మిత్రులారా!
1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన చట్టం దేశంలోని లౌకిక రాజ్య భావనను దెబ్బతీసి, భారత్‌ను మతతత్వ దేశంగా మార్చడమే లక్ష్యంగా ఉంది. బిజెపికున్న బండ మెజార్టీతో లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొంది పౌరసత్వ సవరణ చట్టంగా రూపొందించారు. ఈ చట్టం ప్రధానంగా పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి 2014 డిసెంబర్ 31 కన్న ముందు భారత్‌కు వలస వచ్చిన వారికి దేశ పౌరసత్వం యివ్వాలని చెబుతుంది. అయితే ఇది ముస్లిమేతరులైన హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శీ, జైన మతస్థులకు మాత్రమే పౌరసత్వపు అవకాశాన్ని ఈ చట్టం అనుమతిస్తుంది. పై మూడు దేశాలు మత రాజ్యాలని, అక్కడ చెలరేగే మతహింస కారణంగా తరలి వచ్చే మైనార్టీ మతస్థులకు పౌరసత్వం యివ్వడం ద్వారా వారికి రక్షణ కల్పించడమే తమ ఉద్దేశ్యమని చట్టంలో ప్రకటించారు. మైనార్టీ మతస్థులకు రక్షణ కల్పించటమే ధ్యేయమైతే సరిహద్దులో లేని అఫ్ఘనిస్తాన్ ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వ అవకాశం ఎందుకిచ్చినట్లు? మన పొరుగు దేశాలైన భూటాన్‌లో క్రిస్టియన్లు మతవివక్ష ఎదుర్కొవటం లేదా? క్రిస్మస్ ప్రార్థనల కోసం భారత్‌కు తరలివచ్చే వారి పరిస్థితి తెలియదా? మయన్మార్‌లో ముస్లిం రోహింగ్యాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్‌లోకి వివక్షత కారణంగానే వస్తున్నారు కదా? శ్రీలంకలో వివక్ష ఎదుర్కొంటున్న తమిళ హిందువులను ఎందుకు విస్మరించారు? అలాగే పాకిస్తాన్‌లోని అహ్మదీయులు, షియాలు తీవ్ర వివక్షకు గురవటం లేదా? వీరందరికీ పౌరసత్వ అవకాశం ఎందుకు ఇవ్వనట్లు? ఇక్కడే కేంద్ర ప్రభుత్వం యొక్క మతతత్వ ఏజెండా బయటపడుతుంది.
తాజా ఎన్నికల ముందు అసోంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ను అమలు జరిపింది. 1971 మార్చి 24 ముందు నుండి నీవు ఈ దేశంలో పౌరుడుగా ఉన్నట్లు ఆధారాలతో సహా (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డులు సరిపోవు) నిరూపించుకోవాలి. దీని కారణంగా 19 లక్షల మంది అసోం ప్రజలు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ నుండి తొలగింపబడ్డారు. అసోంలోని భారత్‌కు 5వ రాష్ట్రపతిగా పనిచేసిన ఫక్రుద్దీన్ ఆలీ అహమ్మద్ కుటుంబ సభ్యులకు ఈ రిజిస్టర్‌లో చోటు దక్కలేదు. 30 సం॥ల పాటు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ అధికారిగా పనిచేసి, కార్గిల్ యుద్ధంలో పాల్గొని, రిటైరైన అధికారిని సరైన ఆధారాలు చూపలేదనే కారణంగా దేశ పౌరసత్వానికి అర్హుడు కానట్లు తేల్చారు. ఒకనాటి దేశ అధ్యక్షుడు, భారత ఆర్మీలో ప్రముఖ హోదాలో పనిచేసిన అధికారి పరిస్థితే యిలా వుంటే, త్వరలో ఎన్ఆర్‌సి యావత్తు దేశమంతా అమలు జరిపినట్లయితే సామాన్య ప్రజల పరిస్థితేంటి?
ఈ సం౹౹ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇంటింటికీ తిరిగి 15 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరించే జాతీయ జనాభా నమోదు (ఎన్‌పిఆర్)ను తయారు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమాచార సేకరణలో భాగంగా అడిగే ప్రశ్నల ప్రకారం చివరి 6 నెలల్లో ఎక్కడున్నదీ, రానున్న 6 నెలల్లో ఎక్కడ నివసించదలచుకున్నదీ స్పష్టంగా చెప్పాలి. అంతేకాక ఆధార్, రేషన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టులతో పాటు వాళ్ల తల్లిదండ్రులు పుట్టిన తేదీ, స్థలాల వివరాలు చెప్పాలి. ఇలా సమర్పించిన ఆధార పత్రాలలో ఏ ఒక్కటి, మరొక దానితో పొంతన లేకున్న, అక్షర దోషాలున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర ఏ మతస్తులైన సరే, వారి పౌరసత్వం ప్రశ్నార్థకమయినట్లే, దానికి తగిన శిక్షలు అనుభవించాల్సిందే. పది సం॥లకు
ఒకసారి జరిగే జనాభా లెక్కలు, ప్రజల పీకల మీద కత్తులు పెట్టి బలవంతంగా చేయించిన ఆధార్, యింకా అనేక రూపాల్లో ప్రభుత్వం వద్ద కుప్పలకొద్ది సమాచారం పోగుపడి వుంది కాబట్టి ఎన్‌పిఆర్ అవసరమే లేదు. ఇదంతా ప్రజల్ని విడదీయడానికి, ప్రజల్లో ఒక సమూహాన్ని ప్రత్యేక లక్ష్యంగా చేసుకోవడానికి ఈ పట్టిక ఉపయోగపడుతుందనడంలో సందేహాం లేదు. గుజరాత్ మారణకాండకు కొన్ని నెలల ముందు ఎక్కడెక్కడ ముస్లిం నివాస ప్రాంతాలున్నాయో, ముస్లిం యజమానుల వ్యాపార సంస్థలున్నాయో అనే జాబితాను తయారు చేసినాకే 2002 గోద్రా అల్లర్లు జరిగాయన్నది గమనించాలి.
సిఏఏ, ఎన్ఆర్‌సి చట్టాలను హడావిడిగా తీసుకురావటం యొక్క ఉద్దేశ్యం అనేక సమస్యలతో ఆందోళన చెందుతున్న ప్రజల దృష్టిని మరల్చి హిందూ ముస్లింల మధ్య అల్లర్లు రెచ్చగొట్టి, తమ మతతత్వ విధానాన్ని ప్రజలపై రుద్ది, దేశాన్ని స్మశానం చేయాలని పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఈ మతోన్మాద పాలకుల విధానాలని గమనించిన విద్యార్థులు, రచయితలు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు దేశవ్యాప్తంగా జరిగే సిఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నారు. షాహిన్‌బాగ్‌ల పేరుతో ధిక్కారస్వరాలతో కూడిన కొత్త రకమైన ఆందోళన రూపాలు పురుడు పోసుకుంటున్నాయి. అందుకే మొదట అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలకే పరిమితమైన సీఏఏ, ఎన్ఆర్‌సి వ్యతిరేక ఆందోళనలు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఒడిషా, చత్తీసఘడ్ వంటి రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ఆందోళనలు పెల్లుబికాయి. పదికి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో సిఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను అమలుచేసేది లేదని తమ వ్యతిరేకతను కేంద్రానికి తెలియజేశాయి.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర ధరలు, ఆగని రైతుల ఆత్మహత్యలు, తీవ్రమవుతున్న మహిళలపై అత్యాచారాలు, పడిపోతున్న జిడిపి, కాటికి కాలు చాపిన దేశ ఆర్థిక వ్యవస్థతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం చెందుతున్నారు. సిఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్ చట్టాలను హడావిడిగా తీసుకురావటం యొక్క ఉద్దేశ్యం అనేక సమస్యలతో ఆందోళన చెందుతున్న ప్రజల దృష్టిని మరల్చి హిందూ - ముస్లింల మధ్య అల్లర్లు రెచ్చగొట్టి, తమ హిందూత్వ విధానాన్ని ప్రజలపై రుద్దాలని పాలకులు ప్రయత్నిస్తున్నారు.
అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం సహోదరత్వాన్ని చాటుతూ దేశం కోసం పోరాడి అమరులయ్యారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే ప్రజాస్వామ్య దేశంలో, లౌకికవాద రాజ్యంలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆ అమరుల స్ఫూర్తితో విద్యార్థి లోకం తీవ్రంగా వ్యతిరేకించాలి. త్వరలో దేశమంతా అమలుచేయబోతున్న సిఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను అడ్డుకోవాలి. దేశంలో, విద్యా సంస్థల్లో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణం కోసం విద్యార్థులు, లౌకికశక్తులు నడుం బిగించాలి.
అభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ తేదీ : 10-02-2020,విజయవాడ
ప్రచురణ : ఎ.సురేష్ , రాష్ట్ర ప్రధానకార్యదర్శి, పిడిఎస్ఓ
(నాలుగేళ్ళ క్రిందటి కరపత్రం)

