భగత్ సింగ్ రచనలను తొలిగా వెలుగులోకి తెచ్చిన "వీరేంద్ర సింధు"

0
షాహిద్ భగత్ సింగ్ మూల రచనలను తొలిగా వెలుగులోకి తెచ్చిన వీరేంద్ర సింధు 2023 ఫిబ్రవరి 22న లండన్ నగరంలో తన 83వ ఏట మరణించారు. వారి అంత్య క్రియలు మార్చి 11వ తేదీన పూర్తయినాయి.
వీరేంద్ర సింధు భగత్ సింగ్ తమ్ముడు కుల్తార్ సింగ్ కూతురు. భగత్ సింగ్ ఉరితీత నాటికి ఈ ఆఖరి తమ్ముని వయసు 12 సంవత్సరాలు. 2004 దాకా జీవించిన కుల్తార్ భద్రపరచిన భగత్ సింగ్ వీ, ఆయన కామ్రేడ్స్ పై రచనలు వెలుగులోకి తీసుకు రావలసిందిగా తన కూతురు వీరేంద్ర సింధుకి అప్పగించారు. జనసాహితి 1986లో మొదటిసారిగా తెలుగులోకి భగత్ సింగ్ విస్తృత రచనలను నా నెత్తురు వృధా కాదు గా వెలువరించడానికి ఆధారం వీరేంద్ర సింధు సంకలనం చేసిన భగత్ సింగ్ తాలూకు పత్రాలు.
++++++++++++++++++++
'షహీద్ భగత్సింగ్ సేవాసమితి,' 'వందేమాతరం ఫౌండేషన్' ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్ర భారతిలో ఆదివారం 30.09.2007 నాడు జరిగిన షహీద్ భగత్ సింగ్ శతజయంతి ఉత్సవాలకు రచయిత్రి, భగత్ సింగ్ తమ్ముడు కుల్తార్ సింగ్ కుమార్తె వీరేంద్ర సింధు ముఖ్య అతిధిగా హాజరయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 60 ఏళ్లయినప్పటికీ దాని ఫలాలు పేదలకు అందనేలేదనీ, త్యాగమూర్తుల ఆశయాలు సిద్ధించనే లేదనీ, రోటి, కపడా ఔర్ మకాన్ నిరుపేద ప్రజలకు అందిననాడే నిజమయిన స్వాతంత్య్రం వచ్చినట్లని అన్నారు. భవిష్యత్తులో నేటి విద్యార్థులు భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలన్నారు."
తమ పెదనాన్న భగత్ సింగ్ గురించి కుటుంబసభ్యులు ఎల్లపుడు చర్చించుకోవడం వల్లను, నాన్నగారయిన కుల్తార్ సింగ్ భద్రపరిచిన, సేకరించిన సాహిత్య పుస్తకాల ద్వారాను ఎన్నో విషయాలు తాను తెలుసుకున్నానని ఆమె చెప్పారు. పెదనాన్నకి ఆంగ్లేయుల పట్ల అతిపిన్నవయసు నుండే నిరసన భావముండేదనీ, వారి తాత గారయిన అర్జున్ సింగ్ వద్ద ప్రాథమిక విద్యనభ్యసించినప్పటికీ హైస్కూల్ చదువులు తమ తాతగారయిన కిషన్ సింగ్ వద్దనే కొనసాగించాడని అన్నారు. కాలేజిలో చదివే రోజుల్లోనే భగత్ సింగ్ గదర్ విప్లవం నుండి, జలియన్ వాలాబాగ్ దురంతం నుండి, ఎందరో విప్లవకారుల జీవిత చరిత్రలు త్యాగాల నుండి, అంతర్జాతీయ రచయితలయిన బకూనిన్, ట్రాట్స్కీ రచనలేగాక లెనిన్ రచనల ప్రభావంతో స్ఫూర్తి చెంది సామ్యవాదమే తన ఆశయంగా "ఇంక్విలాబ్ జిందాబాద్" అనే మహోన్నతమయిన నినాదాన్ని మనకందించి భారత ప్రజలకు సామ్యవాద పంథాను చూపించి స్వాతంత్య్ర సమరంలో దేశమాత సంకెళ్ళను తెంచడానికి తన జీవితాన్ని 24 సంవత్సరాలకే బలిదానం చేసుకున్న మహోన్నత మానవతా విప్లవవాది అని ఆమె కొనియాడారు. ఇంకా భగత్ సింగ్ గురించి చెబుతూ విపరీతంగా సాహిత్యపఠనం చేసేవాడనీ, ఆంగ్లేయులను పారద్రోలడానికి అతి పిన్నవయసులోనే ఒక స్పష్టమయిన దృక్పథం కల్గి ఉన్నాడనీ, పెదనాన్న విప్లవ పంథా తొక్కడానికి ఆయన చిననాన్న గారయిన అజిత్ సింగ్ యొక్క విప్లవ రాజకీయ జీవితం ఎంతో స్ఫూర్తినిచ్చిందనీ, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత పీడన అణచివేతలు లేని సోషలిజం (సమసమాజం) ఏర్పడితే పేదరికం ఉండదని కలలు కన్నాడనీ, అయినా ఈనాటికీ ఆ అంతరాలు తొలకపోకపోవడం బాధాకరమేనని ఆమె అన్నారు.
భగత్ సింగ్ టెర్రరిస్టు కాడు.... అంటూ.... బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక స్పష్టమయిన నిర్దుష్టమయిన రాజకీయ సామాజిక విప్లవ దృక్కోణం నుండే తమ సంస్థకు అంతకుముందున్న పేరుకు 'సోషలిస్టు' అనే పదాన్ని చేర్చారనీ, వాళ్ళు తమ విప్లవ కార్యాచరణలో భాగంగానే సాండర్స్ ను హత్య చేసి, ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో నిరపాయకరమయిన బాంబువేసి బటుకేశ్వరదత్తుతో సహా కావాలనే లొంగిపోయి రాజగురు, సుఖ్ దేవ్ తో కలిసి ఉరితాడును తగిలించుకుని అమరులయిన ఆ విప్లవ వీరులను స్మరించుకొంటూ ఎంతో ఉద్విగ్నంగా ప్రసంగించారు.
ఆధారం : నవంబర్, 2007 ప్రజాసాహితిలో ప్రచురించిన "వీరేంద్ర సింధుతో ‘ప్రజాసాహితి' ముఖాముఖి!" నుండి

Post a Comment

0Comments
Post a Comment (0)