విజయవంతంగా జరిగిన పిడిఎస్ఓ-ఎన్‌వైయస్ రాష్ట్ర సదస్సు

0
    గుంటూరులో వైన్స్ డీలర్స్ అసోసియేషన్ కళ్యాణమండపంలో "విద్యా, ఉపాధి రంగాల సంక్షోభం- పాలకుల విధానాలు - విద్యార్థి, యువజనుల కర్తవ్యాలు" అంశంపై పిడిఎస్ఓ- ఎన్‌వైయస్ రాష్ట్ర సదస్సు విజయవంతంగా జరిగింది. ఉదయం 10 గంటలకు హాల్ నుంచి మొదలైన ప్రదర్శన శంకర్ విలాస్ సెంటర్ వరకు అక్కడి నుండి తిరిగి హాల్ వరకు గంటపాటు ఇరు సంఘాల జెండాలతో విద్యార్థి, యువజనుల నినాదాలతో గంటపాటు ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
జనసాహితి రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్ గారు ప్రారంభోపన్యాసం చేస్తూ "భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నిరక్షరాస్యత, నిరుద్యోగం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దేశంలో అన్ని రంగాల్లో సంక్షోభం తీవ్ర స్థాయిని తాకుతుంది. పాలకులే నిరక్షరాస్యతను నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. కార్పొరేట్ విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆ భారం ప్రజలందరిపై ఉంది. విద్యా, ఉపాధి రంగాల సంక్షోభం ఒకరి వల్ల పరిష్కారం కాదు. కనుక విద్యార్థి, యువజనలందరూ కలిసి సంఘటితంగా సామ్రాజ్యవాద అనుకూల విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించి సంక్షోభాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
    ప్రధాన వక్తగా విచ్చేసిన కేంద్ర-రాష్ట్ర మాజీ సలహాదారు వైవిఎస్ మహాదేవ్ గారు మాట్లాడుతూ "వందల మంది బలిదానాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అన్యాయంగా ప్రైవేటు వాళ్లకి అమ్మేస్తున్నారు. మన దేశం నుంచి కొన్ని లక్షల కోట్లు గ్యాస్ రూపంలో విదేశాలని దేశాలకి తరలిపోతుంది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులను, విదేశ కంపెనీలకు తీసుకువస్తున్నారు తప్ప ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా స్థాపించడం లేదు. విద్యార్థి, యువత అంతా విదేశీ కంపెనీలలో మేధో కూలీలుగా మారుతున్నారు. రాష్ట్ర విభజన చేసారు, కానీ మన రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేదు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. విశాఖ ఉక్కు ఉద్యమం లాంటి ఉద్యమాలు చేసినప్పుడే పాలకులు భయపడ్డారు. అలాంటి ఉద్యమాలు విద్యార్థి యువతరం చేసి మన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
    PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ “విద్యా కార్పోరేటీకరణ, కాషాయికరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం-2020 తీసుకువచ్చింది. దీంతో ఎన్.సి.ఇ.ఆర్.టి సిలబస్ లో హిందూత్వ భావజాలాన్ని చొప్పిస్తూ, చరిత్ర వక్రీకరించి విద్యార్థు మెదళ్ళలో విషబీజాలు నాటుతున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని విద్యారంగ ప్రయోగశాలగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చి అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను గందరగోలపరుస్తున్నారు. పాఠశాలల విలీనం పేరుతో అనేక పాఠశాలలను మూసివేసారు. అలాగే ఒక ఏడాదిలోనే సిలబస్ అనేక రకాల మార్పులకు గురి చేసి సిబిఎస్ఇ, ఐబి సిలబస్ అనీ, టోఫెల్ పరీక్షలనీ అస్తవ్యస్త విధానాలను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారు. ప్రభుత్వ చర్యలతో గత రెండు సంవత్సరాలలో ఏడున్నర లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. జాతీయ విద్యా విధానం -2020 అమలులో భాగంగా విద్యను ప్రైవేటీకరించాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కర్తవ్యం విద్యార్థుల ముందు ఉందన్నారు.
    NYS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.భాషా మాట్లాడుతూ "ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు, కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తూ నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారనీ, మరోవైపు కుల,మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థి, యువతను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేల పోస్టులను, కేంద్రంలో ఉన్న 60 లక్షల పోస్టులను కేంద్ర, రాష్ట్ర పాలకులు భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ను నిర్వహించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని అమ్మివేస్తూ నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితులే కొనసాగితే దేశం అధోగతి పాలవుతుందని, ఈ పరిస్థితులను మార్చాల్సిన బాధ్యత ఈ దేశ యువశక్తిదేనన్నారు.
    ఇంకా ఈ సదస్సులో ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు ఎస్.కె.జిలానీ, సైకాలజిస్ట్ డా౹౹బి.అరుణ, ఎపిటిఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.పాండురంగవరప్రసాద్ పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. భాస్కర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
    ఈ సదస్సులో పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ప్రచురించిన "విదేశీ యూనివర్శిటీలకు అనుమతులు - ఉన్నత విద్యకు దూరమవుతున్న అట్టడుగు విద్యార్థులు" మరియు "సామాజిక సంక్షోభపు సుడిగుండంలో విద్యారంగం" అనే రెండు పుస్తకాలు ఆవిష్కరణ జరిగింది.
    విద్యా, ఉపాధి రంగాల సమస్యలపైన విద్యార్థి కళాకారులు ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 250 మంది విద్యార్థి, యువజన ప్రతినిధులు సదస్సుకి హాజరయ్యారు.
    జాతీయ విద్యా విధానం-2020 రద్దు చేయాలని, విద్యా సంస్కరణల పేరుతో పాఠశాలల విలీనం, మూసివేతను ఆపాలని, పాఠశాలలలో అమలు చేస్తున్న టోఫెల్, ఐబీ, సీబీఎస్సీ, సెమిస్టర్ పద్ధతులను రద్దు చేయాలని, సిలబస్ తొలగింపు పేరుతో శాస్త్రీయ, సామాజిక, చారిత్రక పాఠ్యాంశాల తొలగింపు నిలిపివేయాలని, డిగ్రీలో ప్రవేశపెట్టిన సింగిల్ సబ్జెక్ట్, మల్టీ ఎంట్రీ- మల్టీ ఎగ్జిట్, ఇంటర్నషిప్ విధానాలు రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, కాస్మోటిక్ మెయింటినెన్స్ ఛార్జిలను విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లను తక్షణమే విడుదల చేయాలని, విదేశీ యూనివర్సిటీల ప్రవేశం కోసం యూజీసీ చేపడుతున్న చర్యలు ఆపాలని, కేంద్రంలో, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, విశాఖ స్టీల్ ఫ్లాంట్ మరియు ప్రభుత్వ రంగ పరిశ్రమలన ప్రైవేటీకరణను నిలిపివేయాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని, పేద, దళిత, ఆదివాసి మైనార్టీ విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలను దూరం చేస్తూ తీసుకువచ్చి 107, 108 జివోలను రద్దు చేయాలని, ఉన్నత విద్యాలయాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న కుల, మత, ప్రాంత వివక్షతలను తీవ్రంగా ఖండిస్తూ, మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులకు కారణమవుతున్న అశ్లీల, హింసాత్మక సినిమాలు, మద్యం, మత్తు పదార్థాలను వెంటనే నిషేదించాలని, అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండిస్తూ, తమ మాతృభూమి కోసం, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం, పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఈ సదస్సు పలు తీర్మానాలు చేసింది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
నవయువసమాఖ్య (NYS),
ఆంధ్రప్రదేశ్
తేదీ : 22-12-2023,
గుంటూరు
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)