సామ్రాజ్యవాద క్రౌర్యానికి నిదర్శనమైన జలియన్ వాలాబాగ్ మారణకాండకు నూరేళ్లు!!
~~
పంజాబీల నూతన సంవత్సరం పండుగ 'వైశాఖి రోజున 1919 ఏప్రిల్ 13న అమృతసర్ లోని ఒక పార్కు పేరయిన జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధంగా ప్రశాంత చిత్తంతో 20 వేల మంది ప్రజలు పాల్గొంటున్న సభపై బ్రిటీషు మిలిటరీ అధికారి జనరల్ డయ్యర్ జరిపించిన కాల్పులలో కేవలం పది నిముషాలలో వందలాదిమంది చనిపోయి అంతకంటే ఎక్కువమంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. కాల్పులు పది నిమిషాలే సాగటానికి కారణం తెచ్చుకున్న మందుగుండు సామాగ్రి అయిపోవటమే కాని మరొకటి కాదు. ఈ మాటను స్వయంగా విచారణ కమిషన్‌కు జనరల్ డయ్యరే జవాబుగా చెప్పివున్నాడు.
సిక్కుల పవిత్ర స్వర్ణ దేవాలయం వున్న అమృతసర్ పట్టణం జనాభా ఆనాటికి లక్షా 60 వేలు. అక్కడికి 35 మైళ్ల పడమటిగా పంజాబీల రాజధానీ నగరం (ప్రస్తుతం పాకిస్తాన్‌లో వుంది) లాహోరు ఉంటుంది. పంజాబీల నూతన సంవత్సర వేడుకలు జరుపు కోవటానికి చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా చాలామంది వచ్చివున్నారు. అమృతసర్ స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేసుకోవటానికి వచ్చే వారితో కూడా కలుపుకొని 20వేల మందిదాకా ఆ పార్కులో జరిగే సభలో పాల్గొనడానికి వచ్చారు. చుట్టూ ఎత్తయిన గోడలున్న ఇళ్ళ నడుమ ఒకే ఒక్క రాకపోకల సన్నని సందు తప్ప మరేమీ దానికి లేదు. అలావున్న ఒకే ఒక్కదారి వెంట జనరల్ డయ్యర్ వెంటపెట్టుకు వచ్చిన సాయుధ సైనికులు ప్రవేశించారు. మెషీన్‌గన్లతో కూడిన రెండు మోటారు బళ్లను కూడా వెంట తెచ్చుకున్నారు కానీ అవి పార్కులోకి ప్రవేశించేందుకు దాని ఇరుకు ద్వారం అవకాశం ఇవ్వలేదు. నిజానికి ఆ రోజు సభలో డా. సత్యపాల్, బారిస్టర్ సైపుద్దీన్ కిచ్లూ ప్రసంగించి ఉండేవారు. కానీ వారిని ముందే అరెస్టు చేశారు. వారి విడుదల కోసం ఎంత ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం పెడచెవినపెట్టింది. ఒకరకంగా నాటి సభ, ఈ నాయకుల అరెస్టులను ఖండిస్తూ జరుపుతున్నది.అప్పటికే చట్టం రూపంలోవచ్చిన “రౌలత్ యాక్టుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా అది జరుగుతోంది.
ముష్కర బ్రిటీషు సామ్రాజ్యవాద ప్రభుత్వం దేశం దేశమేకాక ప్రపంచమంతా నిర్చాంతపోయేట్లు కనీస - హెచ్చరికలు కూడా చేయకుండా చెల్లాచెదురు చేసే ప్రయత్నం కూడా లేకుండా నేరుగా 10 నిమిషాలపాటు పారిపోవటానికి అవకాశం లేని నిరాయుధ ప్రజానీకంపై 50 మంది పైగా సైనికులు కాల్పులు సాగించారు.ఒక మూలన వున్న 5 అడుగుల ఎత్తు గోడల మీదుగా దూకి పారిపోదామని యత్నించిన వారిమీద ప్రత్యేకంగా గురిపెట్టి కాల్చి చంపారు. ఆ పార్కు నడిమధ్యన పిట్టగోడ కూడా సరిగాలేని వెడల్పు బావి ఒకటుంది. ప్రాణాలు కాపాడుకుందామని కొందరు, తప్పించుకు పారిపోయే హడావిడిలో బావిని చూసుకోకుండా, మరికొందరు గుట్టలు గుట్టలుగా అందులో పడిపోతే, దానినుండి అధికారిక లెక్కల ప్రకారం వెలికివచ్చిన శవాలే 120 దాకా ఉన్నాయి. మనుషులమీద మనుషులు పడిపోయి ఊపిరాడక చనిపోయిన వారితో బావిలోని వారేకాక వెలుపల కూడా ఉన్నారంటే ఆ దృశ్యం ఎంత భయానకమైనదో ఊహించుకోవాలసిందే.
//సామ్రాజ్యవాదం అంటే దోపిడీ, పీడన, అణచివేత!//
మొత్తం 1650 బుల్లెట్లు పేల్చినట్లు డయ్యర్ చెప్పగా అధికారిక లెక్క ప్రకారం 379 మంది మాత్రమే చనిపోయారని ప్రకటించారు. ఆ దుస్సంఘటనపై కాంగ్రెసు పార్టీ (గాంధీ నాయకత్వాన) నియమించిన విచారణ కమిషన్ 1000 మంది దాకా చనిపోయి వుంటారని నివేదించింది. కొందరు 1200 మందిదాకా ఉండవచ్చని రాయగా, హన్స్‌రాజ్ రహబ్బర్ (ప్రఖ్యాత పంజాబీ రచయిత) ప్రకారం 1516 మంది చనిపోయినట్లు హంటర్ కమిషన్ చెప్పిందని రాశారు. (చూడు : గాంధీ నిజస్వరూపం-పుట 191). పెద్ద తిరణాలలాగా జరిగే వైశాఖి పండుగ సంబరాలు జరుపుకుందామని అమృతసర్ చుట్టుపట్లగల పల్లెటూరి జనం వచ్చిన సందర్భం అది. ఈ నరమేధాన్ని ప్రత్యక్షంగా నిలబడి అమలు జరిపించిన జనరల్ డయ్యర్ పూర్తిపేరు రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్.
ఆ కాలంలో పంజాబు రాష్ట్రానికి (రావల్పిండి నుండి ఢిల్లీ దాకా విస్తరించుకుని ఉంటుంది) లెప్టినెంట్ గవర్నరుగా పనిచేసిన వ్యక్తి పేరు కూడా డయ్యరే. అతని పూర్తిపేరు సర్ మైకేల్ ఫ్రాన్సిస్ ఒ డయ్యర్. ఏప్రిల్ 14న అంటే సామూహిక హత్యాకాండ జరిగిన మరురోజునే ఒక సమావేశంలో లెప్టినెంట్ గవర్నర్ డయ్యర్, జనరల్ డయ్యర్ చర్యలను సమర్థించి అధికారికంగా ఆమోదించాడు. వెనువెంటనే ఒక టెలిగ్రాం రూపంలో తన అమోదాన్ని తెలియపర్చాడు. పై హత్యకాండపై భారతదేశం మొత్తం ఆగ్రహావేశాలతో ఉడుకెత్తి పోయింది. ప్రపంచ దేశాలూ, బ్రిటను దేశంలో శ్రామికవర్గ నాయకులూ, మానవతావాదులు కూడా ఖండించారు. స్కాట్‌లాండ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ హంటర్‌ను విచారణాధికారిగా, ముగ్గురు భారతీయులతో సహా మరొక 7గురు అందులో సభ్యులుగా గల విచారణ కమిషన్‌ను నియమించారు. ఆ విచారణ సంఘం ముందు జనరల్ డయ్యర్ యిచ్చిన జవాబులు అనాటి బ్రిటీష్ పాలకుల, నిరంకుశాధికారుల వైఖరికి అద్దం పడతాయి. విచారణ సంఘ సభ్యులడిగిన ప్రశ్నలు దానికి డయ్యరు జవాబులు చూడండి.
//హంటర్ కమిషన్ ప్రశ్నలకు జనరల్ డయ్యర్ జవాబులు//
ప్రశ్న : నువ్వు తోటలోకి ఎప్పుడు అడిగిడావు? వెంటనే ఏమి చేశావు.
జవాబు : నేను కాల్పులు మొదలెట్టించాను.
ప్రశ్న : ఒక్కసారిగానా?
జవాబు : అవును... వెంటనే! నేనా విషయం గురించి ఆలోచించాను. నా విధిని నిర్వర్తించే నిర్ణయం తీసుకోవటానికి అరనిమిషం కంటె ఎక్కువ సమయం పట్టలేదు.
ప్రశ్న _ : అప్పటికి జనసమూహం ఏం చేస్తున్నారు?
జవాబు : వారప్పటికి సభ నిర్వహించుకుంటున్నారు. నడి మధ్యన కొద్దిగా ఎత్తు ప్రదేశంలో నిలబడి, చేతులు అటూయిటూ కదుపుతూ ఒక వ్యక్తి జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మా సైనిక దళాలకు ప్రజలకు నడుమ 50-60 గజాల దూరం ఉండొచ్చు. (అప్పటికే అమృతసర్ పట్టణంలో ఆ మధ్యాహ్నం ప్రకటించివున్న 'మార్షల్‌లా” (సైనిక చట్టం అమలు) గురించి, జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన వారిలో అత్యధికులకు తెలిసి వుండకపోవచ్చునని కమిషన్ ముందు డయ్యర్ అంగీకరించాడు.) స్వయంగా లార్డ్ హంటరే యిలా అడిగాడు.
ప్రశ్న : పోగుపడిన జనంలో చాలామందికి "సైనిక చట్టం' ప్రకటన గురించి తెలిసివుండకపోవచ్చునని భావించి తుపాకీ కాల్పులకు
ముందు, వారిని చెదిరిపొమ్మని హెచ్చరించాలని అనిపించలేదా?
జవాబు : లేదు.. ఆ సమయంలో నేను అలా చేయలేదు. నేను ఆదేశించిన మార్షల్ లాను ధిక్కరించినందుకు వెంటనే తుపాకులతో కాల్పులు జరపటం నా విధి (డ్యూటీ) అనుకున్నాను.
ప్రశ్న : వారికి మార్షల్ లా ప్రకటించినట్లు తెలుపలేదు సరే.. పౌర పాలనాధికారి అయిన డిప్యూటీ కమిషనర్‌ను సంప్రదించారా?
జవాబు : అ సమయానికి అక్కడ డిప్యూటీ కమిషనర్ లేడు. ఎవరినైనా అడగటం అవసరమని నేను భావించలేదు. నేనేం చేయాలనేదానికి అప్పటికప్పుడు మానసికంగా సిద్ధం కావాలి. నేనా విషయాన్ని “మిలిటరీ కోణం” నుంచి ఆలోచించి వెంటనే కాల్పులు జరిపించాను. నేను అలా చేసి వుండకపోతే నా విధి నిర్వహణలో విఫలమయినట్టు.
ప్రశ్న : కాల్పులు జరపటంలో జన సమూహాన్ని చెదరగొట్టటం మీ లక్ష్యమా?
జవాబు : లేదండి! వారు చెదిరిపోయేదాకా కాల్పులు జరుపుతూనే ఉన్నాను.
ప్రశ్న : చెదిరిపోతున్నట్లు తెలిసిన తర్వాత కాల్పులు ఎందుకు అపలేదు?
జవాబు : వాళ్లు పూర్తిగా చెదిరిపోయేదాకా కాల్పులు జరపటమే నా విధి అని భావించాను. కొద్దిగా కాల్పులు జరిపి ఆపినట్లయితే నేను కాల్పులు జరపటమే తప్పయివుండేది.
ఇంకా కమిషన్ సభ్యులు అడిగిన పలు రకాల ప్రశ్నలకు జనరల్ డయ్యర్ యిచ్చిన జవాబులను బట్టి కూడా మరికొన్న విషయాలను గ్రహించవచ్చు.
తాము మొత్తం 1650 రౌండ్ల బుల్లెట్లతో కాల్చామనీ, తనకు కాల్పులు జరపటమే తెలుసు కానీ ప్రజా సమూహాలను ఎలా చెదరగొట్టాలో తెలియదనీ, కాల్చకుండా చెల్లాచెదురు మాత్రమే చేస్తే, వెనక్కి తిరిగివచ్చినన్ను వెక్కిరించి పోయేవారనీ, తన వద్ద మందుగుండు సామాగ్రి అయిపోయిన పిదప మాత్రమే కాల్పులు ఆగిపోయాయనీ, కాల్పులవల్ల గాయపడిన వారికి వైద్య సౌకర్యాలను కల్పించే బాధ్యత తనదికాదనీ, అది వైద్య సమస్య అవుతుందనీ, జనసమర్ధంగా వున్నవైపునే కాల్పులు ఎక్కువ చేశామనీ.. వారు అలా సమావేశం కావటమే శిక్షకు పాత్రులయినట్లనీ.. ఇంత నిష్కర్షగా కర్కశంగా జవాబులిచ్చాడు జనరల్ డయ్యర్... అంతేకాదు; ఈ కాల్పుల ద్వారా పంజాబు రాష్ట్రంలో మళ్లీ తలెత్తబోతున్న (1857 తరహా) తిరుగుబాటు శక్తులందరికీ హెచ్చరికగా కూడా ఈ కాల్పులు జరిపానని చెప్పుకున్నాడు.
ఇంకా ప్రత్యక్ష సాక్షుల కథనాలలో పార్క్ సమీపంలోని మేడమీదనుండి చూచిన గిరిధర్ లాల్ చెప్పిన ప్రకారం - “వందలమంది నా కళ్లముందే చనిపోవటం చూశాను. అత్యంత ఘోరమైన చర్య ఏమంటే .. పార్క్ బయటకు పోవటానికి వున్న 4-5 చోట్ల దూకిపోదామని ప్రయత్నించిన వారిపై ఎక్కుపెట్టి గురిచూసి కాల్పులు జరిపారు. తొక్కిసలాటతో పడిపోయి మరణించిన వారున్నారు. రక్తం ఏరులైపారింది. నేలమీద పడుకొన్న వారు కూడా బలయ్యారు. శవాలు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. చనిపోయిన వారిలో పెద్దా, చిన్నా ఉన్నారు. కొందరి పుచ్చెలు పగిలిపోయాయి. ఇంకొందరి కళ్లు, ముక్కులు, కాళ్లు, చేతులు తెగిపోయిన తర్వాత, ఆఖరి శ్వాసవిడిచేలోగా హాహాకారాలతో విలవిలలాడిన వాళ్లతో ఆ మైదానమంతా నిండిపోయి వుంది. అయిన వాళ్లను కూడా పట్టించు కోకుండా ఎలాగోలా పారిపోయిన వారున్నారు. మళ్లీ మార్షల్‌లాను ఇలా ప్రకటించారు. “రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఇళ్లలోనుండి ఎవరూ బయటకు రాకూడదు.వీధుల్లో రాత్రి 8 తర్వాత కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చివేస్తాము”.
జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత ఎలాగోలా తప్పించుకుని బయటకుపోయిన కొందరు వీధుల్లో ప్రాణాలొదిలేసిన ఘటనలు చాలా వున్నాయి. బాగ్ వెలుపల కూడా శవాల గుట్టలు నేను చూశారు. సాయుధ సైనికులపైకి ఒక కర్రగానీ రాయిగానీ విసిరినవారే లేక పోయినా యింత నరమేధం జరిగిపోయింది.” (సికిందర్‌సింగ్ రాసిన జలియన్ వాలాబాగ్ - ఉద్దంసింగ్ పుస్తకంనుండి). జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత కూడా క్రూర అణచివేతల పర్వం కొనసాగింది. తెల్ల దొరలు నడుస్తున్న రోడ్లపై నల్లవారు (భారతీయులు) నడవకూడదనీ, మోకాళ్లపై దేక్కుంటూ, పొట్టలపై పాక్కుంటూ నడవాలని అదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ధిక్కరించినా, నిర్లక్ష్యం చేసినా కొరడాలతో కొట్టి హింసించారు. భారతదేశంలోనే అత్యంత వీరోచితమైన ఒక జాతిని,100 ఏళ్ల తర్వాత తలుచుకున్నా. గుండెలు రగిలిపోయేంత ఘోరాతిఘఫోరంగా అవమానాలకు గురిచేశారు.
అనాటి పంజాబు రాష్ట్రపు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ డయ్యర్‌ను 1940లో లండన్‌లో కాక్స్టన్ మీటింగు హాలులో కాల్చిచంపిన ఉద్దంసింగ్ (అప్పటికి తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని మార్చుకున్నాడు) జలియను వాలాబాగ్ ఘటన సమయంలో అక్కడే ఉన్నాడు. ఒక అనాధాశ్రమ పాఠశాల విద్యార్థిగా, స్వాతంత్రోద్యమం పట్ల ఆసక్తితో కేవలం వినటానికి కాక, ఒక కార్యకర్తగా అందరికీ మంచినీళ్లను అందిస్తూవున్న ఉద్దంసింగ్ ఆ తొక్కిసలాటలో గాయపడి పడిపోయి స్పృహ తప్పి తనను కొన్ని శవాలు కప్పివేయగా తర్వాత కళ్లు తెరిచాడు. ఈ అమానుష దురాగతానికి కారకులైన వారిపై పగతో రగిలిపోయాడు. 21 సంవత్సరాల తర్వాత 1940 మార్చి 18న లండన్‌లోని కాక్ట్సన్ హాలులో జరుగుతున్న ఒక మీటింగులో, అది పూర్తయిన వెంటనే మైకేల్ ఓ డయ్యరును ఉద్దంసింగ్ రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు. అప్పటికే 12 సంవత్సరాల క్రితం జలియన్ _ వాలాబాగ్ కాల్పులకు ప్రత్యక్ష కారకుడైన రెజినాల్డ్ డయ్యర్ భయంకరమైన మనోవ్యాధితో తీసుకు తీసుకు చనిపోయాడు. చాలామంది అనుకుంటున్నట్లు ఉద్దంసింగ్ ఒక డయ్యరును చంపవలసిందిపోయి. మరొక డయ్యరుని చంపలేదు. మిగిలివున్న అనాటి పంజాబు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరు మైకేల్ ఓ డయ్యర్‌ను కాల్చిచంపాడు.
//బ్రిటీషు ప్రభుత్వాన్ని వెంటాడుతున్న జలియన్ వాలాబాగ్!//
జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి వందేళ్లు గడిచిపోయినా, ఇప్పటికీ భారతదేశానికి గానీ, అనాటి దుస్సంఘటన బాధితులకిగానీ అధికారికంగా బ్రిటను ప్రభుత్వం ''క్షమాపణ” చెప్పలేదు. ప్రస్తుత బ్రిటీషు ప్రధాని థెరిసామె, బ్రిటీషు భారత చరిత్రలో అది మాయని మచ్చ' అని నాలుగు రోజుల క్రితం, 9-4-2019న చెప్పినప్పటికీ, క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించ లేదు. బ్రిటను పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్లమెంటు సభ్యుడు బాబే బ్లాక్‌మన్ ఏప్రియల్ 9వ తేదీన చర్చను ప్రారంభిస్తూ "భారతదేశం ఈ దుస్సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేదు. మన గతకాలపు చీకటి చరిత్రపట్ల ప్రస్తుతకాలపు విద్యార్థులకు తగు స్పృహను కలిగించగలిగితేనే ప్రస్తుత తరాలు మనం ఎక్కడనుండి వచ్చామో, ఎక్కడున్నామో అర్ధం చేసుకోగలిగేది" అన్నాడు.వివిధ పార్టీలకు చెందిన 80 మందికిపైగా పార్లమెంటు సభ్యులు, లేబర్ పార్టీ సభ్యుడు పాటీమాక్ ఫెడన్ నాయకత్వాన “జలియను వాలాబాగు మారణకాండ భారతీయులకూ, ఇంగ్లండులో పౌరులైన భారతీయ మూలాలున్న వారికీ ఒక తీరని వ్యధ.కనుక, ఇప్పటికైనా బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేస్తూ విదేశాంగ కార్యదర్శికి ఉత్తరం రాశారు.అయితే బ్రిటీషు ప్రధాని థెరిసామె పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడుతూ బ్రిటీషురాణి క్వీన్ ఎలిజబెత్ గతంలో “గడచిన మన చరిత్రలో ఇదొక బాధాకరమైన ఉదాహరణ” అంటూ చేసిన వ్యాఖ్యానాన్ని సభ దృష్టికి తెచ్చారు. తనవంతుగా జరిగిన దానికి కలిగించిన బాధకు తీవ్ర విచారాన్ని ప్రకటించారు.అయినా బ్రిటను లేబరు పార్టీ “అస్పష్టతలేని వివరమైన పూర్తిస్థాయి క్షమాపణను ప్రకటించాలని" బ్రిటీషు ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. (ది హిందూ 10-11 ఏప్రిల్ 2019)
ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని అబద్ధపు అభియోగాలు మోపి, అమెరికా ఇరాక్‌పై దురాక్రమణకు పూనుకున్నప్పుడు ఇంగ్లాండు కూడా అమెరికాకు మద్ధతుగా నిలిచింది. తరువాత కొంత కాలానికి తూచ్ అంది. సామ్రాజ్యవాదులకు ముందు తమ పబ్బం గడుపుకోవటం, క్రూర అణచివేతకు పాల్చడటం, ఆ తర్వాత గంభీర ప్రకటనలతో తప్పును ఒప్పు కోవటం కొత్తేమీ కాదు. జలియన్ వాలాబాగ్ దుర్మార్దానికి నూరేళ్ళయినా కనీసం క్షమాపణ చెప్పటానికి కూడా ఈ “దొరలకు మనసొప్పటం లేదు!" భారత పాలకులు ఎన్నికల గత్తర నడుమ జలియన్‌వాలాబాగు అమరులకు అందించాల్సిన ఘన నివాళిని పెద్దగా పట్టించుకోలేదు. ఒకనాటి బ్రిటీషు సామ్రాజ్యవాదులకు, నేడు అమెరికా సామ్రాజ్యవాదులకు దాసోహమనటంలో పోటీ పడుతున్న వివిధ భారత పాలక ముఠాలు బ్రిటిషు దొరలకు ఇబ్బంది కలిగించకుండా మోస పూరితంగా వ్యవహరిస్తున్నారు.మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటీషువారి తరఫున మొత్తం భారతదేశ సైనికులను 13 నుండి 15 లక్షలమందిని ఐరోపా ఖండ దేశాల యుద్ధరంగాల్లో వాడుకున్నారు. దాదాపు 75000 నుండి లక్ష మంది దాకా తమ ప్రాణాలను యుద్ధంలో కోల్పోగా ఇంకా ఎంతోమంది క్షతగాత్రులై దీనంగా ఐతుకులీడుస్తున్నారు. సహజంగా యుద్ధంలో సైనికులుగా చేరేవారిలో పంజాబీలు ఎక్కువుంటారనీ, గుజరాతీలు అతి తక్కువ ఉంటారని మనకు తెలుసు. ఒకప్పుడు - 19వ శతాబ్దంలో (1799-1839) లాహోరు రాజధానిగా రాజా రంజిత్‌సింగ్ పంజాబీల సుస్థిరపాలన నెలకొల్పి, బ్రిటీషువారిని అటువైపు కన్నెత్తనివ్వకుండా స్వతంత్ర రాజ్యాన్ని పాలించిన ఘనచరిత్ర పంజాబీలకు ఎప్పుడూ కళ్లలో మెదులుతూనే ఉంటుంది. కానీ రాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1849లో బ్రిటీషు గవర్నర్ జనరల్ లార్డ్ డల్‌హౌసీ పంజాబుని దురాక్రమించి వారిని నిరాయుధుల్ని కావించాడు. బ్రిటీషు వారి వ్యవసాయ సంస్కరణలకు నలిగిపోతున్న పంజాబీలలో ఆరవవంతు మంది 19వ శతాబ్దం చివర ఆకలి చావులకు బలైపోగా నిరసన పెల్లుబుకసాగింది. రైతాంగ ఉద్యమంగా అది ఉధృతమైంది. విదేశాలకు వలసపోయిన పంజాబీలు 'గదర్' ఉద్యమానికి గుండెకాయలా నిలిచారు.
మిలటరీలో తిరుగుబాటు ద్వారా మొదటి ప్రపంచ యుద్ధ పరిస్థితులను భారత విముక్తి సాధనకు సానుకూలపరుచుకోవాలని గదర్ ఉద్యమకారులు భావించారు కానీ, విద్రోహాలవల్ల క్రూరఅణచివేతలకు గురయ్యారు. ఇంతలో 1917 నవంబరులో రష్యాలో లెనిన్ నాయకత్వాన శ్రామిక విప్లవం విజయం సాధించటంతో దాని ప్రభావం భారత స్వాతంత్రోద్యమకారులపై పడింది. మరోవైపు తిరుగుబాటు ధోరణులను మొగ్గలోనే తుంచెయ్యాలని బ్రిటీషు పాలకులు పథకాలు రచించారు. పంజాబు రాష్ట్ర గవర్నర్ సర్ డేంజిల్ ఇబట్సన్ రిపోర్టు (1907)ని ఉటంకించి (ఈ రిపోర్టుకై భగత్‌సింగ్ రచనల గ్రంథం.. *మానెత్తురు వృధాకాదు* లో చూడండి) దానితో హడావుడిగా రౌలత్ చట్టాన్ని పాస్ చేయించు కొని దాని ప్రకారం ప్రజల ఆందోళనలను, ఆలోచనలను కూడా క్రూరంగా అణచివుంచే ప్రయత్నం చేశారు. హిందూ ముస్లింలుగా భారత ప్రజలను చీల్చటానికి 1906లోనే ముస్లింలీగును, 1909 లో హిందూ మహాసభను ప్రత్యక్షంగా ప్రోత్సహించిన బ్రిటీషు పాలకులు, పంజాబీలతో సహా హిందూ - ముస్లింల ఐక్యత పెంపొందటాన్ని భరించలేకపోయారు.
అప్పుడే భారత రాజకీయాలలో అడుగిడుతున్న గాంధీజీ రౌలత్‌చట్టాన్ని వ్యతిరేకించే “సత్యాగ్రహ కమిటీని తన అధ్యక్షతన ప్రకటించి 1919 మార్చి 30న దేశవ్యాపిత నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాడు. కానీ సరిగ్గా వారం రోజులకు అనగా...6 ఏప్రిల్ 1919కి దాన్ని వాయిదా ప్రకటించారు. దేశవ్యాపితంగా ప్రతిస్పందించిన తొలి పిలుపు అదే. మార్చి 30న కూడా చాలా పట్టణాల్లో ముఖ్యంగా ఢిల్లీలాంటి రాజధానీ నగరంలోనే రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దాన్ని అణచి వేయటానికి ప్రభుత్వం చాలా నిరంకుశ పద్ధతులను అమలు జరిపింది. పంజాబ్‌లో కూడా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అమృతసర్‌లో మార్చి 30 నాడే 35 వేలమంది పాల్గొన్నారు. డా. సత్యపాల్‌ను మీటింగులో మాట్లాడటానికి వీల్లేదంటూ నిషేధం ప్రకటించినా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. తిరిగి ఏప్రిల్ 6న దేశవ్యాపితంగా ప్రజల నిరసన ప్రదర్శనలూ, పాలకుల నిర్బంధకాండ సాగాయి. 1919 ఏప్రిల్ 9న శ్రీరామనవమి పండుగను నిర్వహించటంలో ముస్లిమ్‌లు స్వయంగా చొరవచేసి హిందువులతో కలిసి పాల్గొన్నారు. డా. సైఫుద్దీన్‌కిచ్లూ, డాక్టర్ సత్యపాల్‌లు శ్రీరామనవమి పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పెద్ద ఊరేగింపుతో జరిపించారు. ప్రజానీకంలో అది చాలా ఉత్సాహాన్ని పెంచింది. భారతీయుల నడుమ మతవిద్వేషాలను పెంచాలనే బ్రిటీషు పాలకుల పన్నాగం బెడిసి కొట్టటంతో వారు గంగవెర్రులెత్తారు.
రాత్రికి రాత్రి డా. కిచ్లు, సత్యపాల్‌లను అరెస్టుచేసి ధర్మశాల జైలుకు తరలించమని ఆదేశాలు వెళ్లాయి. 10 ఏప్రిల్‌న అవి అమలులోకి వచ్చాయి. అమృతసర్ ప్రజానీకం షాపులన్నీ స్వచ్చందంగా మూసివేసి బజారుల్లోకి వచ్చేశారు. వారిరువురినీ విడుదల చేయమని కోరుతూ డిప్యూటీ కమిషనర్ బంగ్లాకి శాంతియుతంగా వెళ్లే ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రజలు రెచ్చిపోయారు. కాల్పులలో 10 మంది మరణించారు. బ్యాంకులు, పోస్టాఫీసులపై ప్రజలు దాడులు చేశారు.
కొంతమంది తెల్లదొరల పైన, వారి మహిళలపైనకూడా భౌతిక దాడులు జరిగాయి. అక్కడనుండి 13వ తేదీ లోపు చనిపోయిన వారి శవాలను ఊరేగింపుగా తరలించటానికి, నిరోధించటానికి నడుమ సంఘర్షణలు జరిగాయి. 12వ తేదీన జనరల్ డయ్యర్ 125 మంది బ్రిటీషు సైనికులు, 310 మంది భారతీయ సైనికులతో అమృతసర్ నడివీధులలో కవాతు నిర్వహించారు. అ కవాతును చూసిన ప్రజలు దాన్ని అసహ్యించుకుంటూ రోడ్లపైనే ఉమ్మివేశారు. క్రూరంగా ప్రజలను అణచివేస్తే తప్ప పంజాబీలను, మొత్తం భారతీయులను, భయోత్సాతానికి గురి చేయలేమని బ్రిటీషు పాలకులు నిర్ణయించుకుని సాగించిన మారణకాండ - జలియన్ వాలాబాగ్!!
ఈ మారణకాండకు ప్రపంచ వ్యాపితంగా నిరసనలు వెల్లువెత్తిన కారణంగా స్వయంగా బ్రిటీషు ప్రభుత్వమే లార్డ్ హంటర్ కమిషన్‌ను నియమించి విచారణ చేపట్టింది. కమిషన్‌లో 5గురు బ్రిటీషు వారయితే ముగ్గురు భారతీయులు. కాంగ్రెసు పార్టీ హంటర్ కమిషన్‌ను బహిష్కరించి తానే స్వయంగా ఒక విచారణ సంఘాన్ని మోతీలాల్ నెహ్రూ, గాంధీ తదితరులతో నియమించి విచారించింది. హంటర్ కమిషన్ నివేదికను బ్రిటీషు సభ్యులు ఒకటిగానూ, భారతీయులు వేరొకటిగాను సమర్చించారు. ఆ రెంటిలో ముఖ్యమైన తేడా అల్లా జనరల్ డయ్యరు చర్యను ఖండించటమూ, ఖండించకుండటమే! విశేషమేమిటంటే భారతీయుల బృందానికి నాయకత్వం వహించి విచారణా నివేదికను రాసిన చిమన్‌భాయ్ 'సెతల్వాడ్, ప్రస్తుతం మన కాలంలో గుజరాత్ మారణ కాండపై న్యాయస్థానాలలో జంకకుండా పోరాడుతున్న తీస్తా సెతల్వాడ్‌కు సరిగ్గా ముత్తాత.అమృతసర్ పట్టణంలో జూన్ 9వ తేదీదాకా సైనిక శాసనం కొనసాగింది. ఎంత నీచమైన రూపాలలో అవమానించాలో అంతకన్నా ఎక్కువ అవమానాలను ప్రజానీకం చవిచూసింది. పట్టణాల్లో శ్వేతజాతీయులు కనబడిన వెంటనే సలాం చేయని వారిని ఘోరంగా నడిబజార్లో నిలబెట్టి కొరడాలతో కొట్టి శిక్షించటం, కొన్ని బజారుల్లో అయితే భారతీయులు నడవరాదనీ, మోకాళ్ళపైనా, పొట్టమీద పాక్కుంటూ, దేక్కుంటూ నడవాలనీ ఆదేశించి క్రూరంగా అమలు చేశారు. ఆఖరికి పట్టణంలోని లాయర్లందరూ,తెల్లవారి బంట్రోతుల్లాగా చేతులు కట్టుకుని పనిచేయాల్సిన దుస్థితి. మొత్తం 51 మందికి మరణశిక్షనూ, 46 మందికి యావజ్జీవ కారాగార శిక్షను.... ఇంకా 248 మందికి ఇతర శిక్షలనూ సైనిక శాసనకాలంలో విధించారు.
ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గ ఉద్యమ కారులు, కమ్యూనిస్టులు, బ్రిటను దేశానికి చెందిన వారితో సహా జలియను వాలాబాగు దురంతాలను ఖండించారు. బ్రిటీషు సామ్రాజ్య వాదపు అత్యంత వికారతత్త్వాన్ని అసహ్యించు కున్నారు.లెనిన్ నాయకత్వానగల కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ఈ అణచివేతను ఖండించింది.1905 నాటి బెంగాల్ విభజనకు నిరసనగా ప్రజా ఉద్యమం పెల్లుబకటం ప్రారంభమయినా, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, జలియను వాలాబాగు మారణకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, అసేతు హిమాచలం ప్రజలు బజారుల్లోకి వచ్చి ఆందోళనలు సాగించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతర ప్రజావెల్లువ, రష్యాలో పీడిత ప్రజాశక్తులు అధికారాన్ని చేపట్టిన స్పూర్తి, వలస దేశాలను ప్రభావితం చేస్తుండగా అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు తలెత్తాయి. చైనాలో 1919 మే 4 ఉద్యమం, మనకిక్కడ రౌలత్ చట్టవ్యతిరేక 'ప్రజావెల్లువ' ఒకే కాలంలో సంభవించటం యాదృచ్చికం కాదు. ప్రపంచ పరిణామాల చారిత్రక నేపథ్యం అందుకు దోహదపడిందని మనం అర్థం చేసుకోవచ్చు. తన సత్యాగ్రహం పిలుపు అంతగా దేశవ్యాపిత వెల్లువవుతుందని గాంధీజీ ఊహించినట్లు లేరు. బ్రిటీషు పాలకుల దమనకాండ, ప్రజల సమర శీలతను ప్రదర్శించే చైతన్యం అంతవిస్తారంగా సాగటానికి దేశవ్యాపితంగా ప్రజానీకంలో గూడు కట్టుకునివున్న సామ్రాజ్యవాద వ్యతిరేకతే కారణం.ఏప్రిల్ 14న అహమ్మదాబాదులో వున్న గాంధీజీ, ప్రజలు హింసకు దిగటాన్ని తన ప్రసంగంలో ఖండించారు. అంతటి బాధ్యతా రహితమైన తీరులో ప్రవర్తించిన ప్రజలపై నమ్మకం పెట్టుకుని పోరాడటానికి పిలుపు నివ్వటం తాను చేసిన హిమాలయమంతటి తప్పిదం అని పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. (భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర - ఇఎంఎస్ నంబూద్రిపాద్- పుట 267).మరొక 4 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 18న తన పిలుపు మేరకు సాగుతున్న శాసనోల్లంఘన సత్యాగ్రహ ఉద్యమాన్ని గాంధీజీ తాత్మాలికంగా నిలుపుదల చేశారు.
ముగింపు :+ అనుబంధాలు
జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎవరో ఒక చపలచిత్త సైనికాధికారి వల్ల యాదృచ్చి కంగా జరిగింది కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమకు మద్ధతుగా సైన్యంలో చేరి, బ్రిటీషు సామ్రాజ్యాన్ని (ప్రభువులను) కాపాడితే, డొమినియన్ స్టేటస్ లాంటిదైనా, స్వాతంత్ర్యమనే తుంపర్లయినా రాలతాయని భ్రమలు పెట్టిన గాంధీలాంటి కాంగ్రేసు నాయకుల ఆశలు, బ్రిటీషు పాలకుల వాగ్దానాలు కొరగాని వయ్యాయి. భారత ప్రజలలో రగులుతున్న తీవ్ర అసంతృప్తి లావాలా ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచి వుంది. వందేమాతరం ఉద్యమం (1905), తిలక్ అరెస్టుకు నిరసనగా బొంబాయి కార్మికులు మిలిటెంటుగా నిర్వహించిన ప్రదర్శనలు, బందులూ, రైతాంగంలో పెల్లుబుకుతున్న నిరసన జ్వాలల నడుమ ఒక పెద్ద తిరుగుబాటు ప్రమాదాన్ని శంకించిన బ్రిటీషు పాలకులు ప్రజా ఉద్యమాన్ని ముందస్తుగా తుంచివేయాలనే కుట్రలో భాగంగా అత్యంత అమానుషంగా జలియను వాలాబాగును 'రణ రక్త ప్రవాహ సిక్తం' కావించారు. సామ్రాజ్యవాదం తన దోపిడీ ప్రయోజనాల కొరకు, నాడూ,నేడూ కూడా ఎంతటి మారణకాండకయినా సిద్ధపడుతుందని చరిత్ర రుజువు పరుస్తోంది. అలాంటి సామ్రాజ్య వాదాన్ని దేశభక్త - ప్రజాతంత్ర శక్తులు ఐకమత్యంగా ఎదురుతిరిగి, నిలకడైన ఉద్యమ నిర్మాణ కృషిసల్చుతూ అంతిమంగా దాన్ని తుదముట్టించటానికి శపధం గైకొని, ఆ కృషిలో నిమగ్నమవటమే జలియనువాలాబాగు అమరులకు మనం అందించే నిజమైన నివాళి.
(పై వ్యాసాన్ని జనసాహితి రాష్ట్ర అధ్యక్షుడు దివికుమార్ వ్రాయగా 13-4-2019 విశాలాంధ్ర, ఏప్రియల్ 2019 జనశక్తి లలో ప్రచురణయినది )

