ఫస్ట్ కాజ్ : ఏప్రిల్ 16, చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు..విఖ్యాత హాస్యనట చక్రవర్తి
ఈ తరం చార్లీ చాప్లిన్ గురించి తెలుసుకోవాలి. నటన అంటే ముఖానికి రంగు... ఒంటికి వేషం అని మాత్రమే తెలిసిన వాలకాలకు ఆయన తెలియాలి. కన్నీళ్లకు ఒక అర్థం.. రాజ్యాన్ని ధిక్కరించే నైజం ఈ రెండూ తెలియాలి. చాప్లిన్ అనే మహాశయుడు మనలో పుట్టి మనలో పెరిగిన కథకుడు. ఆకలి దారిద్ర్యం మోసిన కళాకారుడు. కాలం అనే యుద్ధంలో ఓడిపోయిన వాడు కూడా! యుద్ధాన్నీ, ఉన్మాదాన్నీ నిరసించిన వాడు కూడా ! ప్రేమలో విరహాన్నీ, ఆనందాలనూ మోసిన వాడు. అన్నింటా ఒంటరి వాడు అతడు. చాప్లిన్ అంటే నవ్వుల రారాజు. కన్నీటి తార ! ఇవి కూడా తెలియనోళ్లకు చాప్లిన్ గురించి చెప్పే ప్రయత్నం ఇది. నవ్వించడం కన్నా ..మరో వరం జీవితాన లేదు. కానీ నవ్వుల వెనుక విషాదాలూ, విషాదాంతాలూ ఎవరివి ? ఎవరికి ? అన్నవి తప్పక ఎవరికి వారు తెలుసుకోవాలి. జీవితం అంటే ఇదే !
ఆయన నిజంగా దేశ దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ దక్క లేదు. కానీ ఆయన వేసిన దేశ దిమ్మరి వేషానికి (ట్రాంప్) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్. జేజేలు పలికింది హాలీవుడ్. పెట్టుబడీ దారీ వ్యవస్థను నిరసించినప్పుడు ఆయన్ను హిట్లర్ సైతం మెచ్చుకున్నాడు. ఆయన సెటైర్ ను విని, చూసి నవ్వుకున్నాడు, కన్నీళ్లు కూడా పెట్టాడు. ఒక విషాదంలో నవ్వు. నవ్వులో రేపటి తరం భవిత కోసం వెతికే బాధ్యత. ఇవన్నీ చాప్లిన్ చేసిన పనులు. మోడ్రన్ ఆర్ట్కు సరితూగే నిర్వచనం అతడు. ఆయనకు అనుకరణ ఎవ్వరూ లేరు. ఉండరు. ఆయన అనుభవించిన కన్నీళ్లకు మనలో కొందరి బాధార్తుల జీవితాలు కొనసాగింపు కావొచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్నీ, చేసే దోపిడీనీ, అది సృష్టించే నిరుద్యోగాన్నీ, పేదరికాన్నీ..ఇంకా ఎన్నో వికృతాలనూ మోడర్న్ టైమ్స్ అనే సినిమాలో ఎలుగెత్తి చాటాడు. అంతేస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధ కాలం (1940) లో తీసిన "ద గ్రేట్ డిక్టేటర్" లో హిట్లర్నూ, ఫాసిజాన్నీ నిరసించి అందరినీ ఆలోచింపజేశాడు. 1889 ఏప్రిల్ 16 న ఇంగ్లాండ్..లో జన్మించిన చాప్లిన్, 1977 డిసెంబర్ 25 న స్విట్జర్లాండ్..లో మరణించాడు. పేరూ కీర్తీ కన్నా జీవితానికి ఇంకెన్నో ముఖ్యం అని భావించి జీవించాడు. కొన్నింట తన జీవితానికీ, స్వేచ్ఛకూ అడ్డుగా వచ్చిన ఇమేజ్ ను కూడా ఛీత్కరించాడు. చివరి వరకు పేద ప్రజల పక్షానే నిలిచిన చార్లీ చాప్లిన్ కు ఈ పుట్టిన రోజు వేళలో.. ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్ఓ) జోహార్లు అర్పిస్తోంది.
ప్రపంచానికి ఉన్నన్నాళ్లూ మనమే..ఈ మాట చార్లీ చాప్లిన్ అన్నారు. అంటే మన తోడు ఈ ప్రపంచం. ప్రపంచానికి విషాదం అవసరం. సంతోషాలు అత్యంత అవసరం. విషాదం నుంచి పొందే మేలు కొలుపు అతడు. మనం ఎక్కడి నుంచి ఇక్కడకు వచ్చాం. లేదా ఇక్కడ తేలాం అన్నదే ముఖ్యం. చాప్లిన్ ప్రసంగంలో కొన్ని మాటలు పాలపుంతలలో కాంతుల మాదిరిగా ఉన్నాయి. ఆ..తారలు మనల్ని.. దీవిస్తాయి. మాటలూ, మౌనాలూ కలిసిన ఆ..చోట..మనల్ని కొత్త ప్రపంచం వైపు నడిపిస్తూ ఉంటాయి. "మబ్బులు విడిపోతున్నాయి. మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు. చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాము. అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు. దురాశను జయిస్తారు. పాశవికతను జయిస్తారు. మానవుడి ఆత్మ సరికొత్త రెక్కలు తొడుక్కుంది. ఎట్టకేలకు అతడు ఎగిరేందుకు ఉద్యుక్తుడవుతున్నాడు. ఒక ఆశల ఇంద్ర ధనుస్సులోనికి, ఒక కాంతివలయంలోనికి, ఒక ఉజ్వల భవిష్యత్తులోనికి మనిషి ఎగిరిపోతున్నాడు. ఆ.. భవిష్యత్తు నీది..నాది.. మనందరిది......." అని చెప్పాడు చాప్లిన్. కవితాత్మకం అయిన వాదంతో చెప్పాడు. ఆశ నిరాశల ఊగిసలాటలలో ఉన్న మానవావరణలో సరికొత్త మార్పు ఒక్కటి వస్తే.. చాలు. ఇదొక్కటే ఆయన కోరుకుంటున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. జేజేలు. జోహార్లు. నివాళులు. కన్నీటి సంద్రపు తీరాల చెంత !
విషాదాన్ని మోద్దాం. వానలో.. యుద్ధంలో.. కన్నీళ్లలో.. విషాదం ఎంత బాగుంటుంది. ఒక స్థిరం అయిన జీవితం నుంచి విషాదం ఒక్కటి నిలిచి ఉంటుంది. మనకు ట్రాజెడీ నచ్చదు. మన సినిమాల్లో..ఇతర కళా రూపాల్లో.. దుఃఖాంతాలా ? లేవు. ఉన్నవి కొన్ని సుఖాలు. శరీర సుఖాలు పొందాక మనకు నవ్వులు కావాలి. నవ్వుల వెనుక విషాదం ఎవరికి ? ఎవరివి ? వానలో నడుస్తూ నడుస్తూ ఓ చిన్నారి. అమ్మ ఉన్నా లేని వైనం. అమ్మకు మతి స్థిమితం లేదు. తన ఒంటి నిండా గాయాలు ఉన్నా పైకి చెప్పుకోలేని బాల్యం. అయినా నడుస్తూ, నడుస్తూ చిన్నారి ..తన కోసం ఏమయినా చేయాలి అని అనుకుంటూ.. ఉన్నాడు. తన కోసం..తన బాల్యం కోసం.. తనలాంటివారి బాల్యం కోసం కొన్ని మంచి పనులకు రూపకల్పన చేయాలి అని అనుకుంటూ.. రోడ్లపై నడయాడాడు. లండన్ నగరం పేరుకు ఖరీదు కానీ ఇలాంటి ఖరీదుకు అందని పేదరికాన్ని కూడా మోసింది అని చెప్పుకోవాలి. ప్రేమలోనో లేదా జీవితంలోనో వైఫల్యాలు ఉన్నప్పుడు చార్లీ చాప్లిన్ లాంటి మంచి నవ్వు ఒక్కటి కావాలి. విరహంలోనో, విషాదంలోనో, తోటివారి బాధలో భాగం అయినప్పుడో దేశాలకు యుద్ధాలు అవసరం అయినప్పుడో చార్లీ చాప్లిన్ నవ్వు ఒక్కటి కావాలి. మనం అంతా ఒక్కరం అయిన లేదా ఒక్కటి అయిన సందర్భాలే లేవు కదా ! మనం విచారపడి యుద్ధాన్నో, ద్వేషాన్నో నిలువరించలేనప్పు డు ఉండి ఏం లాభం ? నాటకం నుంచి జీవితం మొదలు. రంగస్థలం నుంచి జీవితం మొదలు. ఈలలూ, పాటలూ కలిసి ఊహల చిన్నారికి ఊతం ఇచ్చాయి. కడుపు నింపాయి అని రాయడం సులవు.
మనలో మనమంతా ! పూర్తిస్థాయిలో ఏడ్చి ఎన్నాళ్లో అయి ఉంటుంది. దుఃఖం నుంచి పుట్టిన నవ్వులు ఎందరినో కదిలిస్తాయి అని అనుకుందాం. చార్లీ చాప్లిన్ పైకి నవ్వించినా, లోపలి తత్వాలకు కూడిక అతడు. వెలుపలి దుఃఖాలకు విరుగుడు అతడు. నవ్వండి ఏం కాదు. జీవితపు విషాదం అక్కడే ఉంటుంది. నవ్విస్తూనే... సమాజపు డొల్లతనాన్నీ చూపించిన దేశ దిమ్మరి చార్లీ చాప్లిన్. పుడుతూనే నడకతో పాటుగా నటన నేర్చుకున్నవాడు చార్లీ చాప్లిన్ ! వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తను మాత్రం మీదకు విసిరిన చిల్లర డబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీరుస్తాయా ! ఆకలికి డొక్కలు ఎండినవాడు కనుకనే, ‘బూట్లను ఉడికించి.. తినాల్సి వచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్ రష్) అంత హృద్యంగా సృజించగలిగాడు. తాగుబోతు తండ్రి, మతి స్థిమితం తప్పిన తల్లి, అనాథాశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, చిన్న వయస్సులో రెండేళ్ల పాటూ మాత్రమే చదివిన చదువు... ఇవీ ఆయన నేపథ్యాలు. ముఖ స్తుతికి తావులేని పరిచయ వాక్యాలు. ఖరీదైనదిగానే తప్ప ! మరోలా మన ఊహకు అందని లండన్ నగరంలోని అతి పేదరికాన్ని, దుర్భర దారిద్రాన్ని చిన్న వయసులోనే అనుభవించాడు చాప్లిన్. అందుకేనేమో! “నేనెప్పుడూ వాన నీటిలో నడిచేందుకు ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా” అని అన్నాడాయన. తన దుర్భారవస్థలను సంకేతిస్తూ.. చెప్పిన ఈ మాటలు ప్రతీక వాదం మాత్రమే కాదు.. అత్యంత వాస్తవికం కూడా !
బతికేందుకు, పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడక ముందు చాప్లిన్ అనేక పనులు చేశాడు. జీవితాన్ని ముందుకు నడిపించేందుకు అవన్నీ తనకు ఉపయుక్తం అయ్యాయని భావించాడు. “జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కొనేందుకు పుట్టిందే కామెడీ” అని అన్నాడు చాప్లిన్. కానీ ఆ.. కామెడీ ఎలా ఉండాలి ? “నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు”.. అన్నవి చాప్లిన్ మాటలు. కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు - తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు. నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శ్యాల్నీ స్పృశించాడు. వ్యాఖ్యానించాడు. బ్యాగీ ప్యాంటు, టైటు కోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసి పోయిన బట్టలు ఇవీ స్టేజీపై ఆయన క్యారెక్టర్..కు సూచికలు. అంత అల్లరిలో అయినా.. హుందాతనాన్ని కాపాడుకునేందుకు చిహ్నంగా చేతికర్ర. చేసేది కామెడీయే అయినా సీరియస్నెస్ తీసుకు వచ్చేందుకు మూతి మీద చిన్నమీసం, కాళ్లకు పెద్ద బూట్లూ, పెంగ్విన్ లాంటి నడక...ఇవన్నీ ఆయన్ను ఎప్పటికీ గుర్తుకు తెచ్చే ఆనవాళ్లు. చాప్లిన్ ఎక్కడికీ వెళ్లడు. వెళ్లలేడు. రాజ్యంలో ధిక్కారం ఉంటే అతడు ఉంటాడు. ప్రశ్న ఉంటే జవాబుగా మారి నవ్వి వెళ్తాడు. తార అతడు. ధ్రువ తార అతడు.! జేజేలు మరోసారి.. ఇంకోసారి..


