చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా, విద్యా, ఉపాధి రంగాల్లో విద్యార్ధినులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై పోరాడుదాం!
మిత్రులారా!
"ఎడ్యుకేట్ ఎ గర్ల్- ఎంపవర్ ఎ నేషన్", "బేటీ బచావో- బేటీ పడావో" లాంటి నినాదాలను పాలకులు గత 75 ఏళ్లుగా ఇస్తూనే ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లోకి ప్రవేశించి, ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని, కనుక మహిళా దినోత్సవాలను జరిపి వారిని సన్మానించి, సెలబ్రేషన్స్ చేసుకోవడమే "మార్చి 8" ఉద్దేశ్యమని చెప్తూ వేడుకలు చేస్తున్నారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే... ఆడపిల్లల భ్రూణ హత్యల్లో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థినుల సంఖ్య నానాటికి తగ్గుతూ, డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది, స్కూలు, కళాశాల, రోడ్డు, బస్సు, పనిచేసే ప్రదేశం అనే తేడా లేకుండా ప్రతీ చోట వివక్షతను, అసభ్య ప్రవర్తనను, లైంగిక దాడులను స్త్రీలు ఎదుర్కొంటున్నారు. స్త్రీలపై దేశవ్యాప్తంగా 2021లో 2.5 లక్షలు, 2022లో 4.45 లక్షల నేరాలు జరిగాయని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాక దేశంలో ఏటా సుమారు 6,500 మంది అక్రమ రవాణాకు గురవుతున్నారని, 2019-21 మధ్యలో దేశవ్యాప్తంగా 10 లక్షల మంది చిన్నారులు, మహిళలు అదృశ్యం అయ్యారని పలు గణాంకాలు వెల్లడించాయి.
అత్యాచార ఘటనలపై ప్రజలలో ఆగ్రహం వ్యక్తమైన ప్రతీసారీ ఏదో ఒక చట్టాన్ని (నిర్భయ, దేశ) తీసుకొచ్చి నిందితులు ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన వారైతే ఉరితీసి సమస్య పరిష్కారం అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాక బాధితులని నిందితుల్ని చేస్తూ ఆడపిల్లల వస్త్రధారణ, వేషధారణే అత్యాచారాలకు కారణమని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. లైంగిక దాడులకు ఆడపిల్లల వస్త్రధారణే కారణమైతే పసిపిల్లలపై, ముసలి వారిపై లైంగిక దాడులు ఎందుకు జరుగుతున్నట్లు!? నిజానికి స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీల వారు తయారు చేస్తున్న బట్టలను, కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ను అమ్ముకోవడం కోసం ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వాడి లాభాల కోసం ఆ సంస్కృతిని మనం అనుసరిస్తేనే మన మర్యాద, పరువు నిలబడుతుందని సమాజంలో వ్యాప్తి చేసిన భావజాలం కారణంగా విదేశీ సంస్కృతికి యువతీ, యువకులు సమానంగా బలవుతున్నారు. విదేశీ సంస్కృతితో పాటు మద్యం, మత్తు పదార్థాలు, పోర్న్ సైట్లు, మహిళలను అవమానపరిచే టీవీ ప్రోగ్రాములు, అశ్లీల సినిమాలు పాలకులచే ఉద్దేశ్యపూర్వకంగా ప్రోత్సహించబడుతున్నాయి. అలాగే స్త్రీలను గౌరవించే సంస్కృతి లేకపోవడం మరియు వారిని కేవలం అనుభవించే వస్తువులుగా, మగవారికి సేవలు చేసే బానిసలుగా చూస్తున్న పురుషాధిక్య భావజాలం బలంగా సమాజంలో వేళ్లూనుకుని ఉంది. చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు మూల కారణాలుగా ఉన్న వీటన్నింటినీ సమూలంగా నాశనం చేయనంత కాలం ఈ సమస్యలు పరిష్కారం కావు.
అలాగే దేశ అభివృద్ధికి మూలమైనటువంటి విద్యను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుటకు ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయించకుండా పాలకులు వాటిని ఉద్దేశపూర్వకంగానే భ్రష్టు పట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు వెళుతున్న బాలికలు అపరిశుభ్ర మరుగుదొడ్లు, త్రాగునీటి కొరత వంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న వారికి పౌష్టికాహారం పక్కన పెడితే సరిపడినంత ఆహారం, తాగునీరు కూడా లభించడం లేదు. బాలికల హాస్టళ్లను బార్ షాపుల పక్కన, అద్దె భవనాల్లో, ప్రహరీ గోడలు కూడా లేని బిల్డింగులలో నడుపుతుండడంతో ఎవరొచ్చి ఏ అఘాయిత్యం చేసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. గిరిజన ఆశ్రమాలు, కెజిబివిలు మరియు సంక్షేమ హాస్టళ్లలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు అంతులేకున్నాయి. ఒకవైపు ఇలా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసి, మరోవైపు విద్యను ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటేనే మార్కులు, ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు పాలకులు, కానీ అక్కడ మార్కులు, ర్యాంకుల కోసం వారు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక అనేకమంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో వైపు చదువులు పూర్తిచేసుకొని బయటకు వస్తున్న యువతులు ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేకపోవడంతో, 5-10 వేలకు ప్రైవేటు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఫార్మా మరియు బట్టల తయారీ కంపెనీలలో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
విద్యార్థి, యువకులు సంఘటితమై సంఘాల ద్వారా ఉద్యమాలు నిర్మించి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదని ప్రపంచంలో జరిగిన ఎన్నో పోరాటాలు నిరూపించాయి, ఆ విధంగానే 150 ఏళ్ల క్రితం అమెరికా తదితర దేశాలలో మహిళా కార్మికులు తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా మరియు 8 గంటల పని దినం కోసం పోరాడి అనేక హక్కులను సాధించుకున్నారు. ఆ పోరాట స్ఫూర్తిని చాటి చెప్పి, ఆ మార్గాన్ని ఆదర్భంగా చూపడానికి 1910 లో జర్మనీ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్సిన్ 'మార్చి 8'ని "అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం"గా ప్రకటించింది. కనుక 'మార్చి 8' వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకుంటూ, శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని స్వీకరించి చైతన్యవంతులై మన సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే మన ముందున్న కర్తవ్యం. ఈ కర్తవ్యం లో భాగంగా విద్యా, ఉపాధి రంగాల్లో సమస్యల పరిష్కారంకై విద్యార్థులు, యువకులు పోరాడాలి మరియు మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు, అణిచివేతలకు కారణమైనటువంటి సామ్రాజ్యవాద విష సంస్కృతులను పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలను నిర్మించాలి. అలాగే 'మార్చి 8' చరిత్రను, శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ విద్యార్ధులందరూ తమ స్కూళ్లలో, కాలేజీల్లో, హాస్టళ్ళలో కార్యక్రమాలను చేపట్టాలని పిడిఎస్ఓ పిలుపునిస్తోంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO)
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ: ఎల్.భాను, ఆర్. ఆష, కె.గౌతమి సెల్: 7075119645


