భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి స్ఫూర్తితో...

0
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన సామాజిక రుగ్మతల నిర్మూలన కొరకు పోరాడుదాం!
~~
★ మన దేశ సంపదను దోచుకొని, 200 ఏళ్లపాటు మన దేశ ప్రజలను బానిసలుగా మార్చింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో "షహీద్ భగత్ సింగ్" పోషించిన పాత్ర స్ఫూర్తివంతమైనది. 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ ను బ్రిటీష్ ప్రభుత్వం సరిగ్గా 92 ఏళ్ల క్రితం 'మార్చి 23'న ఉరితీసి చంపింది. భగత్ సింగ్ హత్యకు గురికాబడి 90 ఏళ్లు దాటినా నేటికీ జాతీయోద్యమ నాయకుడిగా, ఆదర్శ విప్లవకారుడిగా యావత్ భారతదేశానికి చిరస్మరణీయుడు. కారణం అతి చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదం సమూలంగా అంతం కావాలని, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని పోరాడాడు. అలాగే నిచ్చెన మెట్ల కులవ్యవస్థ రద్దు కావాలని, మతకలహాలు అంతం అవ్వాలని, మతాచారాల పేరిట సాగుతున్న మూఢ విశ్వాసాలు తొలగిపోవాలని కోరుకున్నాడు. స్వాతంత్ర్యం అంటే జెండా మారడం కాదు, ప్రజల పై జరిగే అన్ని రకాల దోపిడీ అంతం కావడం అని దేశ ప్రజలకు స్పష్టం చేశాడు.అలాగే ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి, ఒక దేశాన్ని వేరొక దేశం దోచుకోవడానికి వీలులేని సమాజం కోసం కాంక్షించాడు. కనుకే నేటికీ భగత్ సింగ్ ను స్మరించుకుంటున్నాం.
★ భారతదేశానికి స్వాతంత్ర్యం(?)వచ్చి 75 ఏళ్లు గడిచాయి. ఈ 75 ఏళ్ల కాలంలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మన దేశ పాలకులే దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ బ్రిటీష్ వాడు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానమే అమలులో ఉంది. విద్యాసంస్కరణల పేరుతో, నూతన విద్యా విధానాల పేరుతో విద్యారంగంలోకి ప్రైవేటీకరణను ప్రవేశపెట్టారు. ఇటీవల జాతీయ విద్యా విధానం - 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై సాగిస్తున్న దాడి పేద, మధ్యతరగతి విద్యార్థుల్ని డ్రాపౌట్లుగా మిగల్చడానికి, ఉన్నత నైపుణ్యాలు లేని అరకొరా విద్యావంతులను తయారు చేసి, నిరుద్యోగులుగా మిగల్చడానికి మాత్రమే తోడ్పడుతుంది. పాఠ్యాంశాల్లోకి కాషాయికరణను, మూఢ విశ్వాసాలను, చరిత్రను వక్రీకరణను ప్రవేశపెడుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం పాఠశాల విలీనం, తెలుగు మాధ్యమం రద్దు, ఎయిడ్ విద్యా ప్రైవేటీకరణ లాంటి అనేక విద్యా సంస్కరణల పేరుతో విద్య కు ఉరితాళ్ళు బిగిస్తుా, విద్యార్థుల జీవితాలలో చెలగాటం ఆడుతోంది. ఈ విధానాల కారణంగా నేటికీ దేశంలో 16 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. అక్షరాస్యత 74 శాతం అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ అది నిజానికి 50 శాతానికి మించి లేదు. పాఠశాలలో చేరేవాళ్ళలో అత్యధికం పదవ తరగతి లోపలే డ్రాపాట్లుగా వున్నారు. ఏడాదికేడాది డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ నిరుద్యోగుల ఆక్రందనలతో, ఆత్మహత్యలతో దేశం అట్టుడికిపోతుంది.
★ మరోవైపు చదువుకుంటున్న విద్యార్థి, యువతను పరిశీలిస్తే చదువుల పేరుతో పాఠశాల, కళాశాల యాజమాన్యాలు పెట్టే ఒత్తిడికి తట్టుకోలేక ఇటీవల స్కూల్ విద్యార్థిని నిఖిత (13), ఇంటర్ విద్యార్థి సాత్విక్ (17) తరగతి గదిలోనే ఉరి వేసుకుని చనిపోయారు. పరీక్షల్లో పాస్ కాకపోతే సమాజం నుంచి వచ్చే అవమానాలు ఎదుర్కోవాలనే భయంతో మరో ఇంటర్ విద్యార్థి దివ్య (16) ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ పేరుతో, ప్రేమ పేరుతో ఎదురవుతున్న లైంగిక వేధింపులు తట్టుకోలేక మరో ఇద్దరు యువతులు రక్షిత (20), ప్రీతి (26) జీవితాలని ముగించారు. కుల దురహంకారానికి బలై ఆ వివక్ష ను భరించలేక అత్యంత ఉన్నత విద్యాలయాలుగా పరిగణించే ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ మరియు నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థులు దర్శన్ సోలంకి(18), శ్రీ సాయి(17), సురభి పాంచాలి (16) ప్రాణాలు తీసుకున్నారు. ఇవి కేవలం రెండు నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనలు. ఎన్సీఆర్బి నివేదికల ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 8% విద్యార్థులవే. వాటిలోనూ 50 శాతం 18 ఏళ్లలోపు వారే కావడం విషాదం. అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు ఏడాదికేడాది పెరుగుతూ 2022లో అత్యధికంగా నమోదయ్యాయని, రోజుకు 36 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అది తెలిపింది.
★ ఒక సమస్య వస్తే ఎదుర్కొని పరిష్కరించుకోవాలనే దిశగా కాకుండా ఆత్మహత్యలు వైపు విద్యార్థులు ఎందుకు ప్రేరేపింపబడుతున్నారు? ఇవి కేవలం పిరికితనంతో విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కాదు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో నేర్చుకోవాల్సిన విద్యను పాలకులు విద్యా ప్రవేటీకరణలో భాగంగా మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా మార్చేసిన దుష్ఫలితాలివి. అంతేకాక విద్యార్థుల మధ్య పోటీని సృష్టించి వాటి వెనక పరుగులు పెట్టిస్తున్నారు. పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్ని అందలం ఎక్కిస్తూ మిగతా వారిని పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారు. వందలో ఐదు శాతం మందికి మాత్రమే దక్కుతున్న విలాసవంతమైన, ఖరీదైన జీవితాలను మరియు భద్రత కూడిన ఉపాధిని మిగిలిన 95% విద్యార్థులకు ఆదర్శంగా చూపుతూ విద్యార్థుల మధ్య సంక్లిష్టమైన పోటీని సృష్టిస్తున్నారు. ఆ పోటీలో నెగ్గడం కోసం విద్యార్థులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యను సృజత్మకంగా నేర్చుకోవడం కాకుండా బట్టీ పడుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక, పరీక్షల్లో పాస్ కాకపోతే ఎదుర్కోవాల్సిన అవమానాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా 3.8 లక్షలు మంది చిన్నారులపై నిర్వహించిన సర్వే ద్వారా 52 శాతం మంది చదువుల వల్ల కలిగే ఒత్తిడికి గురి కాపాడుతున్నారని, మిగతా 42 శాతం మంది భవిష్యత్తు మీద భయంతో ఆందోళన చెందుతున్నారని తెలిపింది. అలాగే కుల వివక్షత, మత, ప్రాంతీయ విద్వేషాలు కారణంగా మరికొందరు బలవుతుంటే, పాలకులచే పెంచి పోషింపబడుతున్న విష సంస్కృతి కారణంగా ప్రేమ, రాగింగ్ పేరిట ఎదురవుతున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
★ ఒక సెక్షన్ యువత ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, మరో సెక్షన్ యువత పాలకులు పెంచి పోషిస్తున్న విష సంస్కృతికి బలై మద్యం, గంజాయి మత్తులో అశ్లీల, క్రైమ్ కంటెంట్ అత్యధికంగా ఉన్న సినిమాలను వెబ్ సిరీస్ లను చూసి ఆ ప్రభావంతో అత్యంత కిరాతకంగా, అమానుషంగా హత్యలకు, హింసకు (ఏపీలో హరిహర కృష్ణ -నవీన్ ఘటన, ఢిల్లీలో శ్రద్ధ వాకర్ ఘటన) పాల్పడుతుంది. ఈ విధంగా అత్యధిక శాతం విద్యార్థులు అధైర్యంగా లేదా అనైతికంగా, ఎటువంటి విలువలు లేకుండా దేశం పట్ల, సమాజం పట్ల, కనీసం తమ సమస్యల పట్ల కూడా స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఆత్మస్థైర్యాన్ని, నైతిక విలువలను, కనీసపాటి స్పందించే తత్వాన్ని కూడా నేటి విద్యా విధానం విద్యార్థులకు నేర్పడం లేదు.
★ సమాజాన్ని తీర్చిదిద్ది, దేశాన్ని అభివృద్ధి చేయాల్సినది నేటి విద్యార్థి,యువతరమే. దానికోసం సంఘర్షణపడుతూ పెద్ద ఎత్తున పోరాటాల నిర్మించి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. తద్వారా మన జీవితాలను మార్చుకోవాల్సిన బాధ్యత మనదే. ఇదే మన ముందున్న కర్తవ్యం. "విద్యార్థులు తప్పకుండా చదువుకోవాలి. చదువు తోపాటు సమాజంలోని సమస్యలపై పోరాడాలి. లేదంటే వారికి మనుగడ ఉండదు" అని ఆ రోజే విద్యార్థులకు దిశానిర్దేశం చేశాడు భగత్ సింగ్. కనుక దేశంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు, యువత చేస్తున్న హత్యలకు వారే కారణం కాదని, ఇవి వ్యవస్థీకృత హత్యలని భావించి, వాటికి కారణమైన సామాజిక రుగ్మతల నిర్మూలన కొరకు మరియు శాస్త్రీయ, స్వతంత్ర, ప్రజాతంత్ర విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలి. అలాగే విద్యా కార్పోటీకరణను, నిరుద్యోగాన్ని, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను పెంచిపోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని విద్యార్థులకు పిడిఎస్ఓ పిలుపునిస్తోంది. ఇదే మనం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లకు ఇచ్చే నిజమైన నివాళి!
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు
ప్రచురణ తేదీ:16-03-2023, విజయవాడ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)