పందికొక్కులు - కొ.కు

0
దేశంలో పందికొక్కుల విజృంభణ నానాటికి తీవ్రమైంది. మనిషి చెమటోడ్చి పండించిన ధాన్యంలో పదోవంతు పందికొక్కుల కమీషన్ గా ఆమోదించబడుతూ వస్తున్నది. కాని యాభై శాతం పందికొక్కులు తినెయ్యటం చాలా తప్పు. అందుకని కొందరు యువకులు పందికొక్కులను వెతికి చంపసాగారు. పందికొక్కులను చంపేవాళ్ళను వేటాడి తుపాకులతో కాల్చటమూ పట్టుబడితే కారాగృహాలలో పెట్టి చిత్రహింసలు చేయటమూ సాగించింది.
అయినా “పంది కొక్కులు నశించాలి” అన్న నినాదం యిచ్చింది ప్రభుత్వం.
"ఇది కపట విధానం. ఈ ప్రభుత్వం పందికొక్కులను తుపాకులతో కాపాడుతున్నది" అంటూ కొందరు రాజకీయవేత్తలు బయలుదేరి అహింసా విధానంతో పాత ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
వీళ్ళు ప్రజలకు హామీ ఇచ్చారు!
“పందికొక్కుల్ని అదుపులో ఉంచుతాం. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీరుస్తాం.” కాని పందికొక్కుల విజృంభణ తగ్గలేదు. హెచ్చింది.
క్రొత్త ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రజలు అడిగారు.
అలా అడగటం అన్యాయం. క్రొత్త ప్రభుత్వం చేతులు కట్టుకు కూర్చోలేదు. అది పందికొక్కులను అదుపులో వుండమని వేడుకున్నది. న్యాయంగా పదిశాతం భోంచేయమన్నది. అంతకు మించి తినటం అక్రమమని, అలాచేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయనీ అన్నది. ఆ చర్యలు ఎలాటివో అది పరమ రహస్యం.
పందికొక్కుల్ని అదుపులో పెట్టేదానికి పదేళ్ళు వ్యవధి ఇయ్యమనీ, పోయిన ప్రభుత్వం పెంచిన పందికొక్కుల్ని అదుపు చెయ్యటం త్వరలో జరిగే పని కాదనీ, అయినా పందికొక్కులను వేటాడేవాళ్ళ ప్రాణాలు తీసే అహింసా కార్యక్రమం అక్షరాలా సాగుతుందని క్రొత్త ప్రభుత్వం అటు ప్రజలకూ ఇటు పందికొక్కులకు కూడా హామీ ఇచ్చింది.
అందుచేత మళ్ళీ అయిదేళ్ళకు ప్రజలు ఈ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటే, పదేళ్ళ తరవాత నందో రాజా భవిష్యతి.
- ప్రచురణ : యువ, జనవరి 1978.

Post a Comment

0Comments
Post a Comment (0)