దేశ రాజధాని ఢిల్లీ మహానగరపు ఈశాన్య దిక్కున గల ఖురేజి ఖాస్ అనే ప్రాంతంలో గడిచిన ఫిబ్రవరి నెలాఖరున జరిగిన పోలీసుల దాడుల గురించి ఢిల్లీ న్యాయవాదుల బృందం ఇచ్చిన నివేదిక ఇది. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే - న్యూఢిల్లీ రాష్ట్రంలోని పోలీసులపై, ఆ రాష్ట్ర ప్రభుత్వపు అజమాయిషీ వుండదు.
కేంద్రప్రభుత్వ అధీనంలో, ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణ ఆదేశాలతో అక్కడి పోలీసు శాఖ నడుస్తూ వుంటుంది. ఢిల్లీ ఓటర్లు భాజపాను ఓడించారన్న కక్ష సాధింపులాగా ఈ దాడులను కొందరు చూస్తున్నారు. కానీ వాస్తవికంగా ఇంకా లోతయిన కారణాలు వున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపు పర్యటనకు వచ్చి భారతదేశం విడిచి వెళ్ళక ముందే ఈ ఘటనలు జరిగాయి. ప్రజలు స్పష్టంగా చెప్పిన ప్రకారం వారికి సాటి హిందువులతో ఎలాంటి సమస్యలూ లేకపోగా వారు చక్కని మత సఖ్యతతో వున్నారు. తమకు భయమంతా పోలీసులతోనే అని చెప్పటం ఈ నివేదికలో చూస్తాము. విక్రం ప్రతాప్ అనే యువకుని (బహుశా హిందువయి వుంటాడు) తండ్రితో “నీ కొడుకు జీవకణాలు (డి.ఎన్.ఏ.) చెడ్డవిగా వున్నాయి.అతని మతాన్ని మార్చి పాకిస్తాన్ పంపమనటం" పోలీసు అధికారుల్లో కరడు గట్టిన 'నాజీ' తత్వాన్ని చూపుతుంది. పోలీసులకు చట్టంపట్ల ఇసుమంత గౌరవమున్నట్లు కనపడక పోవటం, వారిలో పేరుకుపోయిన బ్రిటీషుకాలపు నాటి ప్రజావ్యతిరేక స్వభావాన్ని తెలియపరుస్తుంది. అయితే ఎంత భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నించినా సాధారణ మహిళలలో కూడా చివరికంటా పోరాడాలనే పట్టుదల కనిపిస్తోంది. ఎన్.ఆర్.సి.కి, సి.ఏ.ఏ.కి వ్యతిరేకంగా ముస్లిములతో పాటు హిందువులు కూడా గొంతు కలపటాన్ని మతోన్మాదులు సహించలేకుండా వున్నారు. పైగా ఎంత రెచ్చగొట్టినా వారు ఉద్రేకపడకుండా నిబ్బరంగా ఉద్యమించటం మతోన్మాదులలో అసహనాన్ని పెంచుతోంది. ఇదొక నూతన తరపు అపూర్వ సంఘటిత ఉద్యమం. మరింత విస్తృతిని పొందవలసిన ఉద్యమం. దీనిని అణచివేయటానికి భాజపా ప్రభుత్వం,పోలీసులు, సంఘపరివార్ శక్తులు సమన్వయంతో ఈ దాడులు చేశాయి.
వార్తాపత్రికలు మతకలహాల వ్యాప్తికి దోహదపడుతున్నట్లు నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. 92 సంవత్సరాల క్రితం 20 ఏళ్ళ భగత్ సింగ్ రాసిన "మత కలహాలు - నివారణోపాయాలు" అనే వ్యాసంలో కూడా ఇలాంటి అభిప్రాయాలనే చూస్తాం. ఇది మన దేశంలో ఇంకా కొనసాగుతున్న వలసకాలపు నాటి పరిస్థితులను తెలియచేస్తున్నది.
1905లో బ్రిటీషు సామ్రాజ్యవాదులు మత ప్రాతిపదికన బెంగాల్ విభజన చేయాలని ప్రయత్నించినపుడు దేశ వ్యాపితంగా హిందూ - ముస్లిములు 'వందేమాతరం' ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మరో రూపంలో మారిన కొత్త పరిస్థితులలో వ్యక్తమవుతోందా అన్నట్లు వుంది. మత విభజన రాజకీయాలు ఆనాడు బ్రిటీషు సామ్రాజ్యవాదులకు తోడ్పడితే నేడు అమెరికా సామ్రాజ్యవాదుల ఉపఖండపు ఆధిపత్య వ్యూహానికి అనుగుణంగా వున్నాయి. అంతే కాదు, భారత ఆర్థిక, సామాజిక వ్యవస్థ అత్యంత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే, ఆ సంక్షోభపు దుష్ఫలితాలపై ప్రజలను పోరాడనీయకుండా, ఐక్యం కానివ్వకుండా పక్కదారులు పట్టించటానికి పన్నిన కుట్రపూరిత పథకంలో భాగమిది. లౌకిక, ప్రజాస్వామిక వాదులు ఈ కుట్రలను ప్రజలకు అర్థమయ్యేట్లు చేయాలి.
నిజ నిర్థారణ కమిటీ బృందపు డిమాండ్లతో పాటు మత ప్రాతిపదికన ప్రజలను విభజించటానికై తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ.), జాతీయ ప్రజా పట్టిక (ఎన్.పి.ఆర్.), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.)లకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాన్ని బలపరుస్తూనే, వాటి వెనుకగల సామాజిక మూలాలపై, ప్రత్యేకించి సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా దీనిని ఎక్కుపెట్టాల్సిన ఆవశ్యకతను ప్రజాతంత్రవాదులు చాటి చెప్పాలి.
జనసాహితి,
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ తేదీ : 10-3-2020

