★ జాతీయ విద్యా విధానం -2020 లో భాగంగా దేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలు, విదేశీ ఉన్నత విద్యా సంస్థల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) చైర్మన్ ఎమ్.జగదీష్ కుమార్ జనవరి 5న ప్రకటించారు. ఈ అనుమతికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలతో యుజిసి ముసాయిదాను విడుదల చేసి, ఈ నెల ఆఖరిలోగా ముసాయిదాపై అభిప్రాయాలను తెలియజేసేందుకు గడువునిచ్చారు. విదేశీ కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చిపెట్టే, దేశంలో ప్రభుత్వ ఉన్నత విద్యను దెబ్బతీసే, పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే యుజిసి ముసాయిదాను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
★ యుజిసి ముసాయిదాలో గైడ్ లైన్స్ పరిశీలిస్తే... భారతదేశంలో క్యాంపెస్ లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రపంచంలోని టాప్-500 ర్యాంకింగ్స్ లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు లేదా దాని అనుబంధ విద్యా సంస్థలను అనుమతిస్తుంది. యుజిసికి దరఖాస్తు పెట్టి ఈ అనుమతిని పొందాలి. ప్రతి తొమ్మిదేళ్ళకొకసారి దీన్ని పునరుద్ధించుకోవాలి. స్వదేశీ మరియు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి తమ స్వంత అడ్మిషన్ల ప్రక్రియను, పాఠ్యాంశాలను, విధివిధానాలు రూపొందించుకోవచ్చు. విద్యార్థుల దగ్గర ఫీజులు ఎంత వసూలు చేయాలో నిర్ణయించుకోగలిగే పూర్తి స్వేచ్ఛ వాటికి ఉంటుంది. భారతీయ విద్యా సంస్థలపై ఉండే ఫీజు నియంత్రణలు విదేశీ విద్యా సంస్థలకు వర్తించవు. తమ సంస్థ నిర్వహణకు దేశంలో లేదా విదేశాల నుండి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఉంటుంది. అధ్యాపకుల విద్యార్హత, వేతనాలు, పని పరిస్థితులపై వారి ఇష్టానుసారంగానే జరుగుతాయి. అలాగే విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణ, చెల్లింపులు, చెల్లింపులు తిరిగి వారి దేశానికి పంపేందుకు అనుమతి ఉందనీ ముసాయిదాలో పొందుపరిచారు.
★ ఈ ముసాయిదా కనుక చట్టరూపం ధరిస్తే భారతదేశంలోనికి ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా దేశంలోకి వస్తాయనీ, తద్వారా భారతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య మన దేశంలోనే అందుబాటులోనికి వస్తుందనీ, భారత విద్యార్థులు విదేశాలకు వెళ్ళనవసరం లేదనీ, దేశానికి ఎంతో విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందనీ ప్రభుత్వం పేర్కొంటున్నది. విదేశీ విద్యాసంస్థల ప్రవేశం వలన దేశంలోని విద్యాసంస్థల మధ్య పోటీ పెరుగుతుందనీ, ఫలితంగా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందనీ చెబుతున్నారు. అయితే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు మనదేశంలోనికి వస్తాయన్న గ్యారంటీ లేదు. వచ్చినా అవి ఇక్కడ కార్యాలయాలు మాత్రం తెరచి కొన్ని నెలలు నామమాత్రపు బోధన జరిపి, విద్యార్థులను ప్రత్యేక శిక్షణ పేరుతోనో, మరోవంకతోనో తమ దేశానికి తీసుకు వెళ్ళి అక్కడే బోధనా కార్యక్రమం చేపట్టే అవకాశం మెండుగా ఉన్నది. అనేక అమెరికన్, యూరోపియన్ విశ్వవిద్యాలయాలు పలు దేశాలలో ఇదే విధానాన్ని అమలు జరుపుతున్నాయి. విదేశీ విద్యాసంస్థలు వ్యాపార ప్రయోజనాలను ఆశిస్తాయి, కాని మనదేశ విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచే ఉద్దేశ్యంతో రావనేది వాస్తవం. అంతేకాక విదేశీ విద్యాసంస్థలు మనదేశ అవసరాలకు అనుగుణమైన, మనదేశ సంస్కృతీ సంప్రదాయాలను, మనదేశ చరిత్రను, వారసత్వ సంపదను గౌరవించే విధమైన పాఠ్యాంశాలను చేరుస్తాయనే హామీ ఉండదు. ఆయాదేశాల విశ్వవిద్యాలయాలు తమదేశాల పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, తమ దేశంలోని వివిధ రంగాలలో మానవ వనరులకున్న డిమాండ్లకు అనుగుణంగా కోర్సులను నిర్ణయిస్తాయి.
★ అంతేకాక విదేశీ సంస్థలకు అనుమతినిచ్చే అధికారం మాత్రమే భారత ప్రభుత్వానికి ఉంది. ఆ విదేశీసంస్థల పాలనలోగాని, ప్రవేశాలలోగాని, విధానాల రూపకల్పనలోగాని, అధ్యాపకబృందం అర్హతలను నిర్ణయించటంలోగాని, వారి నియామకాలలోగాని జోక్యం చేసుకొనే అవకాశం లేదు. అధ్యాపకుల వేతనాల నిర్ణయంలో పాఠ్య ప్రణాళిక, పాఠ్య బోధన, పరీక్షా విధానము మొదలైన అంశాలలో భారత ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. కళాశాలలు, విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలను గుర్తించటానికి భారతదేశంలో ఉన్న ఎన్.ఎ.ఎ.సి. వంటి సంస్థలకు విదేశీ విద్యాసంస్థల ప్రమాణాలను నిర్ణయించే అధికారం లేదు. ముసాయిదాలోని పై అంశాలను పరిశీలిస్తే విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవటానికి తలుపులు బార్లాగా తెరచినట్లుగా అర్ధమవుతోంది. ఆ విశ్వవిద్యాలయాలలోనికి విద్యార్థుల ప్రవేశంలోకాని, అధ్యాపకుల ఆచార్యుల నియామకంలోకాని మనదేశంలో ఉన్న చట్టాలేమీ వర్తించవు. అంతేకాక షెడ్యూల్డు కులాలు, జాతులు, వెనుకబడిన తరగతుల వారికి ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. ఇవి సంపన్నవర్గాలకు మాత్రమే విద్యావకాశాలను, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి. వీటి ప్రవేశంవలన విద్యారంగంలోను, భారత సమాజంలోను అంతరాలు మరింతగా పెరుగుతాయి.
★ భారతదేశంలో విదేశీ విద్యాలయాలను అనుమతించాలనే ఆలోచన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన కాలం నాటి నుండి ఉంది. పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో (1995) మొదటిసారి విదేశీ విద్యా సంస్థల బిల్లు ప్రవేశపెట్టగా ఆమోదించబడలేదు.తర్వాత మన్మోహన్ హయాంలో 2006, 2010లో మరో రెండు మార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయగా ప్రతిపక్షాల (ఆనాడు ఈ బిల్లును బిజెపి వ్యతిరేకించింది) తీవ్ర వ్యతిరేకత నడుమ బిల్లు ఆమోదం పొందడంలో విఫలమైంది. అదే బిల్లును నేడు తిరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో భాగంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అనుమతి పేరుతో ఉన్నత విద్యా రంగాన్ని విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను కొల్లగొట్టేవిధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యుజిసి ముసాయిదాను వ్యతిరేకించాలనీ, దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని నెలకొని ఉన్న మౌళిక సమస్యలను పరిష్కరించి, వాటిని పటిష్టపరచాలని డిమాండ్ విద్యార్థులు పోరాడాలని పిడిఎస్ఓ పిలుపు ఇస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్.
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
తేదీ : 13-01-23,
విజయవాడ

