ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో విశాఖ లోని లా కళాశాల న్యాయ శాస్త్ర విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం కాంప్లెక్స్ మీదుగా నిరసన ప్రదర్శన చేస్తూ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద మానవహారం నిర్వహించి, రామ టాకీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్. భాను మాట్లాడుతూ “మధురవాడ లో ఉన్న ఎన్విపి లా కాలేజీ విద్యార్థినిని ఆమె స్నేహితుడు ప్రేమ పేరుతో మోసం చేసి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అతి హేయమైనది. ఈ ఘటనలో భాగస్వామ్యం ఉన్న వారినందరిని కఠినంగా శిక్షించాలి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అత్యాచార ఘటనల పరంపర కొనసాగుతోంది. నెలల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి నిందితులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారైతే కఠినంగా శిక్షిస్తామని, కఠినమైన చట్టాలు తీసుకొస్తామని పాలకులు అంటున్నారు. కానీ ఈ అత్యాచారాలకు, లైంగిక దాడులకు మూల కారణమైన మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సినిమాలు, వీడియోలను నిషేధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు సరికదా, దగ్గరుండి మరీ పెంచి పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) గా లా కళాశాల విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తున్నామని” తెలిపారు.
పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మీ మాట్లాడుతూ “నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం ఒక రోజుకి ఈ దేశంలో 86 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రమే. ఇంకా బయటకు రాని ఘటనలు అనేకం. ఇటువంటి ఘటనలన్నింటిలో కూడా మనం పరిశీలిస్తే నిందితులంతా ఈ దారుణానికి ఒడిగట్టే ముందు అశ్లీల సినిమాలు, వీడియోలు చూసి ఉండటం లేకపోతే మద్యం, మత్తుపదార్థాలు సేవించి ఉండడము జరుగుతుంది. ఈ హత్యలు అత్యాచారాలకు మూల కారణాలైన ఈ మద్యం మత్తుపదార్థాలు, అశ్లీల సినిమాలను నిషేధించనంత కాలం ఈ అత్యాచారాలు నిర్మూలించబడవు. ప్రభుత్వాలు చేయవలసింది కఠినమైన చట్టాలను తీసుకురావటం మాత్రమే కాదు. వీటికి మూల కారణాలైన వీటన్నింటినీ ముందుగా నిషేధించాలని, పిడిఎస్ఓగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా అధ్యక్షుడు పి.విశ్వనాధ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్.రుద్రి, జిల్లా కమిటీ సభ్యులు జానకి, లోకేష్, లైకాన్, తేజ మరియు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.








