రాయలసీమ విద్యార్థి, యువకుల సమస్యలపై విజయవంతంగా జరిగిన PDSO రాయలసీమ విద్యార్థుల సదస్సు

0
    కర్నూలు జిల్లా ఆదోనిలోని మహల్తీ ఫంక్షన్ హాల్ నందు 'రాయలసీమ కరువు -విద్యా,ఉపాధి రంగాల సమస్యలు - కర్తవ్యాలు' అనే అంశంపై రాయలసీమ విద్యార్థుల సదస్సు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సుకు పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు కె. తిరుమలేష్ అధ్యక్షత వహించారు.
    సదస్సుకు ప్రధాన వక్తగా విచ్చేసిన సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్నీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రాయలసీమలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని, రాయలసీమను గ్రీన్ హబ్ మారుస్తామని ఎన్నికలప్పుడు జోరుగా ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మౌనంగా వుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనప్పుడు రాయలసీమ అభివృదికి ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తానని చెప్పి 10 సంవత్సరాలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీలంతా తమ ఓటు బ్యాంకుని పెంచుకోవడం కోసమే అని ప్రతిసారీ స్పష్టమవుతూనే వుంది.
    ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.గోవిందులు మాట్లాడుతూ ఎంతమంది పాలకులు మారుతున్న రాయలసీమ ఎన్నో ఏళ్ళుగా కరువు,కాటకాలకు నిలయంగా ఉంది తప్పితే సమస్యలు పరిష్కరించబడటంలో ఎటువంటి మార్పు లేదు. వ్యవసాయ సంక్షోభం, కరువును పెంచిపోషిస్తున్న పాలకుల విధానాల వలన గ్రామాల్లో పనుల్లేక, అప్పులు పాలైన రైతు కూలీలు, చిన్న రైతులు బెంగుళూరు, హైదరాబాద్, బొంబాయి, చెన్నై, పుణే వంటి మహానగరాలకు, కువైట్, సౌదీఅరేబియా వంటి గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నారనీ, అలాగే ఇక్కడి మహిళలు అనివార్యంగా వేశ్యావృత్తిలోకి నెట్టబడుతున్నారన్నారు. ఈ దుర్మార్గకరమైన పరిస్థితికీ కారణాలేంటో సీమ విద్యార్థులుగా ఆలోచించాల్సి ఉందన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)- 2020 ద్వారా విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరుతో ప్రభుత్వ బడులను మూసేస్తున్నారని, అనేక విద్యా పథకాలు తీసుకొచ్చి భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్లు అనేవి లేకుండా ప్రైవేటుపర చేయడం కోసం ప్రయత్నిస్తున్నారనీ అన్నారు. మరోవైపు నిరుద్యోగంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యువతకి పోరాటమే ముందున్న పరిష్కారం అన్నారు. నేటికీ విద్య అందరికీ విద్య అందడం లేదని, మార్కెట్లో వస్తువుగా మారిపోయిందనీ, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి హక్కు కోసం పోరాడాలన్నారు.
    ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాది ఏ. రాజేష్ కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తిక్కన స్వామి, పిడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఆష, పిడిఎస్ఓ నాయకులు ఎస్.అశోక్ కుమార్, ఎన్ వై ఎస్ పట్టణ కార్యదర్శి కె.వీరేష్, రైతు నాయకులు ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. పలు సామాజిక సమస్యలపై విద్యార్థి కళాకారులు ప్రదర్శించారు. ఈ సదస్సులో రాయలసీమ జిల్లాల నుండి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. సదస్సుకు ముందు ఆదోని పట్టణంలో రాయలసీమ విద్యార్థుల సమస్యలపై నినాదాలిస్తూ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించటం జరిగింది. రాయలసీమలో కరువు,వలసలను నివారించాలని, పెండింగులో ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, కరువు ప్రాంత విద్యార్థులకు ఫీజులు రద్దు చేయాలని ఈ సదస్సు పలు తీర్మానాలు చేసింది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
రాయలసీమ జిల్లాలు
తేదీ : 23-01-2025,
ఆదోని














Tags

Post a Comment

0Comments
Post a Comment (0)