"సామాజిక సంక్షోభపు సుడిగుండంలో విద్యారంగం"
- యస్. గురునాధ శర్మ
ఏ దేశానికైనా మానవాభివృద్ధి సూచికకు ఆ దేశ విద్యా,వైద్యరంగాల అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ రెండు రంగాలను సంక్షేమ రంగాలుగా పేర్కొంటారు. ఈ రంగాలపై పెట్టే పెట్టుబడి లాభాపేక్ష లేకుండా ఉండాలి. 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మానవుడి సర్వతో ముఖాభివృద్ధికి ఉపయోగపడాల్సిన విద్యారంగం సంక్షోభ సుడిగుండంలో చిక్కుకుందని PDSO వివరించేందుకు ప్రయత్నించిందని చెప్పుకోవాలి.
ఆర్థిక అసమానతలు, భిన్న సామాజిక జీవన విధానాలు కలిగిన భారతదేశంలో విద్య అందరికీ అందేందుకు అనేక విద్యా కమిషన్లను ప్రభుత్వాలు నియమించాయి. 1964-66 మధ్య నియమించిన డాక్టర్ డి.ఎస్ కొఠారి విద్యా కమిషన్ ముఖ్యంగా కామన్ స్కూల్ విధానం ఉండాలని సిఫార్సు చేసింది. ఇది గడిచి 57 సంవత్సరాలు అయినా ఆ సిఫార్సులు బుట్ట దాఖలా చేయబడ్డాయి. పాలకులు వారి ప్రయోజనాలు కాపాడుకునే విధంగా, అదే సందర్భంలో కార్పొరేట్ శక్తులకు విద్యను ధారాదత్తం చేసే పరిస్థితులను ఒక క్రమ పద్ధతిలో రూపొందిస్తున్నారు. ఈ పరిస్థితులను నేటి విద్యార్థి లోకం గుర్తెరిగేందుకు విద్యావేత్తలు, మేధావులు వ్రాసిన వ్యాసాలను ఒక సంకలనంగా తీసుకురావడానికి PDSO పూనుకోవటం అభినందనీయం.
వ్యాసాలను పరిశీలిస్తే కోవిడ్ సందర్భంగా తెరపైకి తెచ్చిన ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులోకి రాలేదు. బాల బాలికలు ఖర్చుతో కూడిన ఈ విద్య పొందడం కష్టం. గురుముఖతః పొందే విద్య కనీసం 10వ తరగతి వరకైనా ఎందుకు ఉండాలో దాని సాధకబాధకాలు “అందరికీ అందని ఆన్లైన్ విద్య” అనే వ్యాసంలో గమనించవచ్చు. విద్యారంగానికి కనీసం 6 శాతం నిధులు కేటాయింపు ఉండాలని వివిధ విద్యా కమిషన్ల సూచనలను పాటించకుండా నిధులు ఎలా కేటాయిస్తున్నారో పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో “విద్యా బడ్జెట్ 2022–23” వ్యాసంలో చూడొచ్చు. అన్నిటినీ మించి ఉన్నవాళ్లకు ఒక విద్య లేని వారికి మరో రకం విద్య అనే భావనను స్థిరీకరిస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ‘నూతన విద్యా విధానం’ పై ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారి వ్యాసంలో, అదేవిధంగా ఈ నూతన విద్యా విధానం అసలు ఎజెండా ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ గారి వ్యాసం లోను చూడవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాల పేరిట స్థాపించబోతున్న విద్యాలయాలు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల బిడ్డలకు ఎలా అందని ద్రాక్ష పండులాగా ఉన్నత విద్య దూరం కాబోతుందో, విదేశీ విద్యకు రుణాలు ఇస్తూ స్వదేశీ యూనివర్సిటీలను ఎలా నిర్వీర్యం చేయబోతున్నారో, ఈ విధంగా విద్యను మార్కెట్లో అంగడి సరుకుగా ఎలా మారుస్తున్నారో కూడా కొన్ని వ్యాసాల్లో చూడవచ్చు. ఈదేశం వ్యవసాయక దేశం. మన విద్యావిధానంలో వ్యవసాయరంగం ప్రాధాన్యత ఆశించిన స్థాయిలో లేదు.తగినన్ని నిధులు కేటాయించకుండా ఉన్న విశ్వ విద్యాలయాలను ఏ విధంగా కునారిల్లేటట్లు చేస్తున్నారో "వ్యవసాయ విద్యను తక్షణం పునరుద్ధరించాలి" అనే వ్యాసం ఆలోచింప చేస్తోంది. శాస్త్రీయ విద్యావిధానం ఆవశ్యకతను, ఎందుకు ప్రవేశపెట్టాలో దేశంలోని విద్యారంగ ప్రముఖులు, విద్యార్థి సంఘాల, మేధావుల సూచనలు పాటించకుండా అజ్ఞానంలో ముంచెత్తే విద్యావిధానాలు పాలకులు రూపొందిస్తున్న వైనం కొన్ని వ్యాసాల్లో చర్చించబడ్డాయి. ఈ దేశంలో వందలాది సంవత్సరాలుగా ఆదివాసీలు, మైనారిటీలు వారి సంస్కృతి, సాంప్రదాయాలు ఆయా ప్రజలు పాటిస్తూ వారి ఉనికిని కాపాడుకుంటున్నారు. వాటిని ధ్వంసం చేస్తూ, విష సంస్కృతిని ఎలా ప్రవేశపెడుతున్నారో చర్చించిన వ్యాసాలు, మతం వ్యక్తిగతంగా ఉండాల్సిన దాన్ని ఎలా బలవంతంగా రుద్దుతున్నారో, కుల అహంకారం ఎలా విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయో సోదాహరణంగా వివరించిన వ్యాసాలు ఈ సంకలనంలో ఉన్నాయి.
సరళీకరణ ఆర్థిక విధానాలు - ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న దుష్ఫలితాలు నివారణకు చర్యలు తీసుకోకపోగా, మరింతగా దిగజారే విధంగా విద్యావిధానాలు రూపొందించిన క్రమం, దళిత, ఆదివాసి, మైనార్టీ విద్యార్థులు ఎలా వైద్య విద్యకు దూరం చేయబడుతున్న పరిస్థితులు, విద్యార్థుల ఆత్మ నూన్యతా భావనలకు గురి అవుతున్న విధానం, రూపుమాపాల్సిన పాలకుల ఉదాసీన వైఖరులు, ఆత్మహత్యలను ఎలా ప్రేరేపిస్తున్నారో చర్చించే వ్యాసాలు ఈ పుస్తకంలో చూడవచ్చు. “ఒకే దేశం - ఒకే సిలబస్” అనే పేరుతో వచ్చిన ప్రమాదకర ధోరణిని వివరించే వ్యాసం, ప్రమాణాలు ఎలా దిగజారుతున్నాయో, మార్కులు, ర్యాంకులే ప్రథమ ప్రాధాన్యం వహించబడుతున్న ధోరణి వాటి వివరాలు ఈ పుస్తకంలో చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటీషర్స్ కాలం నుండి ఎయిడెడ్ విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. విలువైన స్థలాలు కాజేసే దుర్బుద్ధితో పోస్టులు భర్తీ చేయకుండా ఆ సంస్థలను కునారిల్ల చేసిన విధానం ఒక వ్యాసంలో ఉంది.
ఓట్ల కోసం తప్ప విద్యాభివృద్ధికి తోడ్పడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యావిధానాలు, ప్రపంచ బ్యాంకుల నిబంధనలకు తలొగ్గి నిధులు పొందేందుకు చేపట్టిన సంస్కరణలు ఎలా దుష్ఫలితాలు అందిస్తాయో “117 జీవో" ద్వారా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ముఖ్యంగా ప్రాథమిక విద్య ఎలా విషాదకరంగా ముగించారో మరొక వ్యాసంలో చర్చించబడ్డాయి. మనకు ఎటువంటి విద్యావిధానం కావాలో, చదువు సార్ధకత సామాజిక బాధ్యత అనే ఉన్నత ఆశయం పాలకుల విధానాల వలన ఎలా తిరోగమించాయో వివరించిన 38 వ్యాసాల సంకలనం విద్యాభివృద్ధిని కాంక్షించే నిజమైన దేశభక్తి కలిగిన విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, మేధావులు ఈ విద్యారంగ సుడిగుండపు సంక్షోభం నుండి ఎలా బయటపడవేయాలని ఆవేదన, తపన కలిగిన వారందరూ చదవాల్సిన పుస్తకం ఇది. ఆ మేరకు చిరు ప్రయత్నం చేసిన PDSO కు అభినందనలు.

