అమెరికా సామ్రాజ్యవాదానికి తలవంచని విప్లవ వీరుడు ఫిడెల్ క్యాస్ట్రో

0
    “నీ మిత్రులెవరో తెలిస్తే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. నీ శత్రువులెవరో తెలిస్తే నీ సామర్ధ్యం అర్థమవుతుంది” అన్న కామ్రేడ్ ఫిడెల్ క్యాస్ట్రో, కేవలం 90 మైళ్ళ దూరంలో వున్న సామ్రాజ్యవాద అమెరికాతో 57 ఏళ్ళపాటు రాజీ ఎరుగకుండా పోరాడిన యోధుడు, తలవంచని వీరుడు.
    1926 ఆగస్టు 13న జన్మించిన ఫిడెల్ అలెగ్జాండ్రో క్యాస్ట్రో రూజ్ 1953లో క్యూబా నిరంకుశపాలకుడైన బటిస్టా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. జైలు పాలై క్షమాభిక్షతో 1956లో విడుదలై తిరిగి విప్లవ ప్రయత్నాలు చేశారు.1959లో చేగువేరా సాహచర్యంతో విప్లవ విజేతగా నిలిచారు. 1976 వరకు క్యూబా ప్రధానిగా, తర్వాత 2006 వరకు క్యూబా అధ్యక్షునిగా 47 ఏళ్ళపాటు అనేక ఒడిదుడుకులు, వత్తిళ్ళు నడుమ దేశాభివృద్ధికి కృషిచేశాడు. నిరక్షరాస్యత నిర్మూలనలో, వైద్యసౌకర్యాల అభివృద్ధిలో, చెరుకు ఉత్పత్తిలో ప్రపంచ గుర్తింపు వచ్చే విధంగా కృషిచేశారు. 638 సార్లు అమెరికా గూఢచారి సంస్థ (సిఐఎ) క్యాస్ట్రో పై హత్యాయత్నాలు చేసింది. క్యూబాను ఆర్ధికంగా, రాజకీయంగా విచ్ఛిన్నం చేయాలనే కుట్రలను తిప్పికొడుతూ, ప్రపంచ పీడిత ప్రజల నేస్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తికి, చెక్కుచెదరని సామ్యవాద ఆదర్శానికి నమూనాగా కామ్రేడ్ ఫిడెల్ క్యాస్ట్రో నిలిచాడు.
    బటిస్టా న్యాయస్థానంలో, “చరిత్ర నన్ను నిర్దోషిగా నిలుపుతుంద”ని క్యాస్ట్రో చేసిన వీరోచిత ఉపన్యాసంలో వ్యక్తంచేసిన విధంగా పోరాడుతున్న ప్రజానీకంలోనూ, వారి అంతిమ విజయంలోనూ ఆయన యొక్క అంతులేని నమ్మకం-క్యూబాలోనూ, లాటిన్ అమెరికాలోనూ, కరేబియన్ దీవుల నుండి ఆఫ్రికా, ఆసియా దేశాల వరకు, అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటా పోరాడే యువతలో స్ఫూర్తిని రగిల్చేదిగా నిలుస్తుంది. నవంబర్ 25,2016న మరణించిన ఫిడెల్ కాస్ట్రో కు 7వ వర్థంతి సందర్భంగా PDSO విప్లవ జోహార్లు తెలుపుతుంది.

Post a Comment

0Comments
Post a Comment (0)