ఈ దేశంలో పిల్లలున్నారా
వాళ్ల ముఖాల్లో నవ్వులున్నాయా
అసలు వాళ్ల నోట్లో నాలుకలున్నాయా.
పూతోట వనమంతా
సింగిడి రంగులన్నీ
కనుల రిండారా మెరిసినట్టు
పాలసముద్రాలు పారే పిల్లల నవ్వుల ముఖాల్ని
ఈమధ్య మీరెపుడైనా ఎక్కడైనా చూసారా.
ఊరుఊరంతా దుమ్ములేపి
ఒళ్లంతా దుబ్బపూసుకొని
ఆకాశానికి చేతులుచాచి ఆహ్వనించుకున్న వానచినుకుల్ని లేతచెక్కిళ్లమీద మోస్తు
వాళ్ళు పెట్టే హోరు కెరటాల కేరింతల్ని
మీరెపుడైనా చెవులారా విన్నారా
ఈమధ్య కాలంలో మీరెపుడైనా పిల్లల్ని చూశారా?
బహుశా చూసుండకపోవచ్చు......కదా!
నూతన వదూవరులంతా వాళ్ళ పండంటి కాపురాలకి పుట్టబోయేది
డాక్టరో ఇంజనీరో కలెక్టరో అని కళలు కంటున్నప్పుడు
మనకి పిల్లలెలా కనిపిస్తారు
పాలు మరువకముందే పిల్లల పసితనాన్ని
కార్పోరేట్ స్కూల్ కౌగిళ్లలో కట్టేస్తూ
మెదడుకి ముగుదాళ్ళు బిగిస్తున్న దేశంలో
పిల్లలు కనిపిస్తారా
వాళ్ళ నవ్వులు వినిపిస్తాయా
కాపురాలకి పుట్టబోయేది
కలెక్టరో డాక్టరో అని కళలు కంటున్నంతకాలం
మనం పిల్లల్ని చూడలేము
వాళ్ళ నవ్వుల్ని వినలేము
- సత్య కలకోటి
----------------------------------
వార్త: కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తోన్న.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. హోలీ పండుగ సందర్భంగా చంద్రకిశోర్ తన భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్ ను తీసుకొని తన ఆఫీస్‌కి వెళ్ళాడు.
తర్వాత పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానంటూ, భార్యను ఆఫీస్‌లోనే ఉండమని చెప్పి.. ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన చంద్రకిశోర్.. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి.. నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
10 నిమిషాల్లో వస్తానన్న భర్త ఎంత సేపటికీ రాకపోవడంతో పాటు.. ఫోన్ ఎత్తకపోవడంతో తనూజ, తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్ళింది. ఇంటి కిటికీలో నుంచి చూడగా.. భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా.. పిల్లలిద్దరూ చలనం లేకుండా కనిపించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, చదవలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి.. తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోటు దొరికిందని పోలీసులు తెలిపారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పెద్దవాడు ఒకటో తరగతి, చిన్నవాడు ఎల్ కేజీ చదువుతున్నాడు. మరోవైపు తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని.. బాగానే ఆస్తులు ఉన్నాయని.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతడి అన్న తెలిపాడు. చంద్రకిశోర్ ఆత్మహత్యపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశాడు.

