విద్య, ఉపాధి రంగ సమస్యలపై అనకాపల్లిలో జిల్లా సదస్సు

0
    "విద్యా రంగ సమస్యలు - ఉపాధి అవకాశాలు” అనే అంశంపై స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.
    ఈ సదస్సులో PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్ మాట్లాడుతూ "నేడు దేశంలో 2 కోట్ల మందికి పైగా చిన్నారులు విద్యకు దూరం గా ఉన్నారని, చెత్త కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు ఏరుకునే వాళ్ళుగా ఆఖరికి మొన్న జరిగిన దీపావళికి జ్యోతి ఆరిపోయిన ప్రమిదల్లో మిగిలిన నూనెను పట్టుకెళ్లే దౌర్భాగ్య పరిస్థితిలో బాలలు ఉన్నారని ఏం సాధించామని మనం బాలల దినోత్సవం జరుపుతున్నామని ప్రభుత్వాలని ప్రశ్నించారు. 2010 వరకు మనకు విద్య ఒక హక్కుగా కూడా గుర్తించలేదని, ఇప్పటికీ కూడా 10 మిలియన్ల మంది విద్యకు దూరంగా నెట్టివేయబడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యను పేద బడుగు బలహీన వర్గాలకు అందించేదిగా కాకుండా విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి చూస్తుందని అందులో భాగంగానే ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను తొలగిస్తుందని అన్నారు. అందరికీ విద్య ఒక హక్కుగా అందించాలని శాస్త్రీయ, ప్రజాతంత్ర, స్వతంత్ర విద్యా విధానం కోసం విద్యార్థి, యువతరం పోరాడాలని పిలుపునిచ్చారు."
    PDSO రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ మాట్లాడుతూ "ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి నిరుద్యోగుల్ని మోసం చేశారని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ గారు కూడా యువతను మోసగించారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా పైపెచ్చు మోనిటైజేషన్ ఆఫ్ పైపులైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని విమర్శించారు. డిగ్రీలో సెమిస్టర్ సిస్టం తీసుకొచ్చి విద్యను నాశనం చేశారని, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో డిగ్రీని మూడేళ్ల నుండి నాలుగేళ్లకు పెంచి నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీజీ ఒక సంవత్సరం చదివితే సరిపోతుందని ఇలా రకరకాలుగా అస్తవ్యస్తంగా ఈ విధానాల్ని తీసుకొస్తూ విద్యారంగం మొత్తాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ బిల్లులు రిలీజ్ చేయాలని, కొత్తగా తీసుకొచ్చిన తల్లి ఎకౌంటు కి స్టూడెంట్ ఎకౌంటు లింకు చేయాలని పెట్టిన పద్ధతిని తక్షణమే నిలుపుదల చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రీయంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
    పిడిఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.రుద్రీ మాట్లాడుతూ “కరోనాకాలంలో తీసుకొచ్చిన ఆన్లైన్ విద్యా విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఎనిమిదో తరగతికి ఇచ్చిన ట్యాబ్లు విద్యార్థికి సరిగా ఉపయోగపడకపోగా పైపెచ్చు విద్యార్థులు నష్టం చేస్తుందన్నారు. మార్కులు ర్యాంకుల కోసం మాత్రమే చదువుతున్న విద్యార్థులు.. మార్కులు రాక బలవన్మరణాలకి పాల్పడుతున్నారని, ఒక సమస్య వస్తే దానిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని కూడా ఈ చదువులు ఇవ్వలేకపోతున్నాయన్నారు.
    ఈ సెమినార్ కు పిడిఎస్ఓ అనకాపల్లి జిల్లా నాయకురాలు పి.మౌనిక అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు జానకిరామ్, రాజేష్, మిత్ర, జాస్మిన్, పద్దు, కిషోర్, పి.శ్రీహరి మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవ అభినందనలతో……
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
అనకాపల్లి.

Post a Comment

0Comments
Post a Comment (0)