విశాఖపట్నంలో విద్యారంగంపై సెమినార్

0
    "విద్యా రంగంలో వస్తున్న మార్పులు - విద్యార్థుల కర్తవ్యాలు” అనే అంశంపై అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది.
    ఈ సెమినార్‌ లో PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్ మాట్లాడుతూ “ విద్యా కార్పోరేటీకరణ, కాషాయికరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం - 2020 తీసుకువచ్చింది. దీంతో ఎన్.సి.ఇ.ఆర్.టి సిలబస్ లో హిందూత్వ భావజాలాన్ని చొప్పిస్తూ,చరిత్ర వక్రీకరించి విద్యార్థు మెదళ్ళలో విషబీజాలు నాటుతున్నారు.మరోవైపు రాష్ట్రాన్ని విద్యారంగ ప్రయోగశాలగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చి అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను గందరగోళ పరుస్తున్నారు. యిటీవల 4200 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోని హైస్కూల్లో విలీనం చేశారు. పాఠశాలల విద్యార్థులు తక్కువగా ఉన్నారని సాకు చూపి రాష్ట్రంలోని సుమారు 18వేల పాఠశాలలను మూసివేసారు. 12,386 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 18,520 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాతృభాషలో విద్యను రద్దు చేశారు. అలాగే ఒక ఏడాదిలోనే సిలబస్ అనేక రకాల మార్పులకు గురి చేసి సిబిఎస్ఇ, ఐబి సిలబస్ అనీ, టోఫెల్ పరీక్షలనీ అస్తవ్యస్త విధానాలను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారు. ప్రభుత్వ చర్యలతో గత రెండు సంవత్సరాలలో ఏడున్నర లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు.జీవో నెంబర్ 117 ద్వారా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించి మెగా డిఎస్సి ని నిర్వహించక పోవడంతో అటు నిరుద్యోగులకు ఇటు విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారు. జాతీయ విద్యా విధానం -2020 అమలులో భాగంగా విద్యను ప్రైవేటీకరించాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కర్తవ్యం విద్యార్థుల ముందు ఉందన్నారు.
    PDSO రాష్ట్ర కోశాధికారి ఎల్. భాను మాట్లాడుతూ “దేశంలో నిరుద్యోగం అనేది రోజురోజుకు పెరుగుతుందని, కేంద్రంలో 60లక్షల పోస్టులు, రాష్ట్రంలో రెండున్నర లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా, విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని అమ్మివేస్తూ నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితులే కొనసాగితే దేశం అధోగతి పాలవుతుందని, ఈ పరిస్థితులను మార్చాల్సిన బాధ్యత ఈ దేశ యువశక్తిదేనన్నారు.
    పిడిఎస్ఓ విశాఖ జిల్లా అధ్యక్షులు పి. విశ్వనాధ్ మాట్లాడుతూ “ ఈ ఐదేళ్ల కాలంలో విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులన్నీ విద్యార్థులను గందరగోళపరిచేవిగా, మార్కులు ర్యాంకుల కోసం మాత్రమే చదువుతున్న విద్యార్థులు.. మార్కులు రాక బలవన్మరణాలకి పాల్పడుతున్నారని, ఒక సమస్య వస్తే దానిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని కూడా ఈ చదువులు ఇవ్వలేకపోతున్నాయన్నారు.
    ఈ సెమినార్ కు పిడిఎస్ఓ విశాఖ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు ఎం.లలిత, నాగేష్, జానకి, షణ్ముఖ్, చాణక్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవ అభినందనలతో……
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
విశాఖపట్నం
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)