PDSO పత్రిక `స్టూడెంట్` ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభకు కామ్రేడ్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు గారు పంపించిన... అభినందన సందేశం!

0
ప్రియమైన కామ్రేడ్స్!!
‘స్టూడెంట్ బులెటిన్’ ఆవిష్కరణ సందర్భంగా నాకు ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞతలు. ఈ బులెటిన్ లో విలువైన వ్యాసాలు ఉన్నాయి. విజ్ఞానదాయకంగానూ ఉన్నాయి. వీటిని ఎక్కువ మందితో చదివించేందుకు మీరు ప్రయత్నించగలరని ఆశిస్తున్నాను.
మా రోజుల్లో ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) పతాకం కింద పనిచేశాం. స్వాతంత్ర్యం రాకముందు దాని లక్ష్యం 'స్వాతంత్య్ర్యం, శాంతి, అభ్యుదయం'. స్వాతంత్య్రానంతరం 'శాంతి, అభ్యుదయం, సోషలిజం' లక్ష్యంతో కృషిచేశాం.
నేను పనిచేసే రోజుల్లో గోవా విముక్తి పోరాటం విజృంభించింది. అనేకమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రరాష్ట్ర సాధనలో విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అలాగే విశాఖలో ఉక్కు కర్మాగారం-మా హక్కు నినాదం కూడా మార్మోగింది. ఇంకా అనేక సామాజిక - రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం.
నాకు గొప్ప అనుభవం ఏమంటే... విద్యార్థి, యువజనులకు రాజకీయ శిక్షణ శిబిరాలు వందల సంఖ్యలో నిర్వహించాం. రెండు తరాల నాయకత్వాన్ని ఆ పాఠశాలల ద్వారా తయారుచేశాం.
నేడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం దురాక్రమణ యుద్ధాలకు పాల్పడుతున్నది. సోషలిజం లక్ష్యంతో పనిచేసే దేశాలలో పరిపూర్ణ అక్షరాస్యతను సాధించారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపారు. వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పెట్టుబడిదారీ దేశాల్లో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో సంక్షోభం నెలకొన్నది. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించలేక పోయాయి. భారతదేశంలో నేడు మతోన్మాదం పెచ్చరిల్లింది. చరిత్రకు వక్రభాష్యం చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులలో విరివిగా కరపత్రాల ద్వారా ప్రచారం చేయగలగాలి. చిన్న చిన్న బుక్లెట్స్ ను విడుదల చేయాలి. రాజకీయ శిక్షణా తరగతులను సాధ్యమైనంత ఎక్కువగా నిర్వహించాలి.
మీ కృషి జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
అభినందనలతో...
ఈడ్పుగంటి నాగేశ్వరరావు
విశాలాంధ్ర పూర్వ సంపాదకులు,
తేదీ:15-04-2023,
విజయవాడ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)