విజయనగరం : “ఉత్తరాంధ్ర కరువు, వలసలు - విద్యా, ఉపాధి రంగ సమస్యలు - కర్తవ్యాలు” అనే అంశంపై “ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సు”ను విజయనగరంలోని ఎం.ఆర్. లేడీస్ క్లబ్ నందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) ఉత్తరాంధ్ర జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సదస్సు ప్రారంభానికి ముందు రైల్వే స్టేషన్ నుండి ఆర్.టి.సి కాంప్లెక్స్ మీదుగా ఎం.ఆర్. లేడీస్ క్లబ్ వరకు 500 మంది విద్యార్థుల నినాదాలతో ర్యాలీ ప్రదర్శన జరిగింది. అనంతరం జరిగిన సదస్సుకు ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు కె.సోమేష్, బి.రాకేష్ అధ్యక్షత వహించారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ సదస్సును ప్రారంభిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం సహజ సంపదలకు ఎంతగా నిలయమో, అక్కడి కరువు,కాటకాలు, ప్రజల కడగండ్లు అంత ఎక్కువే. విశాలమైన సముద్రతీరం, డజనుకుపైగా జీవనదులు, మూడు ఉమ్మడి జిల్లాలలో విస్తరించిన విస్తారమైన అడవులు, అపారమైన ఖనిజ వనరులు, సారవంతమైన, వ్యవసాయయోగ్యమైన భూములు, కష్టజీవులైన శ్రామికులు, రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు, యువజనులు... ఏ రంగంలో చూసినా సంపదకు కొదవలేని నేల ఇది. కానీ, ఇక్కడే కనీస ఆరోగ్య సౌకర్యాలు లేక ఏటేటా వేలాది మంది ఆదివాసులు మరణిస్తున్నారు. ఉపాధి సౌకర్యాలు లేక వేలాది మంది పొట్ట చేతపట్టుకొని వలస వెళుతున్నారు. పుష్కలమైన జలవనరులు ఉన్నా వాటిని వినియోగించుకొనే వ్యవసాయాభివృద్ధి జరగలేదు. విశాఖపట్నం మినహాయిస్తే పారిశ్రామికాభివృద్ధి జరిగింది తక్కువే. విద్యావకాశాల గురించీ, ఉద్యోగ సౌకర్యాల గురించీ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలే ఈ దుర్భర స్థితి ఉండగా, సంపన్నమైన ఉత్తరాంధ్రను సామ్రాజ్యవాద దేశాలకు, బహుళజాతి కంపెనీలకు దోచి పెట్టడానికి గత కొన్ని దశాబ్దాలుగా పాలకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎదుర్కొంటున్న సమస్యలు-మూలాలు- పరిష్కారాలు అర్థం చేసుకొని పోరాడినప్పుడు మాత్రమే ఉత్తరాంధ్ర విద్యార్థి, యువజనుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
కేంద్ర-రాష్ట్ర మాజీ సలహాదారు వై.వి.ఎస్. మహదేవ్ మాట్లాడుతూ “మన రాష్ట్రంలో 1,87,000 మంది చదువుకొని బయటకు వస్తే, ఇందులో 15 శాతం మంది మాత్రమే మన దగ్గర పని చేస్తున్నారు. పలాసలో 500 నుంచి 600గా ఉన్న జీడిపిక్కల యూనిట్లు 20,000 నుంచి 30 వేల కుటుంబాలకు ఉపాధినిస్తున్నా, జీడిపప్పు ఎగుమతులకు అవకాశాలు కల్పించి పాలకులు వీటిని అభివృద్ధి చేయరు. పలాసలో జీడిపిక్కలు ఫ్యాక్టరీని పెట్టండని, జీడిపప్పు ఎక్స్పోర్ట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కల్పించండని పోరాడుతూనే ఉన్నా, పాలకులు పట్టించుకోవడం లేదు. టెక్కలిలో గ్రానైట్ కు సంబంధించిన ఇండస్ట్రీయల్ పార్క్ పెడితే 50 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. పైడి భీమవరంలో హైదరాబాదులో లాగా ఫార్మా పార్కును ఏర్పాటు చేస్తే లక్ష మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ప్రభుత్వాలకి ఉద్యోగ రూపకల్పన అంటే ఆర్థిక భారంగా తయారైంది. ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి కంపెనీలు పెట్టడం కోసం భూములు లాక్కుని, ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేస్తున్నాయి. జూట్ కి డిమాండ్ లేదంటూనే మన స్టేట్ గవర్నమెంట్ 1,45,000 బీళ్ళ జ్యూట్ ని కలకత్తా నుంచి తెప్పిస్తుంది. కానీ, మన దగ్గర జూట్ మిల్లులని మాత్రం అభివృద్ధి చేయడం లేదు. ఉత్తరాంధ్రకి ముఖచిత్రం లాంటి విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఉన్న లక్ష ఉద్యోగాల్ని తీసేస్తూ, 25 వేల ఉద్యోగాలు వస్తాయంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ కంపెనీకి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోమని అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న వనరులని ఉపయోగించి ఉపాధి కల్పన చేసేలా, కరువు- వలసలను అరికట్టేలా, ఇక్కడి సమస్యల పైన విద్యార్థి యువతరమైన మీరే పోరాడాలన్నారు.
ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. భానుమూర్తి మాట్లాడుతూ “ విద్యారంగ పరిస్థితి చూస్తే ఒక ఉత్తరాంధ్రలోనే కాకుండా దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని వర్గాలకు, కొన్ని వందల సంవత్సరాలుగా విద్య నిరాకరించబడుతూ వస్తుంది. ఆ కారణంగానే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశంగాను, ప్రశ్నించే తత్వం లేని దేశంగాను, వైజ్ఞానిక స్పృహ లేని దేశం గాను మన దేశం ఉండిపోయింది. అన్ని వర్గాల ప్రజలు చదువుకుంటే తమపై జరుగుతున్న దోపిడీ గురించి ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు, పాలకుల ఆటలు సాగనివ్వరు. కాబట్టే పేద, బడుగు వర్గాలకు విద్యను ఉద్దేశపూర్వకంగానే అందించడం లేదు. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకున్న మన ప్రభుత్వాలు వాళ్ల నిర్దేశాలకు అనుగుణంగానే మన విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. కాబట్టి మన ముందు జరుగుతున్న ఈ దోపిడీని ప్రశ్నించాలి, అందులో భాగంగా మీరంతా నిరంతరం నిరంతరం చైతన్యం కలిగి ఉండాలన్నారు.
జనసాహితి సభ్యులు పి. మోహన్ రావు మాట్లాడుతూ “మానవుడు పరిణామ క్రమంలో చేసిన అనేక ఆవిష్కరణలతో జీవనం కొనసాగించడమే నాగరికత. ఆ ఆవిష్కరణలను వినియోగంలోకి తీసుకొని వచ్చి దానిలోని మంచి, చెడులను విశ్లేషించుకుంటూ ముందుకెళ్లడమే సంస్కృతి. నేడు ఈ సంస్కృతి వికృతి రూపం దాల్చింది. ఈ వికృత సంస్కృతికి ఒక కారణం సెల్ ఫోన్. పాలకులు కరోనాని అడ్డుపెట్టుకొని ప్రతి విద్యార్థి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చే పరిస్థితిని కల్పించారు. సెల్ ఫోన్ లేకపోతే జీవన గమనమే ఆగిపోయే పరిస్థితిని కల్పించారు. సెల్ ఫోన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థులు తల్లి తండ్రులకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు దూరమైపోయారు. అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికి ఆకర్షించబడి వాటి వలన నష్టపోతున్నారు. ఉపాధి లేక యువత సెల్ ఫోన్లోని అనేక యాప్ లలో జూదానికి అలవాటు పడుతున్నారు. అప్పులు తీసుకుంటున్నారు. వాటి కోసం వాళ్ళు పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి ఆన్లైన్ సంస్కృతికి యువత బలవుతున్నారు. మత్తు నుండి, విలాసాల నుండి విద్యార్థులు బయటపడి చైతన్య వంతులై ఈ సాంస్కృతిక కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉపాధి లేని కారణంగా కోట్ల మంది అంతర్రాష్ట్ర వలసలు పోతున్నారని ప్రభుత్వాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్‌లు భర్తీ చేయడం లేదు. తాము అధికారంలోకి రాగానే డీఎస్సీ పైన మొదటి సంతకం చేస్తామని టిడిపి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా ఏదో ఒక సాకు చూపి వాయిదా వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వం సైతం ఐదేళ్ల పాటు వాయిదాలు వేస్తూ కాలయాపన చేసింది తప్ప, డీఎస్సీని ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదన్నారు.
నవయువసమాఖ్య నాయకులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ “ఉత్తరాంధ్రలో ప్రధానంగా విజయనగరం జిల్లాలో ఇటీవల కాలంలో మూడు జూట్ మిల్లులను, రెండు షుగర్ ఫ్యాక్టరీలను మూసివేశారు. అలాగే 8 ఫెర్రో అల్లాయిస్ కంపెనీలను మూసివేశారు. మన రాష్ట్రంలో ఉన్న 7 లక్షల 16 వేల మంది నిరుద్యోగులలో రెండు లక్షలు మంది మన ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయకుండా పాలకులు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. నిరుద్యోగం, ఆకలి, అసమానతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలపై విద్యార్థి,యువకులు ఐక్యంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యులు పి.విశ్వనాథ్, కె.గౌతమి, ఎస్.రుద్రి, వి.లక్ష్మి మరియు ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడారు.
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ; విశాఖ స్టీల్ ఫ్లాంట్ సొంత గనులను కేటాయించాలని; రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థలన్నింటికీ నిధులు కేటాయించి, పూర్తి చేయాలని; విశాఖలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని; ఆంధ్రా యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీలలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని; విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసి, రైల్వే డివిజన్ కొనసాగించాలని; విజయనగరం ఎమ్.ఆర్, విశాఖ ఏ.వి.ఎన్, అనకాపల్లి ఏ.ఎమ్.ఏ.ఎల్, పార్వతీపురం వెంకటేశ్వర, బొబ్బిలి రాజా ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వ ఎయిడ్ అందించాలని; స్థానిక పంటలైన జీడి, మామిడి, చెరుకు, కొబ్బరి వంటి పంటల ఉత్పాదకత పెరిగే పరిశోధనలు జరిపేలా వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని; మూతపడ్డ జ్యూట్, చక్కెర తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను తెరిపించాలని; కొవ్వాడ అణువిద్యుత్ ఫ్లాంట్‌ను తక్షణమే ఆపాలని; పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు తీర్మానాలు చేసింది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఉత్తరాంధ్ర జిల్లాలు









