మీరు షార్పునర్ కు 18% GSTని 12%కు తగ్గించిన విశయం వెలుగులోకి రావడంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొన్నది ! బడి పిల్లలంత సంబరాల్లో మునిగి తేలిండ్రు ! సోషల్ మీడియాలో నిన్నంత మీ నామస్మరణే జరిగింది! మీరు పన్ను తగ్గించిన షార్పునర్ ని మేము చిన్నప్పుడు చాక్ మార్ అని పిలిచేది ! పెన్నును మా సార్లు పొంటీన్ అనే వాళ్ళు! అందులో వేసే రిఫీల్ ను పిక్కు అనేది! ఇప్పటి పిల్లలకి పిక్కు అని చెబితే నవ్వుతండ్రు! వృత్త లేఖినిని కంపాస్ అని, కోణమానిని ప్రొటాక్టర్ అని, విభాగినిని డివైడర్ అని, రబ్బర్ ని ఎరేసర్ అని చెబితేనే ఇప్పటి పిల్లలకి అర్థం అయితంది ! చాక్ పీస్, స్కేలు, డస్టర్, బుక్కు, బ్లాక్ బోర్డు, గ్రీన్ బోర్డు, వైట్ బోర్డు ఇలా బడిలో ఉండే ఏ వస్తువును కూడ మీరు వదిలిపెట్టలేదు ! ప్రతీ దానిని మరచిపోకుండా గుర్తుపెట్టుకొని పన్నులు వేసిండ్రు! ఈ సందర్భంగా మీకు నా విన్నపం ఏమిటంటే మా బడిలో పిల్లలు జుట్టు పెంచుకుంటున్నరు ! కటింగ్ చిన్నగా చేసుకోండి అని మేము రోజు ప్రార్థన సమయంలో ఎంత చెప్పినా వినడం లేదు! గట్టిగా మందలిస్తే బడి తప్పిస్తున్నరు ! కావున మీరు జుట్టుకు గట్టిగనే పన్ను వేయండి! తలపై ఒక్క సెంటీ మీటర్ కంటే ఎక్కువ వెంట్రుకలు పెంచుకున్న అబ్బాయిలందరు GST పన్నుల పరిధిలోకి వస్తరని ప్రకటించండి ! ఇందుకు ముందుగా జుట్టును వస్తువుల జాబితాలో చేర్చండి ! జుట్టును కత్తిరించే కత్తెర, బ్లేడ్ లకు పన్ను విదిస్తున్నప్పుడు జుట్టును మాత్రం ఎందుకు మినహాయించాలి ? రేషన్ షాపులు మీవే అని చెప్పుకుంటున్నరు కాబట్టి తలపై ఒత్తుగా వెంట్రుకలు ఉన్న వారికి రేషన్ కట్ అనండి ! దాంతో తల్లితండ్రులు తమ పిల్లలకి ఇంటివద్దనే కటింగ్ చిన్నగా చేయించి బడికి పంపుతరు!
ఇట్లు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు,
తెలంగాణ
సౌజన్యం : తానిపర్తి తిరుపతి రావు

