నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపించాలి!

0
బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి!!
మిత్రులారా!
    దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రాణాలు, లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడిన వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నీట్ నేడు అత్యంత వివాదాస్పదంగా మారింది. పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో ఎలా లీక్ అయింది? ప్రకటించిన తేదీ (జూన్ 14) కంటే పది రోజులు ముందు (దేశ ఎన్నికల ఫలితాల రోజు) జూన్ 4వ తేదీన నీట్ ఫలితాలను ఎందుకు విడుదల చేశారు? దేశంలో 67 మంది విద్యార్థులకు 720/720 మార్కులు ఎలా వచ్చాయి? వారిలోనూ ఆరుగురు ఒకే సెంటర్ విద్యార్థులు కావడం యాదృచ్ఛికమా? నెగిటివ్ మార్కుల కారణంగా సాధ్యం కాని 717, 718, 719 మార్కులు అనేకమంది విద్యార్థులకు ఎలా వచ్చాయి?.... ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలని, తిరిగి మరలా పరీక్షను నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన స్కామ్ లపై సిబిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇదే సమయంలో యూజీసీ-నెట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు భావిస్తూ పరీక్ష జరిగిన మరుసటి రోజే నెట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడం విద్యార్థుల ఆగ్రహాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రధానంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పాట్నా, లక్నో, భోపాల్ నగరాలలో, అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని పలు ప్రాంతాలలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విపక్షాలు, వామపక్షాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. బిజెపి ప్రభుత్వం ఈ విషయం పై ఇప్పటివరకు స్పందించకపోగా నిరసనకారులను అణచివేస్తూ అరెస్టులను సాగిస్తోంది.
    ఈ నిరసనల ఫలితంగా ఎన్టిఏ డిజి సుభోధ్ కుమార్ సింగ్ స్పందిస్తూ ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చినందున, సిలబస్ లో లేని ప్రశ్నలు, తప్పుడు సమాధానాలు ఇచ్చినందున 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, అందుకే 717, 718, 719 మార్కులు వచ్చాయన్నారు. అలాగే గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది పరీక్ష రాసినందున 720/720 మార్కులు ఎక్కువ మందికి వచ్చాయంటూ పొంతనలేని వివరణలు ఇచ్చారు. తిరిగి మరలా పరీక్ష అయితే నిర్వహించం కానీ, గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తామని, అలాగే గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు తిరిగి 23న పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. అలాగే ప్రశ్నాపత్రం లీకేజీ జరగలేదని, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నమ్మొద్దని, అవకతవకలకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ మరియు కేంద్రమంత్రి నమ్మబలకజూస్తున్నారు. అయితే ఇప్పటికే బీహార్లో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో 13 మందిని అరెస్ట్ చేసారు. వారిని విచారించగా పేపర్ లీకేజీ జరిగిందని, దాన్ని తాము 30 నుండి 40 లక్షలకు అమ్మామని, విద్యార్థుల చేత రాత్రికి రాత్రి బట్టి పట్టించి పరీక్ష రాయించామని తెలిపారు. గుజరాత్ లో ఒక పరీక్షా కేంద్రాన్ని హ్యాక్ చేసి, మాస్ కాపీయింగ్ చేయించిన కారణంగా పలువురిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ఈ ఘటనలపై ఎన్టీఏ కానీ, కేంద్ర విద్యాశాఖ కానీ నోరు విప్పడం లేదు. మరోవైపు సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ చిన్నపాటి తప్పిదం జరిగినా బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోబడతాయని, కౌన్సిలింగ్ ను మాత్రం కొనసాగించాలని చెబుతూ విచారణను జూలై 8కి వాయిదా వేసింది. లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగినా, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా పేపర్ లీక్ నిరోధక చట్టం చేసి, అవకతవకలకు కారణమైన బాధ్యులను శిక్షిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేయుటకు సుప్రీం కోర్టు గాని, కేంద్ర ప్రభుత్వం గాని తగు చర్యలు చేపట్టడం లేదు.
    దేశంలో వైద్యవిద్యకు అవసరమైనన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవు. దీంతో ప్రైవేటు కళాశాలలతో కలిపి ఉన్న 1 లక్ష 9 వేల మెడికల్ సీట్ల (వీటిలో ప్రభుత్వ మెడికల్ సీట్లు 55,900) కొరకు ప్రతీ సంవత్సరం లక్షల మంది (ఈ సం,, 24 లక్షల మంది) విద్యార్థులు నీట్ పరీక్షలో పోటీ పడుతున్నారు. ఈ పోటీలో భాగంగా అత్యంత కఠినంగా మార్చిన నీట్ పరీక్షను రాసి, సీటు సాధించుట కొరకు విద్యార్థుల వద్ద కోచింగ్ సెంటర్లు లక్షలకు, లక్షలు వసూలు చేస్తూ, వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అంతేకాక ప్రశ్నాపత్రం లీక్ చేయడం, మాస్ కాపీయింగ్ చేయించడం చేసి విద్యార్థులను అడ్డదారులు తొక్కిస్తున్నారు. కోచింగ్ల కొరకు ఏళ్ల తరబడి లక్షలు ఖర్చుపెట్టలేని, కోచింగ్ తీసుకున్నా వారు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు లేదా మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక కేంద్రీకరణను, కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్న నీట్, సియుఇటి తరహా పరీక్షలను రద్దు చేయాలి. నేటి విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని ప్రకటించాలి. బాధిత విద్యార్థులకు అండగా నిలబడాలి. వైద్య ప్రవేశ పరీక్షను రాష్ట్రాలే నిర్వహించాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలి.ఈ సంవత్సరం మరియు గత కొన్ని సంవత్సరాలుగా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలు, స్కామ్ లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించి నిందితులను శిక్షించాలి. తిరిగి మరలా నీట్ పరీక్షను నిర్వహించాలి, అప్పటివరకు కౌన్సిలింగ్ ను వాయిదా వేయాలి. నీట్ మరియు నెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలి. ఈ డిమాండ్లపై విద్యార్థులందరూ సంఘటితంగా పోరాడాలని పిడిఎస్ఓ పిలుపునిస్తోంది.

విజయవాడ
22.06.2024
విప్లవాభినందనలతో…
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ
ఆంధ్ర ప్రదేశ్
ప్రచరణ: ఎన్.భాస్కర్, ఎ.సురేష్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సెల్ : 9701924714
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)