మిత్రులారా!
వేసవి సెలవులు అయిపోయాయి. మళ్లీ విద్యార్థులు, ఉపాధ్యాయులు యమకూపాల్లో అడుగుపెట్టే రోజులొచ్చాయి! ఇక్కడ బడుల్లో అడుగుపెట్టడమంటే యమకూపాల్లో అడుగుపెట్టటమే మరి! ఇక్కడి విద్య పేద, బడుగు వర్గాలు కొనలేని అతి ఖరీదైన వ్యాపార సరుకు, అందుకే ఇక్కడ విద్యార్థులు డ్రాపౌట్లుగా, బాల కార్మికులుగా మారటం సర్వసాధారణం. ఇక్కడి విద్యాలయాలు ప్రైవేటు, కార్పొరేటు అడ్డాలు. వీటి ఏకైక లక్ష్యం ర్యాంకుల్ని, మార్కుల్ని ఆశ చూపి లాభాలను పిండుకోవటమే! అందుకే ఇక్కడ విద్యార్థులు ఉరితాళ్ళు బిగించుకోవడమొక నిత్యకృత్యం. అందుకే ఇక్కడ నూతన ఆవిష్కరణలకు చోటు ఉండదు. ఇక్కడి పాలకులు ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు సేవ చేసే బంట్లు. అందుకే వీరిచ్చిన హామీలన్నీ ఎన్నేళ్లయినా తిరిగి మళ్లీ మళ్లీ వెక్కిరిస్తూనే వుంటాయి, ప్రభుత్వ బడులన్నీ విలవిలలాడుతూనే ఉంటాయి. ఇది నేటి విద్యారంగం దుస్ధితి.
సామాజిక సంపదగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన విద్యని ఈ 75 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం అందించకపోగా ఒక ఖరీదైన సరుకుగా మార్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఏమీ ఇందుకు మినహాయింపు కాదు. మొత్తం విద్యారంగాన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాదాల కింద పెట్టే వైపుగా క్లస్టర్, స్మార్ట్, గ్రీనరీ, ఆదర్శ పాఠశాలల పేరుతో పిపిపి మోడల్ క్రింద పాఠశాల విద్యను ప్రైవేటీకరించ పూనుకుంది. పాఠశాల విద్యలో డిజిటల్ విద్యను, ఉన్నత విద్యలో సెమిస్టర్ విధానాన్ని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తీసుకొచ్చింది. విశ్వవిద్యాలయాలను ప్రైవేటీకరించేందుకు ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును కూడా ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఎన్ఐపి విధానాల నమూనాను టిడిపి ప్రభుత్వం అనాడే (2014-2019) అమలుచేయ మొదలుపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం పై విధానాలను మరింత దూకుడుగా అమలుచేసి విద్యారంగ పరిస్థితిని మరింత దిగజార్చింది.
నాడు టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 6000 ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తే, వైసిపి హయాంలో విలీనం పేరుతో 18 వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. పిల్లల్లో జ్ఞాన సముపార్జన జరగాలంటే మాతృభాషలో చదువులు సాగటం అత్యవసరమైనప్పటికీ, దానికి భిన్నంగా ఒకటవ తరగతి నుండి ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేశారు (తెలుగును చంపి. ఇంగ్లీష్ మాధ్యమానికి పునాదులు వేసింది టిడిపి ప్రభుత్వమే). అంతేకాక ఈ పేరుతో 18,000 టీచర్ పోస్టులు రద్దు చేశారు. కరోనా పీరియడ్లో ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థుల శక్తి, సామర్ధ్యాలు పడిపోయాయని ఒకవైపు నివేదికలు చెబుతుండగా, మరోవైపు డిజిటల్ విద్య పేరుతో ట్యాబుల పంపిణీ కోసమని బైజూస్ కంపెనీతో రూ॥ 1,606 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో ప్రత్యక్ష బోధన కరువై, ఆన్లైన్ పాఠాలు అర్ధం కాక, పరికరాలు పనిచేయక, ఇంటర్నెట్ మొదలైన సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వీటిలో కనీసం సగం పోస్టులు కూడా భర్తీ చేయకుండా, కొత్త పాఠశాలల ఏర్పాటు చేయకుండా నాడు-నేడు పేరుతో బిల్డింగులకు రంగులు పూసే కార్యక్రమాన్ని చేపట్టింది గత వైసిపి ప్రభుత్వం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు నేడు ఆంధ్రప్రదేశ్లో రంగురంగుల బిల్డింగులు ఉన్నచోట విద్యార్థులు కరువయ్యారు. విద్యార్థులు ఉన్నచోట పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కరువయ్యారు.
అదే విధంగా విలీనం పేరుతో అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కళాశాలలను మూసివేశారు లేదా ప్రైవేటు పరం చేశారు. ఉన్న కళాశాలలు కాస్త తీవ్ర అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరాను నిలిపేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేశారు. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో కనీస మౌలిక వసతులు, ల్యాబ్లు, పరికరాలు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు లేక... స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు రాక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇందులో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా విదేశీ కోర్సుల పేరుతో ఎడెక్స్ కంపెనీతో టెండర్లు కూడా లేకుండా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ దేశంలో ఉద్యోగం చేయడానికి పనికిరాని విదేశీ కోర్సుల్ని ఉన్నత విద్య చదివే విద్యార్థుల మీద బలవంతంగా రుద్దారు. ఆదిలోన నీ పాదు నరికితే జాబిమ్మని నువ్వు అడగలేవుగా! అన్న చందంగా విద్యార్థులని తీవ్ర గందరగోళపరిచే సెమిస్టర్, ఇంటర్న్షిప్, నాలుగు సంవత్సరాల డిగ్రీ, మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్ మరియు మేజర్, మైనర్ సబ్జెక్టు వంటి ఎన్ఐపి-2020 లోని విధానాలను డిగ్రీలో ప్రవేశపెట్టటం ద్వారా, పేద విద్యార్థుల్ని ఉన్నత విద్యకు దూరం చేసి డ్రాపౌట్లగా మారుస్తున్నారు. ఆపై కార్పొరేటు కంపెనీలకు కారుచౌక కూలీలుగా తరలిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ, వ్యాపార సంబంధిత పాఠాలను జోడించి డార్విన్ సిద్ధాంతం, ఆవర్తన పట్టిక లాంటి శాస్త్రీయ అంశాలను, ప్రజాస్వామ్యం లాంటి రాజకీయ అంశాలను ఎన్సీఈఆర్టి పాఠ్యాంశాల నుంచి తొలగించింది. విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యం, భూత వైద్య కోర్సులను ప్రవేశపెడుతున్నారు. సీబీఎస్ ఈ సిలబస్ ను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలంటూ, అలాగే ఒకే దేశం-ఒకే పరీక్ష పేరుతో ప్రవేశ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ విద్యని మొత్తంగా తన చెప్పు చేతుల్లోకి తీసుకొని విద్యా కేంద్రీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణలకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అంతేకాక ఎస్ఈపి-2020 పేరుతో విద్యా ప్రైవేటీకరణను వేగవంతం చేయడమే కాక, విదేశీ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి విద్యా రంగంలోకి విదేశీ శక్తులను ఆహ్వానిస్తోంది.
దేశ ప్రగతికి విద్యారంగం ఆయువు పట్టు వంటిది. కానీ నేడు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం బాధ్యత నుండి పూర్తిగా తప్పుకుంటున్నాయి. క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ, బహుళజాతి, సామ్రాజ్యవాద కంపెనీల వ్యాపారాలకు అనుగుణంగా ఈ దేశ విద్యా విధానాన్ని మారుస్తున్నారన్నది పై పరిస్థితులన్నీ స్పష్టం చేస్తున్నాయి. కావున పాలకులు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక, కార్పొరేటు అనుకూల విధానాలను విద్యార్థులు వ్యతిరేకించాలి. అందరికీ విద్యా, వైద్యం, ఉపాధి హక్కుకై, శాస్త్రీయ, స్వతంత్ర, ప్రజాతంత్ర విద్యావిధానం సాధనకై పోరాడే కర్తవ్య నిర్వహణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరుకుంటూ... నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు PDSO అరుణారుణ స్వాగతం పలుకుతోంది.
విజయవాడ
12-07-2024
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎన్. భాస్కర్, ఎ.సురేష్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.
సెల్: 9701924714


