1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గాంవ్‌లో సావిత్రిబాయి జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సున జ్యోతిరావుపూలేను వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు ఫూలే మొదటి గురువు. విద్యా జ్ఞానం నేర్పి సామాజికోపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1847 నాటికి భర్తతో కలిసి శూద్రకులాల బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం, అప్పటి పెత్తందారీ వర్గాలకు నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు.
బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో, స్త్రీ హక్కుల పారాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరువలేము. నాటి సామాజికోద్యమాలలో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి. అప్పటి ఆధిపత్య వర్గాల చేతుల్లోని ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో పీడిత ప్రజల పక్షపాతిగా అగ్రభాగాన నిలిచి మహిళలను చైతన్యులను చేశారు. 1852లోనే మహిళాసేవ మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు.
దేశంలో గొప్ప సామాజిక ఉపాధ్యాయుడు, సంఘసంస్కర్త అయిన జ్యోతిరావ్ ఫూలేకి అన్ని రకాలుగా తన అండదండల్నిచ్చింది. భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకితమైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర, వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్స రం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది.
1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్‌కాశీ సుభోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాలకోసం శక్తికి మించిన ఖర్చులుచేసి అప్పులపాలయ్యే వాళ్ళను విమర్శిస్తూ "కర్జ్" అనే వ్యాసం రాశారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి హేతుబద్దత కవితల్లో ప్రతిబించించేవారు.
గొప్ప కవి, రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. మూఢ నమ్మకాలకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సావిత్రి భాయి ఫూలేకి PDSO విప్లవ జోహార్లర్పిస్తుంది.

