---PDSO-NYS-----
మిత్రులారా!
విద్య సామాజికాభివృద్ధికి, సామాజిక మార్పుకి దోహదపడుతుంది. అందుకే విద్య రాబోయే తరాలను సమాజంలో అవిభాజ్య అంగంగా తయారుచేసే ముఖ్యసాధనంగా సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తారు. కానీ విద్యారంగంలో భారత పాలకులు అవలంభిస్తున్న విధానాలు విద్యను రోజురోజుకూ అథమ స్థాయిలోకి, సంక్షోభంలోకి నెడుతున్నాయి.
గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు కాషాయీకరణను జత చేసి, వీటిని వేగంగా అమలు చేయుటకు మన కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం- 2020ను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. విద్యార్థుల మెదళ్లను మొద్దు బార్చి, విద్వేషపు మత్తులో ముంచుటకు అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాలలోకి చొప్పించి, మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. శాస్త్రీయ, ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని ఈ జాతీయ విద్యా విధానం-2020ను, మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో, దూకుడుగా వ్యవహరిస్తూ దాన్ని అమలు చేయడం కొరకు విద్యారంగ ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ ను మార్చింది. ప్రాథమిక పాఠశాలల విలీనం-మూసివేత, తెలుగు మీడియం రద్దు, సిబిఎస్‌సిఇ, ఐబి సిలబస్, టోఫెల్ అమలు,బైజూస్‌తో ఒప్పందం, ట్యాబ్లు, డిజిటల్ ప్యానల్ల పంపకం.... ఇలా రోజుకొక కొత్త పేరుతో, అస్తవ్యస్త విధానాలతో అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను గందరగోళపరుస్తుంది. లక్షల కోట్లు ఖర్చుపెట్టి విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీలో నిలబడేలా తీర్చిదిద్దుతున్నాం అని చెబుతున్న రాష్ట్ర పాలకులు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50వేల టీచర్ పోస్టులలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తారు?!
ప్రైవేట్, కార్పొరేట్, విదేశీ కంపెనీలలో చవకబారు కూలీలుగా విద్యార్థులను తయారు చేసే ఎన్‌ఇపి-2020లో భాగంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యను నాలుగేళ్లకు పెంచడం, ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికెట్ ఇస్తాననడం, మల్టీ ఎంట్రీ - మల్టీ ఎగ్జిట్, చదువుతున్న చదువుకు చేసే పనికి సంబంధం లేని ఇంటర్న్ షిప్ విధానాలను ప్రవేశపెట్టింది. వీటి ఫలితంగా పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నిర్మించకుండా, ఉన్న వాటిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించకుండా, అధ్యాపకులను నియమించకుండా ప్రభుత్వ కళాశాలలను నాశనం చేస్తున్నారు. మరోవైపు వీధికొక ప్రైవేటు విద్యా సంస్థకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఉన్నత విద్యను పరిశీలిస్తే దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కేంద్రం అత్యల్పంగా నిధులను కేటాయిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల వలె విశ్వవిద్యాలయాలు మౌలిక సదుపాయాల కొరతతో సమస్యల నిలయాలుగా ఉన్నాయి. 2023-24 టైమ్స్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 200 యూనివర్సిటీలలో భారతదేశంలోని యూనివర్సిటీలకి ఒక్క ర్యాంకు కూడా దక్కలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించి, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులను ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీనివల్ల ఇప్పటికే ఫీజుల దోపిడీ కారణంగా ఉన్నత విద్య అత్యంత ఖరీదైనదిగా మారి, పేద విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలకు దూరం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ శక్తులను సైతం విద్యారంగంలోకి ఆహ్వానించి, విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇస్తున్నాయి.
ఇన్ని సమస్యలను దాటుకొని చదువులు పూర్తిచేసుకుని బయట వస్తున్న విద్యార్థులకు ఉపాధి అనేది నెరవేరని కలగానే మిగిలిపోతోంది. గత ఎన్నికల సమయంలో యువత ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాల కల్పన వాగ్దానాల వర్షం కురిపించారు పాలకులు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తానేమి తక్కువ తినలేదు అంటూ ప్రతి సంవత్సరం జనవరి కల్లా రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తానని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర పాలకులు ఐదేళ్లలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయలేదు. కొత్త ఉద్యోగాల కల్పన ఊసే లేదు. ఇది చాలదన్నట్లు ఒక్కొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నారు.ఆఖరికి రక్షణ రంగంలో సైతం కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలను భర్తీ చేస్తానంటూ అగ్నిపధ్ ను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగుల్లో అసహనం తారస్థాయికి చేరి, వారిలోని బాధ, ఆవేశం రైళ్లను తగలబెట్టడం లాంటి చర్యల రూపంలో బయటికి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక విధానాలను ఏ మాత్రం కూడా వ్యతిరేకించకుండా దాని అడుగుజాడల్లో నడుస్తూ, ఇంకా చెప్పాలంటే దాని అడుగులకు మడుగులు ఒత్తుతున్న రాష్ట్ర ప్రభుత్వం 5 వేలు,10 వేలు వేతనం ప్రకటించిన వాలంటీర్, సచివాలయం పోస్టులను తీసి, తాను ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు ప్రకటించుకుంటుంది (ఓట్ల రాజకీయాల్లో భాగంగా ప్రతి ఓటర్ను తన పట్టు లో ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ ఉద్యోగాలు కల్పన). 6 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటిస్తే రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ( పిహెచ్డి, పిజి, ఎంటెక్ చేసిన వారు సైతం) అప్లై చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో దేశంలోని యువత ప్రైవేట్, కార్పొరేట్, విదేశీ కంపెనీలలో పనికి చేరుతున్నారు. ఈ కంపెనీలలో అత్యధిక పని గంటలతో కూడిన వెట్టి చాకిరి, చేసే పనికి వందల రెట్ల వ్యత్యాసంతో అత్యల్ప వేతనం, దుర్భర పని పరిస్థితులు, భారీ టార్గెట్లతో అత్యధిక పని ఒత్తిడి, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగాలతో బానిసల్లా యువత పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత నారాయణమూర్తి "దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలంటూ" దుర్మార్గకరపు వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధి కేవలం క్వాంటిటీ ఆఫ్ వర్క్ కంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. పనికి తగ్గ జీతం ఇవ్వకుండా, పని పరిస్థితులను మెరుగుపరచకుండా తమకు ఎటువంటి హక్కు లేని కంపెనీలలో ఉద్యోగులను బానిసల్లా పనిచేయమనే కదా అర్థం. జీవితం అంటే కేవలం పని మాత్రమే కాదు. ప్రశాంతంగా నిద్రపోయే హక్కు, కుటుంబంతో సంతోషంగా గడిపే హక్కు, యంత్రాల్లా పనిచేయడం కాకుండా సృజనాత్మకంగా, సంతోషంగా జీవించే హక్కు ఉద్యోగులకు ఉంటుంది. ఇవన్నీ యువత ఆలోచించనీయకుండా చేయుటకే యువత శ్రమను దోపిడీ చేసి ప్రపంచ కుబేర్లుగా మారిన ఇటువంటి గుత్త పెట్టుబడిదారులు, దేశ సంపదను తరలించుకుపోతున్న సామ్రాజ్యవాదులు దేశ అభివృద్ధి పేరు చెప్పి ఇలా యువతని, మేధావులను మభ్యపెడుతున్నారు.
పేదలను విద్య నుండి దూరం చేసి, నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తూ పాలకులు అనుసరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ అనుకూల విధానాలను విద్యార్థులకు, యువతకు అర్థం కానియ్యకుండా చేయుటకు అనేక విధాలుగా వారిని పక్కదారి పట్టిస్తున్నారు. కెరీరిజాన్ని పెంచి పోషిస్తూ రాజకీయాలకు విద్యార్థులను దూరం చేస్తున్నారు. మద్యం, గంజాయి, అశ్లీల సినిమాలు, వీడియోల మత్తులో యువతను ముంచుతున్నారు. కులాల, మతాల, ప్రాంతాల వారీగా విభజించి, ఆ విద్వేషాలను వారిలో రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం బలి తీసుకుంటున్నారు. మళ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో యువతను డైవర్ట్ చేయటానికి మరిన్ని కొత్త హామీలతో, ప్రచారాస్త్రాలతో పాలక పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే మనం క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే 75 ఏళ్ళుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగాలను నాశనం చేయడం తప్ప, విద్యార్థులు, యువజనులెదుర్కొంటున్న సమస్యలలో ఒక్కదాన్ని కూడా పరిష్కరించలేదు.
విద్యను ఒక సరుకుగా మార్చి ప్రయివేట్, కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు పాదాక్రాంతం చేసి, వారికనుకూలమైన విద్యా విధానాలను రూపొందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను విద్యార్థులు వ్యతిరేకించాలి. విద్యా కార్పోరేటీకరణ, కాషాయికరణకు వ్యతిరేకంగా పోరాడాలి. అందరికీ విద్యా హక్కును సాధించుకోవాలి. అంతేకాక నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ, యువత శ్రమను కారు చౌకగా దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాద, బహుళ జాతి కంపెనీలను, వారి తొత్తులుగా వ్యవహరిస్తూ, వాటి అనుకూల విధానాలను చేపడుతున్న పాలకుల విధానాలను వ్యతిరేకించాలి. అందుకోసం విద్యార్థి, యువతరం కలిసి సంఘటితంగా మన హక్కులకై పోరాటాలు సాగించి, తద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో "విద్యా, ఉపాధి రంగాల్లోని సంక్షోభం - పాలకుల విధానాలు - విద్యార్థి, యువజనుల కర్తవ్యాలు" అనే అంశంపై పిడిఎస్ఓ - ఎన్‌వైయస్ సంస్థలుగా రాష్ట్ర సదస్సును డిసెంబర్ 22న గుంటూరులో నిర్వహిస్తున్నాం. దీనికి మీ ఆర్థిక, హార్దిక సహాయ, సహకారాలను అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
నవయువసమాఖ్య(NYS)
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ :
ఎ.సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, PDSO
ఎస్.కె.బాషా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,NYS
ప్రచురణ తేదీ : 02-12-2023, విజయవాడ


