మిత్రులారా !
◆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పేరుతో 2020 డిసెంబర్ నెలలో డిగ్రీ అడ్మిషన్లను సరికొత్తగా 'ఆన్ లైన్ విధానం'లో చేపట్టింది. కరోనా ప్రభావం తగ్గినా సరే, నేటికీ ఆన్లైన్ అడ్మిషన్లే జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్ దరఖాస్తుల కోసం విద్యార్థులు రోజుల తరబడి నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ,200-300 రూ,,లు ఖర్చుపెడుతున్నారు. కరోనా తర్వాత ఈ కొత్త విధానం వలన ఆప్షన్స్ అప్లై, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా పూర్తయి, 2021 జనవరి చివరి నాటికి గాని 'ప్రభుత్వ డిగ్రీ' కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కాలేదు. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెల వచ్చినా సరే, ప్రభుత్వ కాలేజీల్లో 'సీటు' కోసం చూసే విద్యార్థులకు ఎదురు చూపులే మిగిలాయి. దీనికి భిన్నంగా ప్రైవేట్, కార్పొరేట్ డిగ్రీ కాలేజీల్లో మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ ల నుండే క్లాసులు జరిగిపోవటం విశేషం! దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మెజారిటీ విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లోనే చేరాల్సివస్తున్నది. ఇదే ఆసరాగా 'జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పుణ్యమా' అని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు కూడా నామమాత్రంగా ఉన్న ఫీజులను ఒక్కసారిగా 20 వేలు, 30 వేలకు పైగా పెంచేశారు. కానీ ఈ పథకం అరకొరగానే అమలుకావడంతో (సగం డబ్బులే జమ కావడం) పరీక్షల సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకి ఉన్న కొద్దిపాటి విద్యా అవకాశాలను దూరం చేస్తూ, విద్యా వ్యాపారాన్ని గ్యారెంటీ చేయటం కాదా? మరోవైపు ఈ ఆన్ లైన్ విధానంతో విద్యా సంవత్సరంలో దాదాపు సగం కాలం వృధా కావట్లేదా?
//విద్యా సంవత్సరం కుదింపు - అధిక సిలబస్ - పరీక్షల ఒత్తిడి//
◆ కరోనా మొదటి, రెండవ దశల్లో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని సరిచేస్తామని చెప్పి, సిలబస్ త్వర త్వరగా పూర్తిచేసి 3,4 నెలలకే సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. (ఏకంగా 9 నెలల్లో 3 సెమిస్టర్లు జరిగాయి.) అలాగే 3వ సం. లో సిలబస్ ను కూడా 2వ సం.లోనే అప్పటి సిలబస్ తో పాటు, అదనంగా చదివించేస్తూ, విద్యార్థులను గందరగోళపరుస్తున్నారు. ఈ విధానాలతోనే ఆందోళన చెందుతున్న విద్యార్థులకు కొత్తగా 'స్కిల్ డెవలప్మెంట్' కోర్సుల పేరుతో ఎటువంటి థియరీ, ప్రాక్టికల్ క్లాసులు జరపకుండానే 3 పరీక్షలు పెట్టి 'పాస్' కావాలని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. (అంటే మొత్తం 8 పరీక్షలు)
◆ 2021 నుండి డిగ్రీలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. అలాగే CSP (కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్) పేరుతో 'ప్రభుత్వ డిగ్రీ కాలేజీల' విద్యార్థులను గ్రామ సర్వేలు చేయమన్నారు. ప్రతి విద్యార్థి 50 కుటుంబాల వివరాలను (డోర్ నెంబరు, ఏ మతము, ఇంటర్నెట్ వాడుతున్నారా లేదా, ఎంత భూమి,.. మొదలగు 25 ప్రశ్నలతో) సేకరించాలి. ఈ ప్రాజెక్టుతో విద్యార్థికి ఏమైనా ఉపయోగముందా?
//సమగ్రత లేని 'ఇంటర్నషిప్'విధానం - వృధా అవుతున్న విద్యా సంవత్సరం//
◆ నూతన విద్యా విధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలనీ, ప్రపంచంతో పోటీ పడాలని విద్యాసంవత్సరంలో (5,6 సెమిస్టర్లలో) 8 నెలల ఇంటర్నషిప్ విధానం పెట్టారు. (ఇంటర్నషిప్ అంటే విద్యార్థి పని అనుభవం పొందటానికి పెట్టే శిక్షణా కాలం). కానీ, ఇక్కడ ఇదెలా అమలు జరుగుతుందంటే, విద్యార్థులు తమ గ్రూప్ తో (సబ్జెక్టుకు) ఎటువంటి సంబంధం లేకుండా (ఉదా:- రైస్ మిల్లుల్లో Bsc విద్యార్థులు) సచివాలయాల్లోనూ, షుగర్ ఫ్యాక్టరీ లోను, దుకాణాలలోను, నెట్ సెంటర్లలోను, హోటల్లోను, ఫ్యాన్సీ, బట్టల షాపుల లోను, ప్లాంటేషన్,... ఇలా జిఎస్టి పరిధిలోకి వచ్చే సంస్థల పేరుతో వీటిని కేటాయించారు. ఇవి అర్హత గల సంస్థ లేనా? అర్హత ఉన్నా, విద్యార్ధి కి అవసరమైన శిక్షణ అందుతుందా? సంస్థలో విద్యార్థి భద్రతకు, శిక్షణకు బాధ్యతెవరిది? ఇది సంస్థ యజమానికి 'ఉచిత' సేవగా మారదా?.....అనే ప్రశ్నలోస్తున్నాయి. పైగా సంస్థ ఎంత దూరంలో ఉన్నా సరే రవాణ, తిండి ఖర్చులన్నింటినీ ఆ విద్యార్ధే భరించాలి. ప్రస్తుతానికి ప్రతిరోజు సంస్థ వద్ద ఉన్నట్లుగా ఫోటోలు అప్లోడ్ చేయడమే ఇంటర్నషిప్ గా మారింది! ఇలా ఇది విద్యార్థుల విద్యా సం..న్ని ఎటూ చెందకుండా, తీవ్రంగా వృధా చేసి,'సర్టిఫికెట్' కోసం చేసేదిగానే మిగులుతుందా?! మన విద్యా విధానంలో పాఠశాల స్థాయి నుండి చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జీని, వృత్తి నైపుణ్యాలను నేర్పాలి. విద్యను, ఉత్పత్తితో అనుసంధానించాలి. అయితే ఇటువంటి అసంబద్ధ విధానాలతో అది సాధ్యమేనా ?!
◆ డిగ్రీ విద్యలోని విజ్ఞాన, ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, చారిత్రక, సామాజిక మొదలైన శాస్త్రాలను అభ్యసించిన "పట్టభద్రులను" ఇముడ్చుకోగల్గే విధంగా మన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలుండాలి. దానికవసరమైన విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయాలి. నేటి మన ప్రభుత్వాల విధానాలు ఆ విధంగా ఉన్నాయా?!
//ఈ అసంబద్ధ విధానాలకు మూలం-రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానాన్ని (NEP) అమలు చేయడమే!//
◆ గతం నుండి అమలవుతున్న ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విధానాల్లో భాగంగానే, మన విద్యా రంగాన్ని 'లక్షల కోట్ల రూపాయల వ్యాపారంగా'మార్చారు. విద్యను 'సమాజ అవసరాల కోసం' కాక, కార్పొరేట్, MNC కంపెనీలకు మేధో కూలీలను సప్లై చేసేదిగా మార్చారు. ఈ విధానాలను మరింత వేగవంతం చేసేదే NEP-2020! 2020 జూలై నెలలో నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే తమిళనాడు, కేరళ, ఇంకా అనేక రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించగా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనిగట్టుకుని అమలు జరుపుతున్నది. ఇప్పటికే పాఠశాలల విలీనం, బైజూస్ ఒప్పందాలతో ('సెల్ ఫోన్ చదువులు') పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తున్నది. ఇప్పుడు డిగ్రీలో అమలవుతున్న ఆంగ్ల మాధ్యమం, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్నెట్ షిప్, CSP మొదలైన విధానాలు కూడా అలాంటివే!
◆ ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మౌలిక వసతులైన ల్యాబ్స్, లైబ్రరీ, బోధనా సిబ్బంది, భవనాలు, మంచినీరు, టాయిలెట్స్ ఇంకా అనేక కొరతలతో విద్యార్థులు సతమతమౌతున్నారు. ప్రభుత్వాలు వీటిని పరిష్కరించకపోగా, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, NEP విధానాలతో డిగ్రీ విద్యలో ప్రమాణాలు తీవ్రంగా పడిపోతున్నాయి. ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) పడిపోతుంది. ఫెయిల్యూర్స్, మధ్యలోనే డ్రాప్ ఔట్స్ అయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. అధిక సంఖ్యలో డిస్టెన్స్ డిగ్రీ, ఇతర కోర్సులు వైపే మొగ్గుచూపే పరిస్థితి తీవ్రం అవుతుంది. కనుక విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, విద్య, ఉపాధిని అందించే బాధ్యత నుండి తప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా, నూతన జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయాలని, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థులంతా పోరాడాలని పిడిఎస్ఓ విజ్ఞప్తి చేస్తున్నది.
అభినందనలతో....
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)
అనకాపల్లి జిల్లా
ప్రచురణ: N.భాస్కర్, 9642706100,
S.రుద్రి, 7036266347

