మధురవాడ వద్ద ఉన్న చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కాలి నడక వంతెన నిర్మాణం ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ పిడిఎస్ఓ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి మాట్లాడుతూ “మధురవాడ వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెంలో సుమారు నాలుగువేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో అధిక శాతం విద్యార్థులు పాఠశాలకు రావడానికి పాఠశాల నుండి వెళ్లడానికి జాతీయ రహదారిని దాటవలసి వస్తోంది. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలలో అనేకమంది విద్యార్థులు గాయపడుతున్నారు. రెండేళ్ల క్రితం 8వ తరగతి బాలుడు కూడా రోడ్డు దాటుతూ ఆటో ఢీకొనడం వలన కాలిని కోల్పోవలసి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను నివారించుట కొరకు గత జనవరిలో రెండు కోట్ల అంచనా తో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులను ప్రారంభించి సుమారు పది నెలలు కావస్తున్నా, నేటికీ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. ఈ పనులు పునాదుల వద్దనే నిలిచిపోయాయి. నిలిచిపోయిన ఈ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వంతెనను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ)గా విజ్ఞప్తి చేయగా, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గారు 'ఆరు నెలల్లో వంతెనను పూర్తి చేస్తామ’ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు సాయికుమార్, లైకాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

