ఈ పుస్తకంలోని వ్యాసాలు 2020-23 మధ్యకాలంలో స్టూడెంట్ బులెటిన్‌లో ముద్రితం అయినవి. ఆ కాలం అంటే కోట్లాది మంది మానవ సమూహాలను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకున్న కాలం. ఈ తరం మానవజాతి చవిచూసిన, ఎదుర్కొన్న భయంకరమైన సంక్షుభిత, మదనష్టపు కాలం. అయితే ఇంతటి గడ్డు కాలాన్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వంచనాత్మక కళలో ఆరితేరిన పాలకులు ఈ కాలాన్ని తమకు అనుకూలంగా ఎలా మలుచుకున్నారో, విద్యారంగంలో ఆ కళను ఎలా అమలు జరిపారో, విద్య ద్వారా కార్పొరేటు శక్తులకు కనక వర్షం ఎలా కురిపించారో ఈ వ్యాసాలలో మనం చదువుతాం. ఇదే అదునుగా శాస్త్రీయ విధానం పట్ల సైన్సు పురోగతి పట్ల ఇసుమంత గౌరవం లేని పాలకులు ఎన్నాళ్ళగానో తమ మెదళ్లలో తిష్టవేసుకున్న బూజుపట్టిన మధ్యయుగ కాలపు అవశేషాలను మళ్లీ పాఠ్యగ్రంథాలలో చేర్పించడం, తమకు కంటగింపుగా ఉన్న శాస్త్రీయ, ప్రజాస్వామ్య పాఠ్యాంశాలను తొలగించడానికి పూనుకున్నారు. పై మొదలగు విషయాలను వివరించే వ్యాసాలు ఈ పుస్తకంలో చాలానే ఉన్నాయి. అంతేకాదు ఈ పుస్తకంలో పాలకవర్గాలు విద్యను ప్రజలకు ఏ రూపంలో అందివ్వాలో, ఏ రూపంలో అందివ్వకూడదో కూడా వివరాలు ఉన్నాయి.


