హిందీ ఏకైక జాతి భాష కాదు! అనేక జాతుల వ్యాపార, రాజకీయ విస్తరణ సాధనం!! - దివికుమార్ (జనసాహితి)

0
● ఒక వంద సంవత్సరాలు వెనకకు వెళ్లి ఆలోచిస్తే భారతదేశంలో బ్రిటీషు పెట్టుబడితో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించిన భారతీయ పెట్టుబడిదారుల, వ్యాపార వర్గాలలో ప్రధానంగా బొంబాయికి చెందిన పార్సీ భాషను మాట్లాడే వారూ, రాజస్థాన్ కు చెందిన మార్వాడి(రి) భాషను మాతృభాషగా కలిగిన వారూ, గుజరాతీ భాషకు చెందిన శేట్లు, కొందరు సింధీలు, పంజాబీలు ఇంకా హిందూస్థానీ (హిందీ ఉర్దూల మూల భాష) మూలాలున్న మరికొందరూ ఉండేవారు. బ్రిటిషువారికి సన్నిహితంగా ఉంటూ పారిశ్రామికంగా వ్యాపారరీత్యా ఎదుగుతున్న పై వర్గాలు ఆనాటి ప్రధాన నగరాలైన బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మదరాసు తదితరాల నిండా విస్తరించుకున్నట్లుగా మరే ఇతర జాతుల వారు (ఈశాన్య రాష్ట్రాలకు బెంగాలీలు మినహా) అన్యప్రాంతాలకు విస్తరించుకోలేదు.
● ఉర్దూ హిందుస్తానీ భాష కనుక అది వచ్చిన ఉత్తరాది ముస్లింలతో పాటు హిందువులు కూడా చాలామంది నైజాం రాజ్యానికి అవసరమైనారు. ఆ భాషతో వ్యాపారం సాగించగలిగిన ఇతర ఉత్తరాది భాషల వ్యాపార వర్గాలు కూడా హైదరాబాదు రాష్ట్రానికి, ముఖ్యంగా నగరానికి, తగినంత మంది వలస వచ్చారు. నేను హైదరాబాదులో నివసించిన 1970 నాటికి తెలుగు కేవలం ఇంటి భాష మాత్రమే! తెలుగు వారి నడుమ కూడా అప్పట్లో అది బజారు భాష కాదు, వ్యాపార (మార్కెట్ ) భాష అసలే కాదు.
● కేవలం కృష్ణ, గుంటూరు జిల్లాల వరకు చూసుకున్నా గుంటూరు, తెనాలి, బెజవాడ, గుడివాడలలో నూరేళ్ల నాడే వడ్డీ వ్యాపారాలతో మొదలుపెట్టి బంగారం, వెండి నుండి అనేక హోల్ సేల్ తో పాటు, వ్యవసాయ పంటలైన మిర్చి, పత్తి, పసుపు వ్యాపారాలలో వారి పట్టు చెప్పుకోదగినంత ఉంటుంది. వారు ఉన్న అన్ని పట్టణాలలో వారి గుడులు ఉంటాయి. వాటన్నిటికీ కేంద్రమా అన్నట్లు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా పెద్ద మార్వాడీ గుడి ఉన్నది. ఒక్క మచిలీపట్నం మినహా కోస్తా జిల్లాల పెద్ద పట్టణాలన్నిటా వారుoటారు.
● రాజకీయంగా వారు పాలక పార్టీలకు సానుకూలంగా ఉంటూ ఎక్కువమంది సంఘ పరివార్ శక్తుల అభిమానులుగా ఉంటారు. వారిలో వారు తమ భాషలో మాట్లాడుకుంటూ, ఇతరులతో హిందీలోనూ కొంత వచ్చీ రాని తెలుగులోనూ వ్యవహారం నడుపుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే వారి వ్యాపారాలకు హిందీ వచ్చిన పనివారు, వినియోగదారులు చాలా అవసరం అన్నది.
● బొంబాయి మహానగరాన్ని నిర్మించిన వారిలో తెలుగువారు సంఖ్యరీత్యా చాలా ఎక్కువ. అయినప్పటికీ యజమానుల భాషకుండే శక్తి పనివారల భాషకు ఉండదనేది జగమెరిగిన సత్యం.
●వ్యాపారానికి చేదోడువాదోడుగా నడిచేది రాజకీయ రంగం. ఆనాటికి రాజకీయ రీత్యా లాల్-బాల్-పాల్ అంటే లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ పేర్ల తర్వాత గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందారు. వీరి తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మహమ్మద్ అలీ జిన్నా ఇంకా అలీ సోదరులుగా పేరు పొందిన షౌకత్ అలీ, మహమ్మద్ అలీలు, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తి రాజగోపాలాచారి, R.S. హుక్కెరికార్, ఏ.కె. గోపాలన్, ఆచార్య రంగా తదితరులు ఉండేవారు.
● పైన పేర్కొన్న మొదటి తరంలో హిందీ మాతృభాష కలిగిన వారు ఎవరూ లేరు. అదే సమయంలో హిందీ రాని వారు కూడా లేరు. గుజరాతి మాతృభాషగా కలిగిన గాంధీ గారు 1918లో మదరాసు మహానగరంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించారు. దాని వెనుక కేవలం రాజకీయ కారణాలు మాత్రమే ఉన్నాయని భావించడం సరైనది కాదు. వ్యాపార వర్గాల ప్రయోజనాలు కూడా అంతర్గతంగా ఉంటాయి. పైన పేర్కొన్న రెండవతరం వారిలో హిందీ, ఉర్దూ మాతృభాష కలిగిన వారు ఇద్దరిద్దరిద్దరున్నారు. అయితే పైవారందరి నడుమ భావ మార్పిడికి ఉమ్మడి భాష ఇంగ్లీషు. అందులో దక్షిణాది వారికి హిందీ వచ్చునో లేదో నాకు తెలియదు కానీ ఉత్తరాది వారందరికీ వచ్చు.
●ఆధునిక చలన చిత్ర పరిశ్రమకు బొంబాయి కేంద్రం. అది మహారాష్ట్రలో ఉండినప్పటికీ అక్కడ నుండి హిందీ చిత్రాలు ఎక్కువ వెలువడతాయి. చాలా మంది ఉర్దూ రచయితలు, ఉర్దూ, పంజాబీ, మరాఠీ మాతృభాషగా కలిగిన నటులు, గాయకులు ఉండినప్పటికీ అంతా హిందీ భాష పేరుతోనే చలామణిలో ఉంటుంది. ఇప్పటికి అది అలాగే ఉంది.అయితే సాహిత్య భాషగా హిందీ చాలా ఇటీవలది. తులసీదాసు, సూరదాసు, కబీరుదాసులు రాసినది హిందీ అని చెప్పలేము. తులసీదాసుది అవధి భాష, సూరదాసుది వ్రజ భాష. కబీరుదాసుది ఖరీ(డీ)బోలి అంటే వ్యవహారిక భాష లేక హిందుస్తానీ. వారణాసి వాడు కనుక బహుశా సంత్ రవిదాస్ ది కూడా హిందుస్తానీ అయి ఉండవచ్చు.
● పంజాబ్ నుండి బెంగాలు దాకా దక్షిణాదిన గోల్కొండ రాజ్యం దాక హిందుస్తానీ భాష బ్రిటిష్ వారు రాక ముందు సైనిక, వ్యాపార భాషగా ఉండేది. వందేమాతరం ఉద్యమం తర్వాత నుండి రాజకీయ భాషగా రూపొంది ఉత్తరాది రాష్ట్రాల అనేక జాతుల ఉమ్మడి వ్యాపార, రాజకీయ భాషగా అభివృద్ధి చెందింది. దేవనాగరి లిపి కంటే పర్షియన్ (ఉర్దూ) లిపి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కాలంలో పనిగట్టుకుని బ్రిటిష్ వారు దేవ నాగరిని ప్రోత్సహించారు.
● గుర్ముఖి, బెంగాలీ గుజరాతి భాషలకు వేరు వేరు లిపులు ఉండినప్పటికీ మరాఠీతో సహా అత్యధిక భాషల వారు దేవనాగరి లిపిని, మరికొన్ని (పశ్చిమ పంజాబీ, కాశ్మీరీ, ఉర్దూ) భాషల వారు పర్షియన్ లిపిని రాత భాషగా నేడు వాడుతున్నారు. ఐదు కోట్ల మంది మాట్లాడుకునే భోజపురి భాషలో సాహిత్యము, సినిమాలు ఉన్నప్పటికీ దానికి (22) షెడ్యూల్డు భాషల జాబితాలో చట్టబద్ధ గుర్తింపు రాలేదు.
● రాజస్థానీ భాషకు కూడా ప్రత్యేక గుర్తింపు కావాలని ఒక డిమాండ్ ఉంది. ఇవేకాక ఇంకా ఉత్తరాది ప్రజల (తెగల) స్థానిక భాషలు సుమారు 56 (చప్పన్ - తెలుగువారి చప్పన్నారు దేశాలు అనే పద బంధం ఇందులో నుండి పుట్టింది) దాకా హిందీ పేరుతోనే చలామణిలో ఉంటాయి.
● మొత్తం పై అంశాలను పరిశీలించినట్లయితే హిందీ భాష హిందుస్థాని జాతి భాష మాత్రమే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఆధునిక బడావ్యాపార, రాజకీయ వర్గాల రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు తోడ్పడే ఉమ్మడి భాషగా ఉంది. పై వ్యాపార వర్గాల వారికి మార్కెట్ భాషగా హిందీ అభివృద్ధి చెందితే వారికి సహజంగా ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో హిందీ యేతర పనివారలకు అర్థమయ్యే భాషగా కూడా హిందీ ఉంటే మరింత లాభదాయకంగా ఉంటుంది గదా! అందుకే దక్షిణాదికి విస్తరించాల్సిన అవసరం వారికి చాలా ఉంది.
● ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పేదేముంది? బడా వ్యాపార వర్గాల ప్రయోజనాల విస్తరణకు సాధ్యమైనంత సులువు దారులు ఏర్పాటు చేయడం వారి విధి కదా!
● ఉత్తరాది రాజకీయ నాయకులు దక్షిణాదిలో తప్ప అన్ని ప్రాంతాలలో హిందీతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతున్నారు. అఖిల భారత సర్వీసుల (ఉదాహరణకు ఐఏఎస్) పరీక్షలు హిందీ భాషలో రాయవచ్చుననే అవకాశం వచ్చిన తర్వాత హిందీ ప్రజల భాషగా ఉన్న ప్రాంతాల వారికి ఎక్కువ మార్కులు, తద్వారా ఎక్కువ ర్యాంకులు సాధించే అవకాశాలు పెరిగాయి. ఆ విధంగా అఖిల భారత అధికార వర్గంలో (బ్యూరోక్రసీలో) హిందీ మాతృభాషల వారు బాగా విస్తరించ గలిగారు. అదే ఒకప్పుడు కేవలం ఇంగ్లీషులో మాత్రమే పరీక్షలు రాయవలసిన నాడు దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడుకు తర్వాత బెంగాల్ కు చెందిన వారు ఎక్కువ మoది అఖిల భారత సర్వీసులలో ఉండేవారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్య భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. అవి వారి వారి జాతుల భాషలు. వీరందరికీ ఒకే ఉమ్మడి అనుసంధాన భాష లేదు. ప్రధానంగా మధ్యతరగతి, ఆ పైశ్రేణి ఇంగ్లీషు ద్వారా ఇతర దక్షిణాది భాషల వారితో తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటారు.
● సామ్రాజ్యవాద బహుళజాతి వ్యాపారులు, పెట్టుబడిదారులకు ఇంగ్లీషులో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి గడిచిన 75 ఏళ్లుగా వారికి మనదేశంలో ఎలాంటి ఆటంకం లేకపోయింది. అలాగే ఇంగ్లీషు వచ్చిన చౌక కూలీలను భారత దేశంలోనే కాక విదేశాలలో కూడా చౌకగా పొందటానికి వారికి ఇంగ్లీష్ భాష తోడ్పడుతుంది. విదేశీ కార్పొరేట్ కంపెనీల దోపిడీ ప్రయోజనాలలో వాటాకై (కమిషన్లకై) తాపత్రయపడే తెలుగు తదితర జాతుల పెత్తందారులు, ఇంగ్లీషు మాధ్యమంలో చదువులే ఉత్తమం అని ప్రోత్సహిస్తారు, దాన్ని కాపాడతారు.
● మాతృభాష ద్వారా పరాయి భాషలను సులువుగా బాగా నేర్పుకునే శాస్త్రీయ ప్రక్రియను పట్టించుకోకపోగా కావాలని విస్మరిస్తారు. బలమైన ఆధునిక జాతీయ పెట్టుబడిదారీ వర్గం లేకుండా, నేటి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా శ్రామికవర్గ ఉద్యమం బలపడకుండా, అంటే మా రాష్ట్రంలో వనరులు, మార్కెట్లు, ఉత్పత్తులపై మాకే ఆధిపత్యం ఉండాలి అని కోరుకునే దమ్ము ధైర్యం కలిగిన వర్గాలు లేకుండా కనీసం అందుకై పోరాడే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు లేకుండా తెలుగు భాష తన ఉనికిని నిలబెట్టుకోలేదు. కనుకనే అనేక సమస్యలు గందరగోళాలు ఎదుర్కొంటున్నది.
● ఒక భాష ఆ జాతిలోని దోపిడి వర్గాలకు శ్రామిక వర్గాలకు ఉమ్మడిగా తోడ్పడుతుంది. అదే సమయంలో అన్య జాతుల భాషకు వ్యాపార విస్తరణతో పాటు దోపిడీకి తోడ్పడే లక్షణాలు ఏర్పడినట్లయితే, ఆ వర్గాల ఆధిపత్య స్వభావం భాషలు పొందినట్లు కనిపిస్తుంది, కానీ... అది ఆ భాష స్వభావ సిద్ధ లక్షణమని భావించకూడదు. అది దానిని వాడుకునే వర్గాల లక్షణం.
● అందుకే మన పోరాటం హిందీ భాషకో ఇంగ్లీషు భాషకో వ్యతిరేకంగా కాకుండా ఆయా భాషలను మనపై రుద్దడానికి ప్రయత్నించే ఆర్థిక రాజకీయ వర్గాలకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టవలసి ఉంది. చాలామంది ఉత్తరాది పెట్టుబడిదారులకు, రాజకీయ నాయకులకు వారి మాతృ భాష హిందీ కాకపోయినా, ఇతర రాష్ట్రాలకు తాము విస్తరించుకునేoదుకు హిందీని తమ కార్యకలాపాల భాషగా వాడుకుంటారు. వారి వ్యాపార విస్తరణ ప్రయోజనాలకు దక్షిణాది రాష్ట్రాలకు హిందీ విస్తరించుకోవటం నేటి అవసరం. గుజరాతి శేట్లు, వారి రాజకీయ నాయకులు కూడా హిందీనే ప్రోత్సహించటం వెనక వారి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు బలంగా ఉన్నాయి.
● దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడులో పెరిగినంతగా ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గం ఇతర జాతులలో చెప్పుకోదగినంతగా పెరగలేదు. తెలుగు వారికైతే మందుల పరిశ్రమలో, కొంతలో కొంత సినిమా పరిశ్రమలో తప్ప పారిశ్రామిక వర్గం తక్కువ. కాంట్రాక్టర్ల వర్గం కొంత ఉన్నది. కానీ తమ భాషను విస్తరింప చేసే అంత శక్తి పైవారికి లేదు. అసలు తమ భాష క్షీణిస్తున్న సంగతి తమ రాష్ట్రoలో బోధనా భాషగా పరిపాలనా భాషగా కూడా నిలదొక్కుకోలేక నీరసపడి పోతున్న సంగతి వారికి (వరప్రసాదరెడ్డి గారు లాంటి ఒకరిద్దరకు తప్ప) పట్టకనే పోవచ్చు. ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను అందించలేని భాష పట్ల పాలకవర్గ ముఠాలకు పెద్దగా ఆసక్తి ఉండకపోవటం సహజం.
● మనదేశంలో భాషా ప్రజాస్వామ్యం నేటికీ నెల కొనలేదు. కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని పెంచి పోషించే సంస్కృతి, మెజారిటీ భాషల అధిపత్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. మైనారిటీ భాషలను ప్రజాస్వామికంగా ఎదగనివ్వకుండా తమిళనాడులో తెలుగుని లాగా (ఉత్తరాది ఉర్దూని లాగా) అణచిపెడుతూ ఉంటుంది. అనేక జాతుల నిలయంగా భారతీయులు ఉండటం ఎంత నిజమో, దేశీయంగా మనకు నిజమైన ప్రజాస్వామ్య సంస్కృతి నెలకొనక పోవడం కూడా అంతే నిజం. కనుకనే నేడు కుహనా ప్రజాస్వామ్యం, ఉన్మాద ప్రజాస్వామ్యంగా సులువుగా మారగలిగింది. ఇటువంటి పరిస్థితులలో పరాధీన ఆర్థిక రాజకీయాలకు తలవొగ్గిన జాతి, భాష విషయంలో కూడా తలవొగ్గి బతకాల్సి వస్తుంది. ఇది చారిత్రక అనివార్య క్రమం.
● 47 ఏళ్ల క్రితం మహాకవి శ్రీశ్రీ ఆనాటి ముఖ్యమంత్రిని బానిసకొక బానిసకొక బానిసా అన్నాడు.ఈ బానిస తత్వం పరాధీన ఆర్థిక రాజకీయాల ఫలితంగా తెలుగు జాతికి పుట్టిన చీడ అని అర్థం చేసుకోకుండా కేవలం భాషా సమస్యగా భావించి ఉద్వేగాలను ఎంత ప్రదర్శించకున్నా ఆత్మ సంతృప్తిని మాత్రమే పొందగలుగుతాము. భాషా పరాధీనత మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. *ప్రజల భాషలో విద్య-- పరిపాలన* అనే ప్రజాస్వామిక ఆకాంక్ష అలాగే మిగిలిపోతుంది.
● భాషా ప్రజాస్వామ్యం, జాతుల సమానత్వ ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందేటట్లు చేయలేకపోతే, ఇతర (కుల మత జెండర్) సంఘర్షణలకు తోడు భాష కూడా జోడు అవుతుంది. ఈ సంఘర్షణలో తామే నెగ్గ గలుగుతామనే అతి విశ్వాసం హిందీ భాషను అందరిపై రుద్దాలని చూస్తున్న నేటి కేంద్ర పాలకులకు బలంగా ఉంది.

Post a Comment

0Comments
Post a Comment (0)