మార్చి 23 భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 93వ వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటదినంగా పాటిద్దాం!
మిత్రులారా!
బ్రిటీషు సామ్రాజ్యవాదుల దోపిడీ, పీడనల నుండి విముక్తికై సాగిన జాతీయోద్యమంలో కార్మికులు, రైతులు, ఆదివాసులు, మహిళలు, విద్యార్థి యువకులు ఉవ్వెత్తున పాల్గొన్నారు. వారిలో భగత్‌సింగ్ ఒకడు. కుటుంబంలో వున్న జాతీయోద్యమ ప్రభావం చిన్నవయసులోనే భగత్‌సింగ్‌పై పడింది. అప్పటికే రష్యాలో నిరంకుశ జారు చక్రవర్తుల, పెట్టుబడిదారుల, భూస్వాముల దోపిడీ నుండి విముక్తి గావించిన లెనిన్ స్ఫూర్తితో భారత దేశంలోనూ సోషలిస్టు వ్యవస్థను నిర్మించాలని పరితపించాడు. ఆ ఆశయ సాధనకై నిమగ్నమై వున్న భగత్‌సింగ్, అతని సహచరులైన రాజ్‌గురు, సుఖదేవ్‌లను బ్రిటీషు సామ్రాజ్యవాదులు వారితో మిలాఖత్ అయిన భారత బడా సంపన్నవర్గాలు కలిసి 1931 మార్చి 23న ఉరిశిక్ష పేరుతో హత్య చేశారు. నాటి నుండి భగత్ సింగ్ యువతకు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట ప్రతీకగా నిలిచాడు.
దేశంలోను, రాష్ట్రంలోను ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పాలకవర్గ పార్టీలు యువతను మరోసారి మాయ చేయడానికి అనేక పథకాలను ప్రకటిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ 5 సం౹౹ల కాలంలో 5 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న హామీ బుట్టదాఖలు అయింది. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా 897 గ్రూప్-2, 6100 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 897 గ్రూప్-2 ఉద్యోగాలకు 4,83,535 మంది దరఖాస్తు చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా వుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొద్దిపాటి ఉద్యోగాలైన యువతకు దక్కుతాయా అన్నది చివరివరకు ఉత్కంఠే.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా వున్న 30 లక్షలకు పైగా ఉద్యోగాలను, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా వున్న 2.30 లక్షల ఉద్యోగాలను ప్రపంచబ్యాంకు ఆదేశాల్లో భాగంగా ఉద్దేశ పూరితంగానే పాలకులు భర్తీ చేయడంలేదు. సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు తమకు కావాల్సిన కారుచౌక కూలీలు దొరికే మార్కెట్టుగా భారతదేశాన్ని మార్చారు. 30 కోట్లకుపైగా యువత తాము చదువుకున్న చదువుకు తగ్గ ఉపాధి దొరకక వారి యొక్క శక్తి, సామర్థ్యాలు వృథా అవుతున్నాయి.
వ్యవసాయరంగాన్ని పాలకులు ఉద్దేశపూరితంగానే తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేసి, పేద, మధ్యతరగతి రైతులను వ్యవసాయం నుండి దూరంచేసి లక్షలాది ఎకరాల భూములను సామ్రాజ్యవాద కంపెనీలకు, దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను, వ్యవసాయాధారిత పరిశ్రమలన్నింటిని అమ్మివేయడమో లేదా మూసివేయడమో చేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి దొరకక హైదరాబాద్, ముంబై, చెన్నై తదితర మహానగరాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్ళి కడు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీలో 111వ స్థానంలో మనదేశం వుందంటే ఈ 76 సం||ల స్వతంత్ర పాలనలో మన పాలకులు సాధించిన ప్రగతి ఏమిటో యువత గ్రహించాలి.
సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు మరియు దేశంలోని బడా సంపన్నవర్గాలు యువతలో వస్తు వ్యామోహ సంస్కృతిని, కెరీరిజాన్ని పెద్దఎత్తున వ్యాప్తి చేస్తున్నాయి. మన పాలకులు మద్యం, మత్తుపదార్థాలను కుమ్మరిస్తూ యువతను మత్తులో ముంచెత్తుతున్నారు. పబ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆన్లైన్ గేమ్‌లకు యువతను బానిసలను చేసి వారియొక్క కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయి. ఈ మాయలన్నింటి నుండి యువత బయటపడాలి. అతిచిన్న వయసులోనే సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం, దేశం కోసం అశువులు బాసిన భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల స్ఫూర్తితో అందరికీ విద్య, వైద్యం, ఉపాధిహక్కుకై, దేశంలోని సమస్త సంపదలను దోచుకెళుతున్న సామ్రాజ్యవాద సంస్థలపై, వారికి జోహుకుం అంటున్న పాలకుల విధానాలపై పోరాడటమే భగత్‌సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి.
యువత ఆలోచించాల్సినవి - పాలకులను నిగ్గుదీయాల్సినవి
* ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న కేంద్ర ప్రభుత్వ, ప్రతీ సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకై యువత నడుం బిగించాలి.
* ప్రభుత్వరంగ సంస్థలైన పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, భీమా, పోస్టల్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రజారవాణాను ప్రైవేటుపరం చేస్తుంటే యువతకి ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయి? ప్రైవేటు సంస్థల్లో లభించే కొద్దిపాటి ఉద్యోగాలైన యువతకు ఉద్యోగ భద్రతను కల్పిస్తాయా?
* కేంద్రం చేసిన అప్పు 155.6 లక్షల కోట్లు, రాష్ట్రం చేసిన అప్పు 9.16 లక్షల కోట్లతో ప్రతి ఒక్కరిపై పడుతున్న భారం ఎంత? ఈ లెక్కన ప్రతి పౌరుడిపై, పుట్టబోతున్న ప్రతి బిడ్డపై షుమారు 3 లక్షల వరకు అప్పు వుంటుంది. చేసిన అప్పులు, ప్రజల వద్ద నుండి వసూలు చేస్తున్న పన్నులు ఎవరి వద్ద పోగుపడుతున్నాయి?
* వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసి, వ్యవసాయాధారిత పరిశ్రమలను మూసివేసి కోట్లాది మంది కారుచౌక కూలీలు దొరికే మార్కెట్టుగా భారత్‌ను ఎందుకు మార్చుతున్నారు?
* మద్యం, మత్తుపదార్థాలను, ఆన్లైన్ వీడియో గేమ్లు, కెరీరిజం పేరుతో యువతను ఎందుకు ప్రక్కదారి పట్టిస్తున్నారు?
* సమస్త అడవులను సామ్రాజ్యవాదులకు, దేశంలోని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి అడవి బిడ్డలైన ఆదివాసులను నిరాశ్రయులను చేస్తున్న పాలకులను నిగ్గుదీయాల్సిన బాధ్యత యువతది కాదా?
* అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని గొంతెత్తి నినదించాలి.
* వ్యవసాయరంగంలో సామ్రాజ్యవాదుల జోక్యాన్ని అరికట్టి, రైతాంగం పండించే అన్నిరకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
* మూతపడిన వ్యవసాయాధారిత పరిశ్రమలైన జూట్, స్పిన్నింగ్, పంచదార, టెక్స్టైల్ తదితర పరిశ్రమలను తెరిచి, మరెన్నో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలి.
* ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సీని ప్రకటించి, గిరిజన యువతకు ఉద్యోగాలను కల్పించాలి.
విప్లవాభినందనలతో
నవయువ సమాఖ్య (NYS),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ తేదీ : 07.03.2024, విజయవాడ


