దర్శన్ సోలంకిది ఆత్మహత్యా?! సంస్థాగత హత్యా?!

0
సెంథిల్ కుమార్... రోహిత్ వేముల...పాయల్ తాడ్వీ...దర్శన్ సోలంకి... ఇంకా ఎంతమంది బలవ్వాలి?
దర్శన్ మృతిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి బహిరంగ నివేదిక యివ్వాలి!
మిత్రులారా!
★ ఫిబ్రవరి 12, ఆదివారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-బొంబాయిలో మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 18 ఏళ్ల దర్శన్ సోలంకి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. కుళాయిలు బిగించే పనిచేసే అతని పేద తండ్రి, పొరుగిళ్ళలో పని మనిషిగా చేసే అతని తల్లితో ప్రతి వారంలాగే ఆ రోజూ మాట్లాడాడు. ఆ తరువాత ముప్పావు గంటకే దర్శన్ సోలంకి ప్రాణాలు తీసుకున్నాడు. కానీ పరిస్థితులను బట్టి కులవివక్షకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, పోలీసులు మాత్రం కారణం తెలియని హత్య కింద కేసు నమోదు చేశారు. అంటే దర్శన్ ఆత్మహత్యకు కారణం ఏమిటో, కారకులెవరో ఎన్నటికీ తేలదు.
//ఆత్మహత్య కాదు, సంస్థాగత హత్య!//
★ దర్శన్ సోలంకి బొంబాయి ఐ.ఐ.టి.లో చేరిన తరువాత మిగతా వారితో పరిచయాలు, స్నేహాలు కుదుర్చుకోక ముందే అతను జె.ఇ.ఇ.లో ఎన్ని మార్కులు సంపాదించాడో అడగడం మొదలు పెట్టారు. ఈ మార్కులు తెలిస్తే విద్యా విషయాల్లో అతని స్థానం ఏమిటి, దానిని బట్టి అట్టడుగు కులమో, అగ్రకులమో తెలుస్తుంది. అప్పుడు "నువ్వు రిజర్వేషన్ కోటా విద్యార్థివి" అని ముద్ర వేశారు.మూడున్నర నెలల క్రితమే అతడు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, అంతవరకూ చదువులో చురుగ్గా ఉండేవాడు ఇటీవల ముభావంగా మారాడనీ, నెలక్రితం మాట్లాడినప్పుడు కుల వివక్ష సంగతి చెప్పాడనీ అతని సోదరి చెబుతున్నారు. తన కులం తెలిసినప్పటి నుంచీ సహ విద్యార్థులు మాట్లాడటం మానేశారనీ, తాను ఒంటరినయ్యానని బాధపడ్డాడని అంటున్నారు. అత్యున్నత విద్యా సంస్థల్లో దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న కుల వివక్ష, అంటరానితనమే వారు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణం అని అందరికీ తెలుసు. దర్శన్ సోలంకి ఆత్మహత్య కూడా ఆ కోవలోనిదే! కనుక ఇది ముమ్మాటికీ సంస్థాగత హత్యే!!
//బుట్ట దాఖలవుతున్న కమీషన్ నివేదికలు//
★ సోలంకి ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కనిపెట్టడానికి ఐ.ఐ.టి. యాజమాన్యం ఓ కమిటీని నియమిస్తుందట. కుల వివక్షే కారణం అని ఆ కమిటీ తేల్చినా అది భవిష్యత్తులో ఇలాంటి ఘాతుకాలను నివారించడానికి ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే మన సమాజంలో కులం అనే చెట్టు వేర్లు అంత బలంగా పాతుకు పోయాయి గనుక. తమ ప్రాంగణంలో కుల వివక్ష లేనేలేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగం ఉన్నదని చెబుతున్న బాంబే ఐఐటీ ఆ విభాగం పని తీరెలావుందో ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఏడేళ్లనాడు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ వేముల ప్రాణం తీసుకున్నప్పుడు యాజమాన్యం నుంచి వచ్చిన సంజాయిషీకీ, దీనికీ పెద్దగా తేడాలేదు. రోహిత్‌ వేముల మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో వెలికి తీయాల్సిన జస్టిస్‌ రూపన్‌వాల్‌ కమిషన్‌ అతను ఎస్సీ కాదని చెప్పడానికే తాపత్రయపడింది. తన చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోయి దళిత స్త్రీ అయిన తల్లి పెంపకంలో దళిత వాడలోనే పెరిగిన రోహిత్‌ దళితుడు కాడని నిరూపించింది.
★ ఇందుకు దేశంలోని ఉన్నతశ్రేణి విద్యాసంస్థలేవీ మినహాయింపు కాదని 2007లో థోరట్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013 నాటి ముంగేకర్‌ కమిటీ నివేదిక వరకూ చెబుతూనే వస్తున్నాయి. కానీ వాటిని అవసరమైనంతగా పట్టించుకోవటం లేదని దర్శన్‌ సోలంకీ ఉదంతం మరోసారి నిరూపించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ కథనం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలో బాంబే ఐఐటీలో కుల వివక్ష, అందువల్ల తలెత్తే సమస్యలపై సంస్థలోని ఎస్సీ, ఎస్టీ విభాగం రెండు సర్వేలు చేసింది. దాంట్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా సంకల్పించింది. ఏడాదైంది కానీ, ఇంకా అది ఆచరణ రూపం దాల్చినట్టు లేదు. అసలు సర్వేలకు స్పందించిన విద్యార్థుల సంఖ్య చూస్తేనే వివక్ష ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. బాంబే ఐఐటీలో దాదాపు 2,000 మంది దళిత విద్యార్థులుంటే కేవలం 20 శాతం మంది మాత్రమే తొలి సర్వేకు స్పందించారట! రెండో సర్వేకైతే 5 శాతంమంది మాత్రమే జవాబిచ్చారు. స్టూడెంట్‌ కౌన్సెలర్‌గా ఉంటున్న మహిళా ప్రొఫెసర్‌ రిజర్వేషన్ల గురించి సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి భయానికి ఒక కారణం.
//ఈ కుల జాఢ్యానికి ఇంకెంతమంది బలి అవ్వాలో..?//
★ 2008లో చనిపోయిన పీహెచ్‌డీ విద్యార్థి సెంథిల్ కుమార్ చనిపోవటానికి కారణాలు ఇలాంటివే. ఆయనది తమిళనాడు. ఎస్‌టీ వర్గానికి చెందిన విద్యార్థి. ఫెలోషిప్ కోసం వెళితే.. 'పందులు కాసుకునేవాడివి నీకెందుకురా ఈ చదువు' అని వ్యాఖ్యానించటంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. స్కాలర్‌షిప్ రాకపోవటంతో అప్పులయ్యాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోకపోవటంతో, ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలాగే 2016లో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కూడా ఇటువంటి సామాజిక, రాజకీయ వివక్ష, వేధింపులే ప్రధాన కారణం. క్యాంపస్‌లో అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా రోహిత్ వేముల రాజకీయంగా గొంతెత్తటంతో... ఒక సంస్థను టార్గెట్ చేశారు. అందులోని విద్యార్థులందరూ దళితులే. తమపై విధించిన సస్పెన్షన్ మీద మూడు నెలల పాటు పోరాడారు. ఈ అన్యాయాలకు పరిష్కారం ఉండదనే వేదనతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు.2019లో ముంబైలో వైద్య శాస్త్రంలో పీజీ చేస్తున్న పాయల్‌ తాడ్వీ అనే గిరిజన విద్యార్థిని సహ విద్యార్థినుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న తనను కనీసం ఆపరేషన్‌ థియేటర్‌లోకి కూడా రానీయలేదని చివరిసారిగా రాసిన లేఖలో ఆమె బాధ పడింది. ఇదే ఐఐటీ ముంబైలో 4 సెప్టెంబర్ 2014న హాస్టల్‌లోని ఆరవ అంతస్తు నుండి పడి మరణించిన అనికేత్ ఆంబోర్ కూడా కుల వివక్ష వాతావరణం వల్లే మరణించాడు.
★ ఐఐటీలతో సహా పలు ఉన్నత విద్యా సంస్థల నుంచి పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య గత కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో 2014 నుంచి 2021 మధ్య మొత్తం 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్‌సభలో వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో 58 శాతం మంది ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులే కావటం గమనార్హం.
★75 ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో దేశంలోని దళిత, ఆదివాసీ విద్యార్థులు యింకా కుల వివక్ష, వేధింపులకు గురి కావాల్సిందేనా? తమ జ్ఞానంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన విద్యార్థులు ఇలా కుల దురంహకారానికి, దుర్మార్గాలకి బలి కావాల్సిందేనా? ఈ సమస్య పాలకులకు పట్టదా?
★ దర్శన్ కు న్యాయం చేయాలని పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలియజేస్తూ, కుల వివక్షకు బలైన దర్శన్ మృతిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి బహిరంగ నివేదిక యివ్వాలని, కుల వివక్ష,వేధింపులు కేంద్రాలుగా మారుతున్న విద్యాలయాలపై తగు చర్యలు చేపట్టి 'విద్యా వాతావరణాన్ని' నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు పిడిఎస్ఓ పిలుపునిస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
ఆంధ్రప్రదేశ్.
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
ఫోన్.నెం:9701924714
ప్రచురణ తేదీ : 22-02-23,విజయవాడ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)