పరిణామవాదాన్ని పాతరేయడమంటే...భవిష్యత్తరాలను అజ్ఞానపుటంధకారంలోకి, దేశాన్ని పాత రాతియుగంలోకి నెట్టడమే!
శాస్త్రీయ పాఠ్యాంశాలను తొలగించి, విద్యార్థుల మెదళ్ళలో అశాస్త్రీయ భావాలను నింపే ప్రయత్నం చేస్తున్న పాలకుల విధానాలను వ్యతిరేకించండి!
◆ మనిషి పరిణామ క్రమం చెందడమేంటీ?.. పాయసం త్రాగితేనో, పుత్ర కామేష్టి యాగం చేస్తేనో, సున్నిపిండితో బొమ్మ చేసి ప్రాణం పోస్తేనో, సూర్యుడు, వాయువు దేవుళ్ళ రూపంలో వచ్చి పుట్టిస్తేనో, చేప కడుపులో చెమట చుక్క పడి పిండమైతేనో, ఒకే పిండాన్ని వంద కుండల్లో వేసి పొదిగితేనో మనిషి పుట్టాడు తప్పితే.... మనిషి పరిణామం చెందడమేంటీ..విడ్డూరం కాకపోతేనూ! ఇదీ.. మనిషి పుట్టుకపై మన దేశాన్నేలే నేతల అవగాహనాస్థాయి. అందుకే విమానాల సాంకేతికత రామయణంలోని పుష్పక విమానం నుంచి వచ్చిందేనంటారు. సర్జికల్ స్ట్రైక్ హనుమంతుడే ప్రపంచానికి అందించాడు అంటారు. సెల్ టవర్లు ఎప్పుడో దేవాలయల్లో పెట్టామని ద్వజస్తంభం చూపుతారు. ముఖాన ఉన్న విభూది రేఖలు చూపి... ఇవే వైఫై పుట్టుకకు మూలం అంటారు. ఇవిగో సెల్ ఫోను ముత్తాతలు అంటూ భజన చెక్కలు చూపుతారు. దివ్య దృష్టి కథనాన్ని చూపి ఇదే పురాతన టెలివిజన్ అంటారు.మరి ఇంత సాంకేతికత మీ దగ్గర పెట్టుకుని విదేశాలనుంచి విమానాలతో సహా అన్నింటిని ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు అంటే ''ఇదిగో...మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు'' అంటారు. ఈ అజ్ఞాన పరంపరలో విజ్ఞానంపై జరిగిన మరో దాడే... డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల నుండి తొలగించడం.
◆ జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ ఇటీవల పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పదవ తరగతి సిలబస్ నుండి డార్విన్ జీవ పరిణామాల క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించడం వివాదంగా మారింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ 1800 మందికిపైగా శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి డార్విన్ సిద్ధాంతం ఎంతో ఉపకరిస్తుందని, అందువల్ల దీన్ని సెకండరీస్థాయి పుస్తకాల్లో ఉంచాలని శాస్త్రవేత్తలు కోరారు. డార్విన్ పరిణామ క్రమాన్ని తొలగిస్తే భావి తరాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏం చెప్పాలనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సైతం దైవత్వాన్ని ముడి పెడతారేమోనని అనుమానం పలువురిలో రేకెత్తుతున్నది.
//ప్రపంచానికి డార్విన్ యిచ్చిన కాంట్రిబ్యూషన్ ఏమిటి?//
◆ సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసినవాడు ఛార్లెస్ డార్విన్. జీవ జాతుల పుట్టుకపై 1859వ సంవత్సరంలో డార్విన్ రాసిన ‘జాతుల ఆవిర్భావం’ (ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్) ఒక సత్యాన్ని ఆవిష్కరించింది. ఆ సత్యమే ‘పరిణామం’. అప్పట్లో అదొక సంచలనం. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ భూమిపై నెలకొన్న అనంత జీవవైవిధ్యం పరిణామ ఫలితమని చాటాడు డార్విన్.
◆ మనం చూస్తున్న జీవులు, వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే. తద్వారా నాటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందటం జరిగింది. ఆ క్రమంలో సమర్థవంతంగా అడాప్టేషన్ చెందినవి బతికి బట్ట కట్టాయనీ, తట్టుకోలేనివి నశించాయనీ చెప్పాడు. అలా నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందనీ, ఎంపిక చేస్తుందనీ సూత్రీకరించాడు. అదే డార్విన్ 'నేచురల్ సెలక్షన్ థియరీ'గా ప్రసిద్ధి చెందింది.
◆ ఇదేదో ఊహాజనిత వాదం కాదు. విస్తృత పరిశీలన, అధ్యయనం దీనికి మూలం. డార్విన్ చరిత్రాత్మక నావ ప్రయాణం ‘హెచ్.ఎం.ఎస్. బీగిల్’లో 1831లో మొదలైంది. 1836 వరకు ఐదేళ్లపాటు కొనసాగింది. ఆ నావ ప్రయాణంలో చూసిన అబ్బురపరిచే జీవ వైవిధ్యం, డార్విన్ మదిలో కొత్త ఆలోచనలకు తెర తీసింది. జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి? వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు, వాటికి జవాబుల శోధనలో డార్విన్ లెక్కకు మిక్కిలి సాక్ష్యాలను సేకరించాడు. పురాతన జీవులకు చెందిన శిలాజాలనెన్నింటినో సేకరించి భద్రపరిచాడు.
◆ డార్విన్ దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరూ దేశానికి దగ్గరగా ఉన్న గెలాపాగోస్ దీవుల్లో ఫించ్ పక్షి జాతుల్లో తేడాలు గమనించాక తన డైరీలో ఇలా రాసుకున్నాడు "ఈ అనంతమైన వైవిధ్యానికి అంతులేని వైచిత్రికి ఒకే ఒక్క కారణం ఉండాలి. ఈ జీవరాసులన్నింటికి పూర్వీకులు ఒకరైతేనే తప్ప, ఈ పోలికలు మరియు తేడాలకు మరో కారణం దొరకదు. కోట్ల సంవత్సరాల క్రితం ఈ పూర్వీకులు ఈ భూభాగం నించి దీవులకు వలస వచ్చి క్రమేణా మార్పు చెందుతూ ఎక్కడివి అక్కడ జాతులుగా ప్రజాతులుగా విడిపోయి వుండాలి". ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికనిచ్చింది. తర్వాత ఈ కృషినంతటినీ ‘జాతుల ఆవిర్భావం’మనే సిద్ధాంతంగా ప్రతిపాదించాడు.
//సత్యాన్ని నిరూపించేదే సైన్స్//
◆ 160 ఏళ్ళ క్రిందట డార్విన్ పరిణామ సిద్ధాంతం విమర్శలు ఎదుర్కొందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేటి నానో యుగంలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి? కోతి నుండి మనిషి రావడాన్ని చూడలేద`నే వర్గమొకటి దేశంలో బయల్దేరింది.ముఖ్యంగా సత్యాన్ని చూడలేని, విజ్ఞానాన్ని అంగీకరించలేని బాపతు. దాచేస్తేనో, దాడి చేస్తేనో కనుమరుగయ్యేది కాదు సత్యం. రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్సు. అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. భౌగోళిక విస్తరణ, విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు, పిండ దశలో జీవులు చూపించే సారూప్యత, శిలాజ నిదర్శనాలు డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి. డార్విన్ తరువాతి కాలంలో అభివృద్ధి చెందిన సైన్సు సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దాయి.
◆ కోతుల నుండి మనుషులు వచ్చారని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. కోతులు, కొండముచ్చులు, చింపాంజీల వంటి జాతులకూ, మానవ జాతికీ మధ్య దగ్గరి పోలికలున్నాయనీ, ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చాయనీ, చింపాంజీల డీఎన్‌ఏ మనుషుల డీఎన్‌ఏతో 98.8 శాతం పోలి ఉంటుందనీ 2005లో వెలువరించిన చింపాంజీ జీనోమ్ చెబుతున్నది. సూక్ష్మజీవి నుండి మనిషి వరకూ అన్ని రకాల జీవులు ఒకేవిధమైన జీవన క్రియలను చూపుతాయి. అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం. అన్ని జంతువులూ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ను వదులుతాయి. ప్రొటీన్లు, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, జీవాణువులు జీవజాతులన్నింటిలో ఒకే రకమైన పదా ర్థాలతో నిర్మితమై ఉంటాయి. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా! పరిణామం చెందటం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా!
//2+2 = 5 అనే భావజాల వ్యాప్తి కోసమే ఇదంతా..//
◆ 2+2 ఎంతంటే అయిదన్నా..ఆరన్నా నమ్మాల్సిన పరిస్థితులు కల్పించటం కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వమూ,వారి అనుచరగణమూ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మూఢత్వ భావాలను నలుచెరుగులా వ్యాపింపచేసేందుకు పూనుకుంటుంది. అందులో భాగంగానే పరిణామవాదాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించింది.ఒక్క భారత్తే కాదు...ప్రపంచంలోని సౌదీ అరేబియా, ఒమన్, అల్జీరియా, మొరాకో, టర్కీ దేశాల్లో పరిణామ బోధనను పూర్తిగా నిషేధించాయి. లెబనాన్ లో మతపరమైన ఒత్తిడి కారణంగా పరిణామం పాఠ్యాంశాల నుండి తొలగించబడింది. జోర్డాన్ లో మతపరమైన చట్రంలో బోధించబడుతుంది. ఈజిప్టు మరియు ట్యునీషియా లాంటి దేశాలలో పరిణామవాదాన్ని నిరూపించబడని పరికల్పనగా బోధిస్తున్నారు. అంతెందుకు సైన్సు, సాంకేతిక రంగాలలో ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో వున్న అమెరికాలోని అనేక పబ్లిక్ స్కూళ్ళలో ఇప్పటికీ డార్విన్ సిద్ధాంతాన్ని బోధించటం లేదు. ప్రకృతి పరిణామంలో భాగంగానే మొక్కలు, జంతువులతోపాటు మనిషి పుట్టాడని ఋజువు చేయబడిన సిద్ధాంతాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది? పరిణామవాదాన్ని వ్యతిరేకించటంలో మతశక్తులు, పాలకవర్గ శక్తులు ఒక్కటయ్యారు. వారికి డార్విన్ సిద్ధాంతం సరైనదా? కాదా? ఋజువు చేయబడిందా? లేదా? అనేది అసలు సమస్య కాదు. ఆ సిద్ధాంతం వెనుక వున్న తాత్విక ఆలోచన, ప్రాపంచిక దృక్పథం వారికి మింగుడు పడనిది.
◆ ఈ ప్రపంచంలో రెండు తాత్విక దృక్పథాలున్నాయి. ఈ విశ్వంలో ఏది జరిగినా దానికి మూలం ఈ విశ్వంలోనే వుందనేది ఒక ఆలోచన. అదే భౌతికవాదం. దైవం లేదా ఏదో లోకాతీతశక్తి అన్నిటికి మూలం అనేది రెండో ఆలోచన. అదే భావవాదం. ఈ విభిన్న దృక్పథాల మధ్య ఘర్షణ వుంది. ఈ ఘర్షణ విశ్వం, జీవపరిణామం, మానవుడి పుట్టుకలో కూడా ప్రతిబింబించింది. మతగ్రంథాల సృష్టివాదమా? డార్విన్ పరిణామవాదమా? ఏది సరైనది? ఈ నిజాన్ని నిగ్గుతేల్చేది మన తాత్విక ఆలోచన, ప్రాపంచిక దృక్పథమే. అదే మన ప్రయాణం ఎటు? అనే బాటను నిర్ణయిస్తుంది.
◆ డార్విన్ పరిణామవాదం సృష్టికర్త సిద్ధాంతాన్ని చావుదెబ్బ తీసింది. జీవజాతుల పుట్టుకను శాస్త్రీయంగా వివరించింది. జీవపరిణామంలో, మనిషి పుట్టుకలో ఏ దశలోనూ ప్రకృతికతీతమైన మరోశక్తి ప్రమేయం ఏమాత్రం లేదని నిరూపించింది. ఈ తాత్విక ఆలోచనని ఒప్పుకుంటే అది మతతత్త్వశక్తులు, పాలకవర్గాలకు ఆత్మహత్యాసదృశ్యమే.
◆ ప్రకృతి పరిణామంలో భాగంగానే మానవుడు పుట్టాడంటే, దేవుడు లేదా ఇతరేతర శక్తుల హస్తం లేనేలేదు అంటే, ఆత్మ, పూర్వజన్మ, కర్మసిద్ధాంతాలు గాలికెగిరిపోతాయి. ఈ సమాజం ఇప్పుడూ, ఎప్పుడూ ఇలాగే వుందని, సామాజిక, ఆర్థిక అసమానతలు విధాత లిఖితమనే భావజాలం తలక్రిందులవుతుంది. కార్య, కారణసంబంధం ఎక్కడో గాదు, ఇక్కడే వుందనేది నిర్వివాదాంశమవుతుంది. ఇది మతశక్తుల, పాలకవర్గాల అస్తిత్వానికీ ప్రమాదమవుతుంది. వారి తాత్విక పునాది కూలిపోతుంది. అందుకే డార్విన్ పరిణామవాదాన్ని ఈనాటికీ మతతత్త్వ శక్తులు, పాలక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిషేధాలు, నిర్భంధాలతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నాయి.
//పురాణాలే సైన్స్ అయితే.. దేశమే గతి బాగుపడినోయ్!//
◆ బిజెపి అధికారంలోకొచ్చాక హిందూ మతతోన్మాద శక్తులు ఏదో ఒక మార్గంలో మతతత్వ భావజాలాన్ని నూరి పోయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారి తిరోగమన భావజాలాన్ని ప్రజల భావజాలంగా మార్చాడానికి విజ్ఞాన శాస్త్రాలు అడ్డొస్తున్నాయి. ఆ అడ్డు తొలగించుకోడానికే శాస్త్ర విజ్ఞానంపై దాడి చేయడం, కుహనా శాస్త్రాలకూ, అశాస్త్రీయ అంశాకు ప్రచారం కల్పించడం, పుక్కిటి పురాణాలనే శాస్త్రాలుగా నమ్మించడానికి ప్రయత్నించడం... ఒకటేమిటి అన్ని రకాల అశాస్త్రీయ అరాచకాలకూ పాల్పడుతున్నారు. ఇందులో బిజెపి ఎంఎల్‌ఎలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చివరికి ప్రధాన మంత్రితో సహా పరివారం యావత్తూ నిత్యం పాల్గొనడం చూస్తే ఈ కార్యక్రమం వారి ఎజెండాలో ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో అర్ధమవుతుంది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అంటూ ఆధునిక యుగంలో కూడా వేదాలను పట్టుకు వేలాడే ప్రబుద్ధులను గురజాడ అప్పారావు గారు హేళన చేస్తే ఆ ప్రబుద్ధులం మేమేనంటూ ప్రధాన మంత్రి నుండి వారి కింది కార్యకర్తల వరకు రుజువు చేస్తూ ఉన్నారు. వాళ్ల దృష్టిలో వాస్తు, జోతిష్యం, పిల్లి శాస్త్రాలు, బల్లి శాస్త్రాలు.. ఇవే 'శాస్త్రాలు'. వీటిని పట్టుకుని పయనిస్తే మన దేశ పరిస్థితి అథోగతే!
◆ ఈ నేపథ్యంలో మానవ ఆవిర్భావం, వికాసం,ప్రకృతికీ ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు శాస్త్రీయ, అశాస్త్రీయ ధోరణులకూ, దృక్ఫథాలకూ కారణాలను తవ్వితే ప్రగతి నిరోధక మూఢ విశ్వాసాల వ్యాప్తికి గండి పడుతుందని భయంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించింది. కావున, శాస్త్ర పరీక్షకీ, కాల పరీక్షకీ నిలిచిన డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా తొలగించి, అశాస్త్రీయ భావాలను విద్యార్థుల మెదళ్ళలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పిడిఎస్ఓ తీవ్రంగా ఖండిస్తూ, తొలగించిన పాఠ్యాంశాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. వైజ్ఞానిక స్ఫూర్తిని, శాస్త్రీయ ధృక్ఫథాన్ని పెంపొందించే 'శాస్త్రీయ విద్యా విధానం'కై విద్యార్థులంతా పోరాడాలని పిడిఎస్ఓ పిలుపునిస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు
ఫోన్ నెం:9701924714
తేదీ : 27-04-2023,
విజయవాడ

