మత విద్వేషాన్ని ఖండిద్దాం! మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం!!
----------------------------
అయితే నేడు దేశపు పరిస్థితి మరింత దైన్యంగా, హేయంగా ఉంది. ఒకవైపు పాలకులు పెంచి పోషిస్తున్న మత దురహంకార ప్రవాహంలో నేటి యువత కొట్టుకుపోతోంది. మరోవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటం, పోరాడటం, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించటం అన్నవి దేశద్రోహ చర్యలుగా పరిగణించబడుతున్నాయి. దురాచారాలపైనా, దుర్మార్గాలపైనా సంధించవలసిన ఆగ్రహాన్ని, ద్వేషాన్ని- వారు తమ మతం వారు కాదనో, కులం వారు కాదనో విద్వేషపు వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతుండటం ఆందోళనకరం.
ఇటీవల వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం అనే సంస్థను స్థాపించి, మేము ఐదు వేల మందితో రామరాజ్య సైన్యాన్ని తయారు చేస్తున్నాము, దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కోసం ఎవరైతే ప్రాణాలు ఇవ్వటానికి లేదా తియ్యడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ రిక్రూట్ చేసుకుంటామని ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు. ఈ కోర్టులు, పోలీసులు, రాజ్యాంగ వ్యవస్థలు పనికి మాలినవని ప్రకటించాడు. అదే మాట ఇంకెవరైనా అంటే దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రవేసి, కేసులు పెట్టి, ఎన్నో ఏళ్ల పాటు జైలు పాలు చేసి ఉండేది ప్రభుత్వం. కానీ ఈ వ్యక్తికి బిజెపి అండదండలుండటంతో ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది.
తిరుపతి బుక్ ఫెయిర్‌లో ఖురాన్‌ని, భగవద్గీతని పోలుస్తూ రాసిన పుస్తకాన్ని అమ్ముతున్న బుక్ హౌస్ మీద దాడి చేశారు. హైదరాబాద్ బుక్ ఫెఖుర్‌లో జరిగిన దాడి ఇలాంటిదే. ఈ విధంగా మతం పేరుతోనో, దేవుడు పేరుతోనో దాడులు, మత విద్వేషాలకు పాల్పడటం వంటి చర్యలు, ఘటనలు కోకొల్లలు.
మతోన్మాదులు ప్రతి ఎన్నికల ముందు ‘లవ్ జీహాద్’, ‘ఘర్ వాపసీ’ వంటి మతపరమైన అంశాలను లేవనెత్తి హిందువుల ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నారు. గో రక్షణ పేరుతో దళితులపై, ముస్లింలపై అమానుషంగా దాడులు చేస్తున్నారు. హేతుబద్ధ ఆలోచనలను, బిన్నాభిప్రాయాలను సహించలేని శక్తులు గౌరీ లంకేష్, నరేంద్ర దబోల్కర్, ఎం.ఎం.కల్బుర్గీ వంటి ఎంతో మంది మేధావులని బలి తీసుకున్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న రచయితలు, ప్రజాతంత్రవాదులు, సామాజిక కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. సోషల్ మీడియా మాధ్యమాలను మత విద్వేష ప్రచారానికి వేదికగా వాడుతున్నారు. అయోధ్య రామ మందిరం వివాదం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టాలను తీసుకువస్తూ దేశాన్ని నిత్యం రావణకాష్టంలా చేశారు. నిరంతరం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు మత విద్వేష ప్రచారానికి వేదికలుగా మార్చి, దాడులను లైవ్ స్ట్రీమ్ చేసి, వాటిని షేర్ చేస్తున్నారు.
ఒక సమాచారం ప్రకారం 2014 నుండి 2024 వరకు 2,500కి పైగా మత ఘర్షణలు నమోదయ్యాయి. గో రక్షణ పేరుతో 2015 నుండి 2024 వరకు 70కి పైగా మాబ్ లించింగ్ (మూక దాడులు) ఘటనలు జరిగితే, వీటిలో దాదాపు 90% మంది బాధితులు ముస్లింలు, దళితులే! ఇదంతా పాలకులు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, పెరుగుతున్న విద్యారంగ సంక్షోభం, నిరుద్యోగం, యువత ఆత్మహత్యల నుంచి విద్యార్థులు, యువకుల దృష్టిని మళ్ళించటానికి మతోన్మాదాన్ని పావుగా వాడుకుంటున్నారు.
ఏ మతానికి చెందిన ఉన్మాది అయినా పరమతాన్ని ద్వేషిస్తారు, కానీ అటువంటి వారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది. ఆ కొద్దిమందే జనాన్ని ఎగదోసి హింసను ప్రేరేపిస్తారు. అధిక సంఖ్యాక ప్రజలు ఈ హింసలో సమిధులుగా మారుతారు. ఈ సత్యాన్ని యువత గ్రహించాలి.
‘‘వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులం వారైనా, ఏ జాతీయతకి చెందిన వారైనా, ఏ దేశం వారైనా ప్రపంచంలోని పేద ప్రజల హక్కులన్నీ ఒక్కటే. మతం, రంగు, కులం, జాతీయత, దేశం అనే తేడాలను చెరిపెయ్యాలి. భారతీయుణ్ణి వీడు హిందువు, వాడు ముస్లిం, ఇంకొకడు సిక్కు అని కాకుండా అందరినీ ముందుగా మానవులని, ఆ తర్వాత భారతీయులని గుర్తించాలి. ఈ మార్పు యువతలో వస్తే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది’’ అన్న భగత్ సింగ్ స్ఫూర్తిని విద్యార్థులు, యువకులు అందిపుచ్చుకోవాలి. ఆ స్ఫూర్తితో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న పాలకుల విధానాలకు, సామ్రాజ్యావాద దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడాలని పిడిఎస్‌ఓ - ఎన్ వైయస్ పిలుపునిస్తోంది.
ఇంక్విలాబ్ జిందాబాద్!
మతోన్మాదం, సామ్రాజ్యవాదం నశించాలి!!
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO,
నవయువసమాఖ్య(NYS),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎస్‌కె.బాషా,ఎ.సురేష్ - 9701924714
తేదీ : 01-03-2025,
విజయవాడ


