వాస్తవాలను కళ్ళకు కట్టే ఇలాంటి పత్రికలు చదవాలి - హుమాయున్ సంఘీర్

0
    సామ్రాజ్యవాద దురాగతాలను,మతం ముసుగేసుకున్న నేతలు సాగించే సామ్రాజ్యవాద దుశ్చర్యలను సవివరంగా తెలిపే ప్రత్యేక సంచిక ఇది. పాలస్తీనా సంఘీభావ సభ ప్రత్యేక సంచిక చదివితే మనకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. పూర్వం రాజులు, దండయాత్రలు, దురాక్రమణల పరంపర కొత్త పుంతలు తొక్కింది.
    'ఇసంతకు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట!' అని తెలంగాణలో ఓ సామెత ఉంది. పాలస్తీనా ప్రజలు దయతలచి యూదులకు నిలువ నీడనిచ్చారు. వారు అదే అదునుగా తీసుకుని ప్రపంచ పఠంలో పాలస్తీనాను కనుమరుగు చేస్తున్న రక్తం మరిగిన రాక్షస కాండ. పసి పిల్లలు, తల్లులు, స్త్రీల మరణాలను చూస్తూ దుఖ్ఖించని హృదయం లేదు. ఎంత దారుణం? చేరదీయడమే పాపమైంది? ఆ దుర్మార్గుల వెనుక ఉన్న మర్నాగి అమెరికా.
    వావ్ పైకి అభివృద్ధి చెంది శాంతి జపం వల్లించే దేశం. లోపల మాత్రం రక్తం తాగాలనే కుతి ఆరని దాహార్తి, ఎడతెరిపిలేని యుద్ధ కాంక్ష. 'ఆయుధాలు మేమిస్తాం.. కొట్టుకు చావండి. ఆ పారుతున్న రక్తాన్ని, తునాతునకలైన దేహాలను, వల్లకాడైన నివాసాలను చూసి మేము పండగ చేసుకుంటాం. అశాంతి ఇంత మజాగా ఉంటుందా అని శాంతి జపం వల్లిస్తాం' అంటుంది ఆ దేశం. నోరు మాట్లాడ్డం నొసలు వెక్కిరించడం లాంటి వైనం.
    పుట్టిన నేలను ఆక్రమించి వెళ్ళగొడుతూ, చంపుతుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటుందా పాలస్తీనా? ఎదురు తిరిగితే అమెరికా అందిస్తున్న ఆయుధాలతో నరమేథం. ఇది ప్రపంచానికి తెలుస్తున్న అన్యాయం. ఈ క్రమంలో పీడీఎస్ఓ సురేష్ గారు ఈ ప్రత్యేక సంచిక తీసుకువచ్చి మంచి పనిచేశారు.
    పాలస్తీనా గురించి, మణిపూర్ గురించి మాట్లాడే నోర్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లోని హిందువుల మీద దాడుల గురించి మాట్లాడరే అని అతివాదులు అంటుంటారు. ఆ దేశాల్లో అంత అన్యాయం జరిగితే పైకి రాకుండా ఉంటుందా? వస్తే సాటి మనుషులుగా ఖచ్చితంగా స్పందిస్తారు కదా. స్పందనకు మతం రంగు పులిమిన దుర్బల సమాజం మనది. రోజురోజుకు కునారిల్లిపోతోంది. మణిపూర్ లో జరిగిన దారుణాల మీద ఎమోషనల్ కానివారు చావా వంటి అబద్ధపు సినిమాలు చూసి ఎమోషనల్ అవుతుంటే ఫూల్స్ అని ఇందుకే అనాలనిపిస్తుంది. రాజకీయ ప్రమేయం ఉన్న మణిపూర్ విషాదం గురించి ప్రశ్నించే గొంతులకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రశ్నలు వేస్తారు. అంటే ఆ దారుణాన్ని ఎలా కప్పి పుచ్చుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
    ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే... ఆ రాజకీయాలు రేపే ఆలోచనలు, సంఘటనల చుట్టూనే ప్రజలు జోరీగల్లా తిరగాలి. అస్సలు వేరేలా ఆలోచించొద్దు. వాస్తవాలు గ్రహించకుండా తాము కల్పించిన భ్రమల్లోనే వెర్రివాళ్ళుగా, మెదడు పనిచేయని వాళ్ళుగా, పేదగా, పిరికిగా బతకాలనుకుంటున్నాయి. అందుకోసం రాజకీయం మతం ఇంజెక్షన్ పట్టుకుని మత్తెక్కిస్తోంది. ఆ మత్తుకు బానిసలు అయినవాళ్ళు అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా నమ్మే దౌర్భాగ్య దేశంగా మన భారత్ అవతరించింది.
వాస్తవాలను కళ్ళకు కట్టే ఇలాంటి పత్రికలు చదవాలి.
- హుమాయున్ సంఘీర్
---------------------------------
చదవండి! చదివించండి!!
పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక

Post a Comment

0Comments
Post a Comment (0)