ప్రజా కళ కోసం ప్రాణాలర్పించిన సాంస్కృతిక యోధుడు సఫ్దర్ హష్మీ

0
    1989, జనవరి 1 వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ పట్టణం మొత్తం మున్సిపల్ ఎన్నికల హడావుడితో సందడిగా ఉంది. పట్టణంలోని పెద్దదైన కార్మికుల బస్తీ మరింత సందడిగా ఉంది. 'జనామ్' కళాకారులు 'హల్లా బోల్' (గొంతెత్తండి) వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. గుమిగూడిన కార్మికులు ఆసక్తిగా ప్రదర్శనలో లీనమైపోయారు.
    ఇంతలో నాటకం ప్రదర్శిస్తున్న కళాకారులపై కాంగ్రెస్ గూండాలు కత్తులతో దాడి చేసి స్వైరవిహారం చేశారు. ఆ దాడిలో తీవ్రగాయాలతో ఓ కళాకారుడు నెత్తుటి మడుగులో ఒరిగిపోయాడు. అయినా అతడి గొంతులో 'హల్లా బోల్' నినాదం ఆగిపోలేదు. ఓ రోజంతా మృత్యువుతో హోరాహోరీగా పోరాడిన ఆ కళా యోధుడు 2వ తేదీన కన్నుమూశాడు.
    అంత విషాదంలో కూడా అతని భార్య మోలాశ్రీ ఆధ్వర్యంలో ఎక్కడైతే ప్రదర్శన మీద దాడి జరిగిందో కచ్చితంగా అక్కడే 4 వతేదీన అదే నాటకం ' హల్లా బోల్ ' ని జనామ్ కళాకారులు ప్రదర్శించారు. ముప్పైఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. ప్రజా సాంస్కృతిక శిబిరంలో ఓ మరుపురాని మైలురాయిగా నిలిచిపోయింది. ఆ కళాకారుడి పేరు "సఫ్దర్ హష్మీ".
    సఫ్దర్ హష్మీ ఒక ప్రజా కళారూపాల నాటక రచయిత, నటుడు, దర్శకుడు, కవి, సిద్ధాంతకర్త. ప్రధానంగా భారతదేశంలో వీధి నాటకం అనే ప్రక్రియని ఓ బలమైన ఆయుధంగా ప్రవేశపెట్టిన ప్రయోక్త. ఈ దేశ రాజకీయ సాంస్కృతిక రంగస్థలంలో ఇప్పటికీ ఒక ముఖ్యమైన గొంతుగానే హష్మీ పరిగగణించబడుతూనే వున్నాడు.
    ఏప్రిల్ 12, 1954 న ఢిల్లీలో జన్మించిన హష్మీ బాల్యమంతా వామపక్ష వాతావరణం మధ్యే గడిచింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఆంగ్లసాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. విద్యార్థి దశలో చురుకుగా పని చేసిన హష్మీ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ తరుపున 1973లో జన నాట్య మంచ్ ( జనామ్) కళాబృందాన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా వీధినాటకాల్ని ప్రదర్శించడం ప్రారంభించారు.
    బ్రెహ్ట్ థియేటర్ పద్దతుల్ని అధ్యయనం చేసిన హష్మీ నాటకాన్ని ప్రజల దగ్గరకు, ప్రజా సమస్యల ముంగిటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. అప్పటినుంచి కర్మాగారాలూ, వర్క్ షాప్ లూ, శ్రామికుల బస్తీలే అతని రంగస్థలాలు అయ్యాయి. ఎమర్జెన్సీలో నిర్బంధం పెరగడంతో కాశ్మీర్ లో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేశారు.
    1978 నుంచి వెనుతిరిగి చూడకుండా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వీధినాటికల్ని ప్రదర్శించారు. సుమారు 24 వీధినాటకాలతో 4 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
    ఇందిరా గాంధీ ఎన్నికల రిగ్గింగ్ పై రూపొందించిన 'కుర్సీ కుర్సీ కుర్సీ', రైతు సమస్యలపై రూపొందించిన 'గావ్ సే షాహార్ తక్', అవినీతి మీద రూపొందించిన 'హత్యారే', మహిళలపై జరిగే హింసని వ్యతిరేకిస్తూ రూపొందించిన 'ఔరత్', దోపిడీ రాజకీయాల్ని ఎండగడుతూ రూపొందించిన 'హల్లా బోల్' వీధినాటకాలు సంచలనం సృష్టించాయి.
    ఫాసిజానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డ వీధినాటకం రాజ్యానికి సహజంగానే కంటకప్రాయం అయింది. దాంతో హష్మీ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. తుదికంటా తన కళను ప్రజలకే అంకితం చేసిన సఫ్దర్ హష్మీకు PDSO విప్లవ జోహార్లర్పిస్తుంది

Post a Comment

0Comments
Post a Comment (0)