"రాయలసీమ కరువు - విద్యా, ఉపాధి రంగాల సంక్షోభం - కర్తవ్యాలు" అనే అంశంపై విజయవంతంగా జరిగిన PDSO రాయలసీమ విద్యార్థుల సదస్సు

0
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రకాశం రీక్రియేషన్ సెంటర్ లో 'రాయలసీమ కరువు -విద్యా, ఉపాధి రంగాల సంక్షోభం - కర్తవ్యాలు' అనే అంశంపై రాయలసీమ విద్యార్థుల సదస్సు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సుకు పిడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఆష అధ్యక్షత వహించారు.
సదస్సుకు ప్రారంభోపన్యాసం చేస్తూ ఎస్వీ యూనివర్సిటీ ప్రొ౹౹పి.సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతమంది పాలకులు మారుతున్న రాయలసీమ ఎన్నో ఏళ్ళుగా కరువు,కాటకాలకు నిలయంగా ఉంది తప్పితే సమస్యలు పరిష్కరించబడటంలో ఎటువంటి మార్పు లేదు. రాయలసీమలోని ప్రసిద్ధ రచయితలందరూ ఇక్కడి కరువును, పేదరికాన్ని, వలసలను కవిత, కథ, సాహిత్య విమర్శ రూపంలో ప్రభావంతంగా చిత్రీకరించినప్పటికీ, అదంతా అరణ్యరోదనగానే మిగిలిపోయింది. రాయలసీమ ప్రాంతపు సమస్యలపై ఇక్కడి మేథావులు, రచయితలు, విద్యార్థులు, యువకులు తమ సమస్యలపై గళం విప్పాల్సిన తరుణం వచ్చింది.సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.
ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)- 2020 ద్వారా విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరుతో ప్రభుత్వ బడులను మూసేస్తున్నారని, అనేక విద్యా పథకాలు తీసుకొచ్చి భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్లు అనేవి లేకుండా ప్రైవేటుపరం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారనీ అన్నారు మరోవైపు నిరుద్యోగంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యువతకి పోరాటమే ముందున్న పరిష్కారం అన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ నేడు పాలకవర్గాలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఉందనీ, విద్యార్థులు పాలకులు చేస్తున్న ప్రాంతీయ రాజకీయాలకు బలి కాకుండా తమ సమస్యలపై, హక్కులపై ఉద్యమించాలన్నారు. మన దేశం నేడు ఆకలి చావుల్లోనూ, మహిళలపై దాడుల్లోనూ, నిరుద్యోగంలోనూ, నిరక్షరాస్యతలోనూ హక్కుల హననంలోనూ ముందున్నదనీ అన్నారు. నేటికీ విద్య అందరికీ అందడం లేదని మార్కెట్లో వస్తువుగా మారిపోయిందనీ, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి హక్కు కోసం పోరాడాలన్నారు.
ఎస్వీ యూనివర్సిటీలో అధ్యాపకులు డా.డి.గోవిందులు మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం, కరువును పెంచిపోషిస్తున్న పాలకుల విధానాల వలన గ్రామాల్లో పనుల్లేక, అప్పులు పాలైన రైతు కూలీలు, చిన్న రైతులు బెంగుళూరు, హైదరాబాద్, బొంబాయి, చెన్నై, పుణే వంటి మహానగరాలకు, కువైట్, సౌదీఅరేబియా వంటి గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నారనీ, అలాగే ఇక్కడి మహిళలు అనివార్యంగా వేశ్యావృత్తిలోకి నెట్టబడుతున్నారన్నారు. ఈ దుర్మార్గకరమైన పరిస్థితికీ కారణాలేంటో సీమ విద్యార్థులుగా ఆలోచించాల్సి ఉందన్నారు.
నవ యువ సమాఖ్య (NYS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.భాషా గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు,కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తూ నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారనీ, మరోవైపు కుల, మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థి, యువతను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పోస్టులను, కేంద్రంలో ఉన్న 60 లక్షల పోస్టులను కేంద్ర, రాష్ట్ర పాలకులు భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్,కార్మిక నాయకులు ఎస్.మీరయ్య, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు సురేష్, పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు కె.తిరుమలేష్, కె.గౌతమి తదితరులు పాల్గొని మాట్లాడారు. పలు సామాజిక సమస్యలపై విద్యార్థి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సదస్సులో రాయలసీమ జిల్లాల నుండి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. సదస్సుకు ముందు యూనివర్శిటీలో రాయలసీమ విద్యార్థుల సమస్యలపై నినాదాలిస్తూ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించటం జరిగింది.
ఈ సదస్సు సందర్భంగా పిడిఎస్ఓ పలు తీర్మానాలు చేసింది.
  1. రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపట్టి, రైతు ఆత్మహత్యలు, వలసలను అరికట్టాలి!
  2. దశాబ్దాలుగా రాయలసీమలో పెండింగులో ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి.
  3. ప్రతి ఏటా వృధాగా సముద్రం పాలవుతున్న వెయ్యి టి.యం.సి.ల నికర జలాలను రాయలసీమకు మళ్ళించాలి.
  4. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి, గుంతకల్లును రైల్వే జోన్ గా ప్రకటించాలి.
  5. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ లను రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
  6. కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలి!
  7. జాతీయ విద్యా విధానం - 2020ను రద్దు చేయాలి!
  8. విలీనాల పేరుతో జరుగుతున్న పాఠశాలల మూసివేతను ఆపాలి!
  9. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ మరియు ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణను విరమించుకోవాలి!
  10. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులకు, రాష్ట్రంలోని 2 లక్షల 30 వేల పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ యివ్వాలి!
  11. వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
  12. పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులను, సంక్షేమ హాస్టళ్ల బకాయిలను విడుదల చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి.
  13. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన విద్యార్థులకు సరిపడా సీట్లు కేటాయించాలి.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
రాయలసీమ జిల్లాలు
తేదీ : 16-02-2023,
తిరుపతి











Tags

Post a Comment

0Comments
Post a Comment (0)