సంగీతం అందరిదీ, కొందరిది కాదు అని చాటిచెపుతున్న టి.ఎమ్.కృష్ణకు సంఘీభావంగా నిలుద్దాం.

0
    మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కర్నాటక సంగీత విద్యాంసుడు టి.ఎమ్.కృష్ణకు ‘సంగీత కళానిధి’ అనే అవార్డు యిటీవల ప్రకటించారు. కర్నాటక సంగీతంలో అపసవ్య పోకడలకు పాల్పడే కృష్ణకు ఆ అవార్డు ఇవ్వడం ఏమిటంటూ సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. మ్యూజిక్ అకాడమీ నిర్ణయాన్ని నిరసిస్తూ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో విదుషీ సిస్టర్స్ గా పేరొందిన రంజని, గాయత్రి తాము అకాడమీ సభని బహిష్కరిస్తున్నామని, ఆ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వబోవడం లేదని ప్రకటించారు. ప్రముఖ హరికథా కళాకారుడు దుష్యంత్ శ్రీధర్ వంటి వారు చేరారు. వైణిక విద్వాంసుడు చిత్రవీణ రవికిరణ్ తనకి 2017లో వచ్చిన అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. గ్రామీ అవార్డు గ్రహీత ఒకాయన కూడా ఈ నిరసనల జాబితాలో చేరాడు. వీళ్లెవరూ కృష్ణలో సంగీత ప్రతిభ లేదని అనడం లేదు. వచ్చిన సమస్యల్లా తను సామాజిక ఆలోచనలు, ద్రావిడ విలువలు, లౌకిక భావనలు కలిగి ఉండటమే బ్రాహ్మణ సంగీతకారులకు ఆగ్రహం కల్గిస్తుంది.
    48 ఏళ్ల తోడూర్ మాడభూషి కృష్ణ తెలుగు మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టాడు. తన 12వ ఏట నుండే కర్ణాటక సంగీతంలో ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని తీవ్రంగా ద్వేషించి, నిరసించి, దాని మీద పోరాడిన పెరియార్ భావజాల సమర్ధకుడు. పెరియార్ చేసిన సాంఘిక కృషి మీద ఓ పాట కూడా రాశాడు.తను సంగీత విద్వాంసుడే కాదు, ఓ రచయిత, ఓ యాక్టివిస్టు… హిందూ ధర్మం మీద, అయోధ్య మీద, రాముడి మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద కూడా కర్నాటక సంగీత ప్రపంచం నుండి ఎన్నో విమర్శలు వచ్చాయి. డిసెంబర్ లో జరిగే చెన్నై మ్యూజిక్ సీజన్ ను బహిష్కరించి ప్రతీ సంవత్సరం దేశవిదేశాల నుండి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనే సంగీతకారుల ఆగ్రహానికి గురయ్యాడు. చెన్నై మ్యూజిక్ సీజన్ కు ధీటుగా బసంత్ నగర్ (మత్స్యకారుల గ్రామం)లో ' ఉరూర్ ఉలోత్ కుప్పం - మార్గళ్ విళ మ్యూజిక్ ఫెస్ట్' నిర్వహించాడు.
    సంగీతం ప్రజలందరిదీగా ఉండాలి, కానీ కర్నాటక సంగీత వాతావరణంలో బ్రాహ్మణ ఆధిపత్యవాదం ఎక్కువ, అందుకే అన్ని వర్గాల ప్రజలనీ కలుపుకుపోవడం లేదని అంటాడు టి.ఎమ్.కృష్ణ. అలాగే కర్నాటక సంగీత పితామహుడుగా చెప్పుకునే త్యాగరాజు కృతులలో కుల, జెండర్ ఆధిపత్య ధోరణులున్నాయంటాడు తను.
    సంగీతానికి తప్ప దాని చుట్టూ అల్లుకున్న మెరుగులను తిరస్కరిస్తూ, సంగీతం అందరిదీ, కొందరిది కాదు అని చాటిచెపుతున్న టి.ఎమ్.కృష్ణకు సంఘీభావంగా నిలుద్దాం.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)