"స్వాతంత్ర్యం అంటే జెండాలు, వ్యక్తులు మారడం కాదు. సామ్రాజ్యవాదుల నీడలు, గాలులు వీస్తున్నంత కాలం ఇక్కడ స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు చోటు ఉండదు" అంటూ బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం పోరాడిన వాడు భగత్ సింగ్.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట పటిమను, సామ్రాజ్యవాద వ్యతిరేకతను సహించలేని బ్రిటీష్ పాలకులు 1931 మార్చి 23 న వారిని ఉరితీశారు. నాటి నుంచి నేటి వరకు నిజమైన దేశభక్తికి, సంపూర్ణ స్వరాజ్య పోరాటానికి వారు ప్రతీకగా నిలిచారు. కానీ స్వాతంత్య్రానంతరం, ఏడున్నర దశాబ్దాలుగా మన పాలకులు సామ్రాజ్యవాద అనుకూల విధానాలనే అమలు చేస్తున్నారు. కనీసం మౌలిక సమస్యలను కూడా పరిష్కరించకుండా ప్రజల్ని సంక్షోభంలోకి నెడుతున్న ఫలితంగా నేడు భారతదేశం ఆకలి సూచీలో 111 వ స్థానంలో ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో కోటి 26 లక్షల మంది బాల కార్మికులు ఉన్నారు. పౌష్టికాహార లోపంతో రోజుకు 3000 మంది చిన్నారులు మరణిస్తున్నారు.
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని చెబుతూ ఎన్ఐపి-2020 ను ప్రవేశ పెట్టి విద్యారంగాన్ని మొత్తంగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయించకుండా వాటి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. అదే సమయంలో ఉన్నత విద్యను విదేశీ శక్తులకు కట్టబెట్టడానికి విదేశీ యూనివర్సిటీలకు అనుమతులనిస్తూ చట్టాన్ని చేసింది. ఈ విధానాల ఫలితంగా పేద, అట్టడుగు వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలకు లాభాలను, చౌక లేబరును సృష్టించటమే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, ప్రభుత్వరంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. నిజానికి ఈ దేశ సహజ సంపదల్ని కొల్లగొడుతూ, వాతావరణ కాలుష్యాన్ని, నిరుద్యోగాన్ని తీవ్రం చేస్తున్నది విదేశీ పెట్టుబడులు కాగా, విదేశీ పెట్టుబడులే ఉద్యోగ కల్పన చేయగలవని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలవని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. విద్యా, ఉపాధి దొరకక కార్పొరేట్ల దోపిడీకి బలవుతున్న మెజారిటీ ప్రజల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే, దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని, ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా?!
యువతను దేశ పరిస్థితుల గురించి ఆలోచించనివ్వకుండా మతోన్మాద (భగత్ సింగ్ అభివృద్ధి నిరోధకంగా భావించిన) భావజాలాన్ని దేశభక్తిగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యలో శాస్త్రీయ పాఠ్యాంశాలను తొలగిస్తూ అశాస్త్రీయ పాఠ్యాంశాలను చేరుస్తున్నారు. మెజారిటీ ప్రజలను, మైనారిటీల పైకి ఉసిగొల్పుతూ జాతి, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య అనైక్యతను పెంచిపోషిస్తూ అభద్రతాభావానికి గురిచేస్తున్నారు. మణిపూర్‌లో జరిగిన మారణకాండ, సిఏఏ, ఎన్ఆర్‌సి లాంటి చట్టాలు, గుజరాత్ అల్లర్లు ఈ కోవకు చెందినవే. అనేక మతాల ప్రజలు కలసిమెలసి జీవించే భారతదేశంలో బాబ్రీ మసీదును కూల్చి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెజారిటీ మతస్తుల ఓట్ల కోసం వందల కోట్లతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. ఆటను ఆటగా చూడనీకుండా క్రికెట్‌లో సైతం పాకిస్తాన్‌ను శత్రు దేశంగా, ఆ దేశ ప్రజలను ఆగర్భ శత్రువులుగా ప్రచారం చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
మన దేశ పాలకులు ప్రపంచీకరణ విధానాలను అనుసరిస్తూ దేశంలో ఉన్న సహజ సంపదలను, ప్రభుత్వరంగ సంస్థలను సామ్రాజ్యవాద కంపెనీలకు కట్టబెడుతున్నారు. పేదలను విద్యా, ఉపాధికి దూరం చేసి ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలకు చౌకబారు కూలీలుగా తయారు చేస్తున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజల నుంచి, యువత నుంచి వచ్చే ఆగ్రహాన్ని అణచడానికి దేశభక్తి ముసుగులో జాతి, కుల, మత, ప్రాంతీయ ఉన్మాదాలను నరనరాల్లో నింపుతున్నారు.
"లోకమంతా అన్యాయం నిండి ఉంటే రా ఎదుర్కొని పోరాడుదాం!", "ఒక మనిషిని వేరొక మనిషి/ ఒక జాతిని వేరొక జాతి/ ఒక దేశాన్ని వేరొక దేశం దోపిడీ చేయనటువంటి సమాజాన్ని నిర్మించుకుందాం!" అని భగత్సింగ్ ఇచ్చిన పిలుపులను విద్యార్థి, యువకులు అందిపుచ్చుకోవాలి. దేశంలోని పరిస్థితులను సరైన కోణంలో అర్ధం చేసుకుని, మెజారిటీ ప్రజల సమస్యలను పరిష్కరించడమే విద్యార్థి, యువకుల ముందున్న కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని భుజానికి ఎత్తుకోవడమే నిజమైన దేశభక్తికి నిదర్శనం. అందులో భాగంగా విద్యా ప్రైవేటీకరణను, నిరుద్యోగాన్ని, జాతి, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువకులు పోరాడాలి. ఇదే భగత్సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు మనమిచ్చే నివాళి.
షహీద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల 93వ వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు!
విప్లవాభినందనలతో
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO), నవయువ సమాఖ్య (NYS),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ తేదీ : 01.03.2024, విజయవాడ
ప్రచురణ: ఎ. సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (PDSO), ఎస్.కె.భాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (NYS)
సెల్: 9701924714







