వికెట్ పడిపోతేనే..
దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా దేశభక్తా ?
ఇష్టమయిన క్రికెటరెవరో
వంద పరుగులు చెయ్యాలని
దేవుణ్ణి మొక్కుకున్నట్లు
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశభక్తా ?
రెండు గంటలు బ్యాటు పట్టుకొని
ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్నకు
ఏ పేరు పెడుతావ్ దేశభక్తా ?
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్
దేశాన్ని బతికించే నదులు, చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా దేశభక్తా ?
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులనెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా దేశభక్తా ?
నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా దేశ భక్తా?
అన్నం తింటూ కూడా..
ఏ విదేశీ టీం ని దేశంలో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశీ బియ్యమో
విదేశీ దిగుమతి బియ్యమో తెలుసా దేశభక్తా?
ఇండియన్ క్రికెట్ బోర్డో, క్రికెట్ టీమో
చేసే తప్పొప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్ వ్యవసాయానికి పెట్టింది పేరయిన దేశంలో
ప్రభుత్వాలు చేసే తప్పొప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా దేశభక్తా ?
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో
తెలిసిన నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా దేశ భక్తా?
అసలు,
అసలయిన పరుగులు తియ్యడం అంటే
ఏమిటో నీకు తెలుసా దేశభక్తా ?
ఎప్పుడయినా,
గిట్టు బాటు ధరలకోసమో, విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ.. లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను చూసావా దేశభక్తా?
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
ఎవరు ఎలా రైతులను మోసం చేస్తున్నారో తెలియకుండా ఉంటుందా దేశభక్తా?
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్కతో బ్యాట్ మాత్రమే కాదు
నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా దేశభక్తా ?
క్రికెటర్లు
బూస్టులో కూల్ డ్రింకులో తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా దేశభక్తా?
కామెంట్రీలు వింటూ టీవీలకు అతుక్కోపోయినట్లు
రైతుల గురించి చర్చాకార్యక్రమాలు చూసావా దేశభక్తా ?
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా దేశభక్తా!
మరి ఎప్పుడు ఎలా దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా?
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం దేశభక్తా?
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు దేశభక్తా
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పొలాల్లో దేశభక్తా..
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి.
~సైఫ్ అలీ సయ్యద్
...... స్టూడెంట్(బులెటిన్ ఆఫ్ పిడిఎస్ఓ), జనవరి 2022 సంచిక నుండి

