పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేపడుతున్న మారణకాండను ఆపాలి! తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి!!
~~
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO), నవయువసమాఖ్య(NYS) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో “పాలస్తీనా సంఘీభావ సభ” గుంటూరులోని వైన్ డీలర్స్ కళ్యాణమండపం నందు జరిగింది. పిడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఆష ఆహ్వానం పలకగా, పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ అధ్యక్షత వహించారు.
ప్రధాన వక్తగా విచ్చేసిన కె.ఎల్.యూనివర్సిటీ ప్రొఫెసర్ బుడ్డిగ జమీందార్ మాట్లాడుతూ పాలస్తీనా, ఇజ్రాయిల్ వివాదం గత సంవత్సరం అక్టోబర్ 7న మొదలైంది కాదనీ, వందేళ్లకు పైగా సాగుతున్న సుదీర్ఘ వివాదమని, 1948 నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడులు చేస్తూనే ఉందన్నారు. 1947- 48 యుద్దంలో 70 వేల మందికి పైగా పాలసీనియన్లు మరణించారనీ, ఇప్పుడు 2023 నుంచి 24 వరకు 45 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. పశ్చిమ ఆసియాలో ఉన్న 48 శాతం ముడి చమురు పై ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్‌ను అమెరికా సృష్టించి, దానికి లక్షల కోట్లు కేటాయిస్తోందనీ, అమెరికా అండతో ఇజ్రాయిల్ మారణకాండను సృష్టిస్తుందని, దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలనీ, విద్యార్థులు, యువకులు పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలన్నారు.
'ఉపాధ్యాయ' పత్రిక ప్రధాన సంపాదకులు షేక్.జిలానీ మాట్లాడుతూ నేటి యువత చరిత్రలో జరిగిన యుద్దాలన్నింటినీ అధ్యయనం చేయాలి, పరిశీలించాలి. ఈ యుద్ధాలన్నీ సామ్రాజ్యవాద దేశాలు తమ రాజకీయ పెత్తనం కోసం, ఆక్రమణ, ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య రెచ్చగొట్టిన యుద్ధాలు తప్ప మరొకటి కావు. ప్రపంచం పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఆయుధాలను ప్రపంచ దేశాలకు నిరంతరం సప్లై చేస్తూ ప్రపంచంలో ఎప్పుడూ యుద్ధం ఉండేలా చేస్తుందని, ప్రపంచంలోని అనేక దేశాలలో జరుగుతున్న దురాక్రమణలకు, యుద్ధాలకు అమెరికా సామ్రాజ్యవాదమే కారణమనీ, దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు డా౹౹సి.విజయ మాట్లాడుతూ ఇజ్రాయిల్ దాడిలో చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువగా చనిపోయారు. ఇప్పటివరకు ఈ దాడిలో 45 వేల మంది పౌరులు చనిపోగా ఆకలి, వ్యాధులతో రెండు లక్షల మంది చనిపోయారు. వారిలో 70 శాతం మంది పిల్లలు, మహిళలే. మొత్తం జాతిని హననం చేయటమే లక్ష్యంగా చిన్నపిల్లల్ని, మహిళల్ని టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు. అత్యంత దుర్మార్గంగా చిన్న పిల్లల్ని చంపుతుంటే మన దేశ పాలకులు మాత్రం ఇజ్రాయిల్ కు ఆయుధాలను పంపటం దారుణం. తమ కళ్ళముందే పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకున్నారు. ఎంతోమంది అనాధలయ్యారు. వారు శారీరకం కన్నా మానసికంగా ఎంతో గాయాల పాలయ్యారు. ఎన్నో కోల్పోయినప్పటికీ వారు లొంగలేదు. తమ నేల మీద తాము జీవించే హక్కు కోసం పోరాడుతూనే ఉన్నారు. వారికి సంఘీభావంగా నిలబడాల్సిన బాధ్యత ఉందన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ నరమేధాన్ని ఖండిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు తమ నిరసనను పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారనీ, కానీ మన దేశ పాలకులు మాత్రం ఇజ్రాయిల్‌కు మద్దతునిస్తున్నారన్నారు. ఒక సార్వభౌమాధికార దేశంపై ఇజ్రాయిల్ దాడి చేస్తే దీనిని ఖండించాల్సిన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి భిన్నంగా నెతన్యాహుకు మద్దతుగా మాట్లాడడం దారుణమన్నారు. అంతేకాక పాలస్తీనాలోని వేలాదిమంది పసిపిల్లల ప్రాణాలు తీయుటకు భారతదేశ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఇజ్రాయిల్‌కు ఆయుధాలను, ఆయుధాలకు అవసరమైన హార్డ్‌వేర్‌ను సప్లై చేస్తున్నాయనీ, మన పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలను వ్యతిరేకించాలన్నారు.
నవ యువ సమాఖ్య (NYS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.భాషా మాట్లాడుతూ ఆహారం, మంచినీళ్లు, వైద్యం కూడా అందనీయకుండా పాలస్తీనా ప్రజలను చుట్టుముట్టి ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపై అత్యంత దుర్మార్గంగా దాడులు చేస్తోందని, మరో వైపు బాధిత దేశంగా తాము చేస్తున్న మారణ హోమాన్ని ఆత్మ రక్షణ కోసం సాగిస్తున్న పవిత్ర యుద్ధంగా ఇజ్రాయిల్ చిత్రీకరిస్తోందనీ, దీన్ని అమెరికా అనుకూల మీడియా ద్వారా ప్రపంచాన్ని నమ్మించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందనీ, నిజానికి తమ నేల కోసం, మనుగడ కోసం, స్వేచ్ఛా జీవనపు హక్కు కోసం శత్రువుకి లొంగకుండా నేటికీ పాలస్తీనా ప్రజలు పోరాడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జన సాహితి రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్,పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను, ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.హనుమంతరెడ్డి, ఏపిటిఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బసవలింగేశ్వరరావు మరియు పిడిఎస్ఓ,ఎన్‌వైయస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ సభలో భగత్ సింగ్‌పై దివికుమార్(జనసాహితి) రాసిన “ఉరికంబం సాక్షిగా” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభానంతరం అరండల్ పేట నుండి శంకర్ విలాస్ సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావంగా 250 మంది విద్యార్థులు, యువకులు మేధావులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
విప్లవాభినందనలతో……
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
నవయువసమాఖ్య (NYS),
ఆంధ్రప్రదేశ్





























