పిడిఎస్ఓ ప్రచురించిన స్టూడెంట్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ ఈరోజు(15-04-23) శిఖామణి సెంటర్ సమీపంలోని చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సభకు పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ అధ్యక్షత వహించగా, ఆవిష్కర్తగా విచ్చేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.కె రెహమాన్ గారు మాట్లాడుతూ ఈరోజు విద్యను కాషాయీకరిస్తూ, అసలైన చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించి, అశాస్త్రీయ పాఠ్యాంశాలతో నింపుతున్నారని, విద్యార్థులు ఇటువంటి పుస్తకాలను చదివి పోరాటాల చరిత్రను సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాసాహితి ప్రధాన సంపాదకులు కె.రవిబాబు గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆజాది కా అమృత మహోత్సవాల పేరుతో సంబరాలు జరుపుతూ కుహనా దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు. దీని నుండి విద్యార్థులు బయటపడి జాతీయోద్యమం యొక్క పోరాట స్ఫూర్తితో దేశంలోని సమస్యలపై పోరాడాలని, అందుకోసం ఇటువంటి పుస్తకాల అధ్యయనం తప్పనిసరి అన్నారు.
స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు సి. విజయ గారు మాట్లాడుతూ చిన్నారుల పై, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరుద్యోగం, మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సంస్కృతి ప్రధాన కారణాలుగా ఉన్నాయని వీటికి వ్యతిరేకంగా విద్యార్థి,యువత పోరాడాలన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్ గారు మాట్లాడుతూ దేశంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు, పెరుగుతున్న నిరుద్యోగంకు కారణమైన పాలకుల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు మరో జాతీయోద్యమాన్ని నిర్మించాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కళాకారులు ఉద్యమ గీతాలను ఆలపించగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)
