వాడిది అగ్రరాజ్యం
వాడే నిలబడాలనుకుంటాడు
ప్రపంచం సజీవంగా కనిపించే కావ్యం కాదు -
ముదిరిన వ్యాపార
ముదనష్టపు వాడి
మెతక మెదడుకి
నిలువరించే నెత్తురు అడ్డువస్తే
దేశం సమాధులపై మొలిచే ముళ్ళపొద అవుతాడు!
వాడిది అ(ఉ)గ్ర రాజ్యం
వాడే నిలబడాలనుకుంటాడు!!
తెలివిని చంపి,
బెదిరించి ,
భయపెట్టే
బితుకు బతుకు వాడిది
నీ దేశభక్తికి వివేకం వుంటే
నీ దేహభుక్తికి తనివి వుంటే
ఈ పరాధీన విధానాల
ఈ పరాభవ వ్యవస్థల
చెదపట్టిన శిథిలాల్లో
అర్ధవంతమైన మార్గాలు
వెతికేవి కదా
నీ చూపులు!!
వాడు నీ వివేకాన్ని విషమయం చేస్తాడు!!
పిచ్చి, మూర్ఖత్వం, ద్వేషం, పైశాచికత్వం
ఇదే నీ సిద్ధాంతమంటాడు!
పువ్వులు విసిరే నీ చేతులకు తుపాకులు ఇస్తాడు!
పచ్చని పంటలో
నీ నెత్తురు కాలువలు తీసి ,
నీతోనే తాగిస్తాడు!
వాడిది అగ్రరాజ్యం
వాడొక్కడే
నిలబడాలనుకుంటాడు.
వాడికి నీ గుండె చప్పుడు వినపడదు
తుపాకీ తూటాలతో
ఆరోగ్యం, స్వేచ్ఛ, ఆనందం, సమానత్వం రావుకదా!
ఆకలి - కన్నీరులను ఉత్పత్తిచేసే వ్యూహరచనలు
నీ దేశాన్ని
సరి చేస్తాయంటాడు
అందుకే
పారిస్ ఒప్పందానికి
దూరంగా ఉంటాడు!
ఐక్యరాజ్యసమితి
శాంతి, శాంతి అంటే -
నీ దేశం ప్రతి గడపకి ఒక తుపాకీ అవసరం అంటాడు!
ఎందుకంటే,
వాడిది ఉగ్రరాజ్యం!!
వాడే నిలబడాలనుకుంటాడు!!
అసమానతలు - అరమరికలు
మధ్య కొట్టుకు చచ్చే
మన దేశాలపై..
జాలిజాలిగా -
సంపదల బరువు
మీకెందుకని
వాడు మారణ యజ్ఞకర్తగ
వాడే భోక్త అవుతాడు!
ఆకలి, కన్నీరు బొమ్మల్ని గీసి,
విషాదగీతాలు శృతి చేస్తాడు!
కరుణరసానికి ఫలశ్రుతి తనదే అంటాడు!!
విషపుత్రిక మీడియా...
పరవశం అయిపొమ్మని
ప్రపంచాన్ని శాసిస్తుందిక్కడ!
అదొక గొప్ప సృజనాత్మక గీతమని నమ్మించి
ప్రజల్ని కోరస్ అందుకోమంటుంది
అందరి కళ్ళ కలలు ఆ మెరక కంటి వాగులవుతాయి!
వాడిది అగ్రరాజ్యం అందుకే!
వాడొక్కడే నిలబడాలంటాడు!!
పంచేంద్రియాలతో
జీవం ఉన్న ఓ మనిషీ!
కర్మేంద్రియాల క్రియలోకి రా!!
నీ భుజాలగూడు
బరువుగా లేదూ?
నీ మెదడు
కంప్యూటర్ని సృష్టించ లేదూ?
తెగువ గుండె తొడుక్కుని
నిన్ను నువ్వు అద్దం ముందు
యోధునిగా చూసుకోలేకపోతున్నావా?!
సామాజిక మాధ్యమాల కాలక్షేపానికి కాలాన్ని
కరిగించే నీకు
కార్ల మార్క్స్ సిద్ధాంతం నీకెందుకులే!
మతం అంటావు
మోక్షం అంటావు
మానవత్వమే మరిచిపోతుంటావు!
అదేంటో అశుద్ధం తిన్న కుక్కలన్నీ కలిసే ఉంటున్నాయి!
బొందితో మోక్షం కోరే ఉభయచరంగా
ఉట్టికీ, చట్టికీ అందక
కొట్టుకు చస్తావు నువ్వు!
సోమరిపోతంటే
నచ్చని సోంబేరివి కదా నువ్వు
శేష ప్రశ్న ఒక్కటే!
నిజానికి నువ్వెక్కడ
నిలబడి ఉన్నావ్?!
పాదలకింద నేల కోసం జరిగిన యుద్ధ చరిత్ర నీది
నీ ఊపిరి కూడా వ్యాపారం అయిపోయిన వర్తమానం ఇది
నిన్ను కూలుస్తున్నదొక గొప్ప ముత్తు!
పాలస్తీనా నెత్తుటి రోదన, వేదన నీకెందుకులే!
రేపు మన దేశం
అందులో
ఉంటే ఎంత! లేకుంటే ఎంత!!
వీరుల కథలు కవిత్వాలు వల్లిస్తావ్
నీలో మార్పు వచ్చేలోగా మరణం నిన్ను ఆవహిస్తుంది
మనకి వారం వారం కోడి మాంసం ధరలు తెలుసు
మన నెత్తుటి ముద్దుల ప్రాణం విలువ మాత్రం తెలీదు
అదే ఇంతకాలం నువ్వు నేను నేర్చుకున్న మన విద్యా విధానం!
ఈ డిగ్రీ పట్టాలు పిచ్చి కాగితాలు
చదువు కోసం లక్షల ఖర్చులు
చదువుల పట్టాలు తప్పిన నువ్వు
తెలివిగల నాయకుల చేతిలో
అంబకు చిక్కిన మేకవు!
భౌతికంగా ప్రాణం ఉన్న
ఓ మనిషి!
నిజానికి నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావ్?
పరికించి చూడు పది దిక్కులూ..
అందుకో ఈ స్టూడెంట్ అనే పోరాట చైతన్య రథ పుస్తకం!
- మహేష్ కోట
---------------------------------
చదవండి! చదివించండి!!
పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక