పీడిత జనావళికి వెలుగుబాట చూపిన శ్రామికవర్గ తొలి పొలికేక "పారిస్ కమ్యూన్"కు 152 ఏళ్ళు!

0
72 రోజులు మాత్రమే జీవించిన పారిస్ కమ్యూన్
తన యావత్ శక్తినీ ఆత్మరక్షణార్ధమే వినియోగించాల్సి వొచ్చింది
మితవాద భావాలకి ప్రాతినిధ్యం వహించే ప్రౌఢానిస్టులూ
అతివాద దుస్సాహసానికి ప్రతీకలైన
బ్లాంకిస్టుల మధ్య
కమ్యూన్ కార్యకలాపం కొట్టుమిట్టాడినా
దాస్యం నించి విముక్తికీ - దుఃఖాన్నించి ఆనందానికి
నిరాశ నించి ఆశకీ - విజయం నించి పునర్నిర్మాణానికి
నీరవ నిశ్శబ్ద నిశీధి నించి - కాంతి తరంగాల వేపుకీ
కమ్యూన్ దిగ్జయంగా పురోగమించింది!
ప్రప్రధమ శ్రామికవర్గ రాజ్యాన్ని
భూస్థలిపై నిర్మించిన పారిస్ కమ్యూన్
శతాబ్దాల నిష్ట దరిద్రుల చరిత్రలో
అపూర్వధ్యాయాన్ని సృష్టించిన పారిస్ కమ్యూన్
ఫ్రెంచి కార్మిక వర్గ విముక్తితోపాటు
యావత్ మానవాళి స్వేచ్ఛ కోసం
రుధిర జలధుల్లో
ఈదేందుకు సిద్ధమైన పారిస్ కమ్యూన్
తరతరాల పాలకవర్గాలు సృష్టించిన తమస్సును
నరికివేయ విజృంభించిన పారిస్ కమ్యూన్
మానవ స్వాతంత్ర్య ప్రదాతయైన పారిస్ కమ్యూన్
మరో ప్రపంచ సృష్టికర్తయైన పారిస్ కమ్యూన్!
దోపిడీవర్గాల ప్రయోజనాల్ని కాచి కాపాడే
పాత రాజ్యాంగ యంత్రాన్ని నాశనం జేయకుండా
శ్రామికవర్గ రాజ్య సంస్థాపన అసాధ్యం
ఇదే-పారిస్ కమ్యూన్ నేర్పిన గుణపాఠం!
వర్గ శత్రువులపై నియంతృత్వం
కష్ట జీవులకు ప్రజాతంత్రం
వెరసి-శ్రామికవర్గ నియంతృత్వం
ఇదే-పారిస్ కమ్యూన్ సారాంశం!
- సి.వి
(పారిస్ కమ్యూన్ వచన కావ్యం నుండి)
××××××××××××××××××
సరిగ్గా 150 సంవత్సరాల క్రితం పారిస్ నగరంలోని శ్రమజీవులు కార్మికవర్గ నాయకత్వాన తిరుగుబాటు చేసి, 1871 మార్చి 18వ తేదీ నుండి మే నెల 28 వరకు - 72 రోజులపాటు ఆ నగరాన్ని తమ పరిపాలనలోకి తెచ్చుకున్నారు. ఆ 72 రోజుల పోరాటం ప్రపంచ సోషలిస్టు విప్లవ విజయానికి తప్పనిసరియైన అంశాలను శ్రామిక ప్రజలకు అనుభవపూర్వకంగా పాఠాలనందించింది. దోపిడీవర్గానికి ప్రధాన పరికరమైన రాజ్యాన్ని (స్టేట్)ని ధ్వంసం చేసి, శ్రామికవర్గ నియంతృత్వ స్థాపన ఆవశ్యకతని సుస్పష్టం చేసింది. విప్లవ పోరాటం ద్వారా మాత్రమే పీడిత ప్రజలు రాజ్యాధికారాన్ని పొందగలరని రుజువు చేసింది. అంతటి ప్రాముఖ్యత కలిగిన "పారిస్ కమ్యూన్" ఘటనకు నేటితో 152 ఏళ్ళు!

Post a Comment

0Comments
Post a Comment (0)