కానీ చివరలో అమెరికా అణుబాంబులు వేసి కొన్ని లక్షల మందిని చంపేసింది. తర్వాత ఒకటి, రెండు తరాల పాటు అనేక ఇబ్బందులు పడిన వాళ్లు ఆ బాధలను ప్రపంచం ముందుంచారు.
◆ సామ్రాజ్యవాదం అంటే తన దేశంలో ఉన్న ప్రజల్ని దోచుకోవడమే కాక, మనలాంటి దేశాల్లో ఉన్న ప్రజల యొక్క ఆస్తులను, వనరులని కొల్లగొట్టేది. నేడు ప్రపంచ సామ్రాజ్యవాదిగా ఉన్న దేశం అమెరికా. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అన్ని యుద్దాల వెనుక అమెరికా హస్తం ఉంది. ప్రపంచంలో ఉన్న 100 భారీ ఆయుధ తయారీ కంపెనీల్లో 41 శాతం అమెరికాలోనే ఉన్నాయి. ఇవి గతేడాది 2.3 శాతం వృద్ధి సాధించాయి. 623 బిలియన్ డాలర్ల (6300 వందల కోట్ల) విలువచేసే ఆయుధాలలో సింహభాగం ప్రపంచ దేశాలకి అమెరికానే అమ్మింది. ఈ విధంగా తన ఆయుధాలను అమ్ముకోవడం కోసం నిత్యం ప్రపంచంలోని దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి.
◆ ఆధిపత్య శక్తుల చేతిలో ఎప్పుడూ కూడా మూడు ఆయుధాలు ఉంటాయి. అవే కులం, మతం, ప్రాంతం. ఈ ఆయుధాలను తీసుకొని యుద్ధం అనే వాహకంతో ప్రజలను విడగొట్టడానికి వస్తారు.
◆ “చల్లారిన సంసారాలు/ మరణించిన జన సందోహం/ అసహాయుల హాహాకారం/ చరిత్రలో మూలుగుతున్నది!” మహాకవి శ్రీశ్రీ ఈ మాటలు చెప్పి 86 సంవత్సరాలు గడచిపోయింది. తదనంతర కాలపు చరిత్ర కూడా దానినే మళ్లీ మళ్లీ రుజువు పరిచింది.
◆ ఆధునిక భావాలకు, శాస్త్రీయ ఆలోచనలకు పాతరేస్తూ, కార్పోరేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది కేంద్ర ప్రభుత్వం. క్రమేణా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్లోంచి అనేక శాస్త్రీయ, చారిత్రక అంశాలను తొలగించి తమ హిందూత్వ భావజాలాన్ని చొప్పిస్తోంది. తద్వారా దేశంలో వైజ్ఞానిక స్పృహకు తలుపులు మూస్తోంది. ఇప్పుడు కొత్తగా సైనిక పాఠశాలలను సైతం సంఘ్ పరివార్కు అప్పగిస్తూ తన కాషాయీకరణను మరింత వేగవంతం చేస్తోంది.
◆ రాజ్యాంగంలోని 51 ఏ అధికరణ ప్రకారం ఈ దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఐతే సదరు రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కి ప్రభుత్వాలే భక్తిని, మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని సమాధి చేస్తున్నది. జాతీయ విద్యా విధానంతో పాటు ప్రజల సామాజిక జీవనాన్ని ప్రభావితం చేసే అనేక పాలనా విధానాల రూపకల్పనలో పుక్కిటి పురాణాలను, అశాస్త్రీయమైన ఆలోచనలకు.. బలం కలిగించే విధంగా ప్రభుత్వ పాలనా విధానాలు, కార్యాచరణ కొనసాగుతున్నాయి.
◆ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటే అమెరికా యుద్ధోన్మాద సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ, బలహీనపరుస్తూ సాగే ప్రపంచ పీడిత ప్రజా ఉద్యమాలు తప్ప మరొక దారిలేదు.
- కార్తీక రాజు
---------------------------------
చదవండి! చదివించండి!!
పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక

Post a Comment

0Comments
Post a Comment (0)