చిన్నారులు, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!
“చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు- సామాజిక మూలాలు” అనే అంశంపై విశాఖ పౌర గ్రంథాలయంలో పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి అధ్యక్షతన సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన డా॥పి.శైలజ మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావం యువతపై చాలా ఎక్కువగా ఉంది. మనం రోజూ వాడుతున్న ఆప్స్ లో వచ్చే యాడ్స్ న్యూడిటీని ఎక్స్ పోజ్ చేస్తున్నాయి. 20 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకూడదని రూల్ పెట్టారు. కానీ, మద్యం షాపులను రెండు మూడు కిలోమీటర్ల కి ఏర్పాటు చేస్తూ యువత మద్యం మత్తులో ఉంచుతున్నారు. చదువుకున్న వాళ్ళలో కూడా వారసుడును కనలేదని హింసించే భర్తలు ఈరోజు కూడా ఉన్నారంటే, మన సమాజంలో కూరుకుపోయిన భావజాలమేనని చెప్పారు. ఈరోజు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆలోచించకుండా, వాటిపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల గురించి ఆలోచించకుండా సమాజంలో మార్పు రాదు” అన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు అందర్నీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన దాడిని మరువక ముందే మహారాష్ట్ర బడ్లాపూర్‌లో నాలుగేళ్ల బాలికపై స్కూల్లో పనిచేసే స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్‌లో ఒక నర్సుపై ఘోరాతి ఘోరంగా అత్యాచారం, హత్య చేయబడింది. రాజస్థాన్లోని జోధ్‌పూర్‌లో మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. రోజు, రోజుకి అత్యంత అమానుషమైన, హేయమైన, మాటల్లో వర్ణించలేని రూపాల్లో స్త్రీలపై, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. పాలకులు చెబుతున్న మహిళా సాధికారత, ప్రగతి ఇదేనా? అని ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ పురుషాధిపత్య సమాజంలో నేటికీ సామాజిక వివక్షతకు గురవుతున్నారన్నారు. సమాజంలో స్త్రీని చిన్నచూపు చూస్తున్నారని, అంగడి సరుకు గాను, వ్యాపార వస్తువు గాను చూస్తూ పెద్దపెద్ద కంపెనీలన్నీ సంపద కూడగట్టుకుంటున్నాయని, స్త్రీని ఒక మనిషిగా గుర్తించే సమాజాన్ని నిర్మించాలని, దీనికోసం భూస్వామ్య, సామ్రాజ్యవాద విధానాలకు, సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పిడిఎస్‌ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్. భాను మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ నెలలో నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల పాపను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, చంపేసి, కాలువలో పడేశారు. విజయనగరంలో ఉయ్యాలలో నిద్రపోతున్న ఐదు నెలల చిన్నారిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. చిత్తూరులో ఒకటవ తరగతి చదువుతున్న బాలిక పైన పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారానికి ఒడికట్టాడు. అనకాపల్లిలో 13 ఏళ్ల బాలికను ప్రేమ పేరిట కొడవలితో నరికి చంపేసిన ఘటన జరిగింది. ఇలా నిత్యం ఏదో ఒక రూపంలో స్త్రీలపై హింసాత్మక లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో గంటకు 47 ఘటనలు జరుగుతున్నాయని అధికార ఘనంగాలు చెబుతున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు పునరావృతం అవుతున్నాయి, రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు సైతం నేరాలకి పాల్పడటానికి గల కారణాలేమిటి, వీటి మూలాలెక్కడున్నాయి, ఈ మూలాలను నాశనం చేయకుండా ఈ ఘోరాలను ఆపగలమా? అన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్. ఆష మాట్లాడుతూ మహిళలపై, చిన్నారులపై హత్యలకు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం, మత్తు పదార్థాలను, పోర్న్ సైట్లు నిషేధించాలని, అలాగే స్త్రీలను భోగ వస్తువుగా చూపిస్తూ పతన సంస్కృతికి కారణమవుతున్న టీవీ ప్రోగ్రాంలను, సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, సామ్రాజ్యవాద విష సంస్కృతికి, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా నేటి విద్యార్థి, యువత పోరాడాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. భాస్కర్, జిల్లా అధ్యక్షులు పి. విశ్వనాధ్, జిల్లా కమిటీ సభ్యులు రాజేష్, సతీష్, యమున, సాయి, నాగేష్, లక్ష్మణ్ తదితరులతో పాటు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవాభినందనలతో…
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్











