శునకపు పాట - గణతంత్ర రాజ్యం
- నామ్ దేవ్ ఢసాల్
మూలుగుతోంది.అప్పడప్పడు మొరుగుతోంది.
అది దానికి రాజ్యాంగమిచ్చిన హక్కు
ఎంగిలి మెతుకులు తినడం దాని బతుకు అన్యాయానికి తలొంచి తలొంచి అలవాటై దాని మనసు ప్రతిస్పందించే గుణాన్ని పోగొట్టుకున్నది ఎదురు తిరిగినా, సంకెళ్లు తెంపుకోజూసినా
దాన్ని కాల్చి చంపేస్తారు.
అటు విను! వీధులనిండా సంపూర్ణస్వేచ్ఛ' కేకలు
ప్రతిధ్వనిస్తున్న నినాదాలు!
మిత్రులారా! నేను సున్తీ చేయించుకోని ఓ పిలగాణ్ణి ప్రజాస్వామ్యం అంటే ఏమిటని అడగదల్చాను.
దాంతో ఏం తింటాడతడు?
చింకిపాత గుడ్డు కప్పుకున్న ఆ ముసలావిడని ప్రశ్నిస్తాను
తల్లిపాల పోషక విలువల గురించి!
ఎద్దులాగా పనిచేస్తున్న శ్రామికుడి నడుగుతాను
సంతృప్తి అంటే ఏమిటి, సమస్తం దోచుకోబడడం అంటే ఏమిటని!
నా మనసంతా ఇప్పుడు సమస్యలతో చిక్కుముడి పడి ఉన్నది.
‘ఆ ఎర్రపల్లకిలో ఆకుపచ్చని తెరవెనక గుండు గీయించుకున్న విధవ స్త్రీలున్నారు. ఏమిటది చెప్పు?
అతడిది శిలా హృదయం, ఖడ్గమృగపు తోలు మందం గడ్డిబొమ్మ, మ్యూజియంలో వేలాడదీయబడ్డ
వాడి పుర్రె మాత్రం విశాలంగా ప్రశాంతంగా వుంది.
ఈ దోపిడీ కాలమెంత భయంకరం! ఆకలి చీకటి రాజ్యంలో ఖాళీపేగులు అరుస్తున్నాయి.
వాతావరణం, పంటల గురించి మాట్లాడుకోనేలేం!
ఓ పెద్ద కొండచిలువ పేవుల్లో పాకుతోంది.
మనకు కన్నీళ్లు రావు.
స్వేచ్ఛ, సమానత్వం, సోదరీభావం, వ్యక్తిగత ఆస్థుల మర్రివృక్షాలు.
అందరూ సమానమే చట్టం ముందు.
తిను, తాగు. ఆడు, పాడు, నరకానికి పో
హే! ఈ చీకటికాలం ఎంత గొప్పగా ఉన్నది?
టీ షాపులో భేటీ అయి కప్పుకు కప్పు, సాసర్ కి సాసర్ తగిలించి.
రైలుబళ్లలో చిన్ని చిన్ని ప్రయాణాలు చేద్దాం.
కుంభమేళాలోని రంగుల్ని మన ఉనికిలో ప్రకటిద్దాం! అంత ఒత్తిడిని అనుభవించాక పబ్లిక్ పార్క్ లో కూర్చుందాం.
క్షయరోగపు వేణువులూది మన శ్వాసను విడిచిపెడ్దాం. పేదరికపు తల్లికి పిల్లలిద్దరు-తెలుపు, నలుపు
నీ సురాజ్యంలో నీవు దాగుడుమూతలాడుకో!
మన మనోఫలకాలపై ఎండిన ఎముకల సమాధి కనిపిస్తూనే ఉన్నది.
ప్రజాస్వామ్యాన్ని పండుగగా పలికే పాటలు
మన గొంతులోకి నెట్టబడ్డాయి
మన పొలాల్లోకి విదేశీ విత్తనాలు తార్చిన మిండగాళ్లెవరు?
అవి మన కండలో మొలకెత్తవు. మన రక్తంలో కలవవు. పూలు పూయవు. ఫలించవు.
ఇదొక రెడిమేడ్ షర్ట్! గాయపడిన శరీరాన్ని నయం చేయదు! కొంపా గోడు లేక మనం అనాధలమయ్యాం ఇళ్లు వదిలి స్మశానంలోకి మరలిపోతున్నాం.
శవపేటికల్లోంచి నలభై రెండు పాతతరాల కంకాళాలను వెలికిదీసాం.
కిలో నాలుగణాలకి అమ్మి, ఆ గోతుల్ని జీవమున్న అస్థికలతో నింపుతున్నాం.
బంగారు గనులున్న దేశంలో
అస్థికల బజారు కనబడుతున్నది.
భ్రమల అలలపై తిరిగే సన్నాసులమయ్యాం. రెండు బంగారు పిచ్చుకలు-మగ, ఆడ
బంగారం తింటూ బంగారు పంజరంలో అమ్మకానికి !
ఈ ప్రయాణీకులెంత తెల్లగా ఉన్నారు?
ఈ వేటగాళ్లెంత తెల్లగా ఉన్నారు?
వాళ్ల చేతుల్లో వేటాడబడ్డ తెల్లకుందేళ్లు
తెల్లటి వస్త్రం పరచిన బల్లపై వరుసలుగా పేర్చబడి ఉన్నాయి.
వాళ్లు తమ నడుం దగ్గర కత్తుల్ని ఒరలోంచి లాగి దూసారు.
ఆ పదునైన కత్తుల్ని కుందేళ్ల రహస్యాంగాల్లోకి జొనిపి లాగారు
రక్తం వెల్లువై పారింది.
మన మనసు గాయపడి రక్తం చిమ్ముతున్న పావురంలా ఎగరడానికి ప్రయత్నిస్తున్నట్లు కొట్టుకుంటున్నది. శాంతిదూతలు స్వర్గానికెగరబోతున్నట్లు
ఈ గందరగోళంలో గణతంత్ర ప్రజాస్వామ్యపు పాట ప్రతిధ్వనిస్తోంది.
ధర్మం చేయండి బాబూ! ఈ గ్రహణం తొలిగిపోతుంది! ధర్మం చేయండి నాయనా! ఈ గ్రహణం తొలిగిపోతుంది!
ఆంగ్లం నుండి అనువాదం: డా.లంకా శివరామప్రసాద్
###
1949 ఫిబ్రవరి 15న పూనే సమీపంలోని పుర్ అనే గ్రామం (రాజ్ గురునగర్ తాలూకా)లో అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో నామ్ దేవ్ ఢసాల్ జన్మించారు. 5 నుండి 10వ తరగతి దాకా ఆయన ముంబయి నగరంలో చదువుకున్నారు. 17-18 ఏళ్ళ వయసులోనే రిక్షా తొక్కి జీవిస్తూ కూడా కవిత్వం రాయటం ప్రారంభించారు. వ్యవస్థపైన ఆగ్రహంతో కూడిన తిరుగుబాటుతత్వం ఆయన కవిత్వంలో ఉండేది. 1972లో 'గోల్ పీఠా' పేరిట అతని మొదటి కవితా సంకలనం వెలువడింది. అప్పటికే ఆయనమీద అంబేద్కర్ ప్రభావంతోపాటు మార్క్స్ ప్రభావం కూడా బలంగా ఉండేది.
దళితులపై అగ్రకుల ధనాఢ్యవర్గాల దోపిడీ పీడనలపట్ల ఆయన తీవ్రద్వేషంతో వుండేవారు. ఆనాటికి మన దేశంలో సంచలనాత్మకంగా వున్న నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతోపాటు అమెరికా సామ్రాజ్యవాదంపై వియత్నాం ప్రజానీకపు విముక్తి యుద్ధ ప్రభావమూ, అమెరికాలో తెల్లపాలకులకు వ్యతిరేకంగా తలెత్తిన 'బ్లాక్ పాంథర్ల' ఉద్యమ ప్రభావంతో ముంబయి, మహారాష్ట్రలలో దళిత పాంథర్ల ఉద్యమాన్ని తన సహచరులతో కలసి ప్రారంభించిన వారిలో ఒక ముఖ్యునిగా ఢసాల్ వున్నారు. 1973లో వారు విడుదల చేసిన 'దళిత పాంథర్ల' మేనిఫెస్టో ఇప్పటికీ ఒక చారిత్రక పత్రంగా, భారతదేశంలో దళిత సమస్యకొక పరిష్కారం చూపగలిగిన దిశానిర్దేశ పత్రంగా నిలుస్తుంది. ('దళిత పాంథర్ల మేనిఫెస్టో'ను 1974లో ప్రజాస్వామ్య విద్యార్థుల పత్రిక 'ఆలోచన' దీన్ని మొదటిసారి తెలుగులో ప్రచురించింది. 1996 సెప్టెంబరులో 'నవ యువ సమాఖ్య {NYS} ప్రచురించిన "దళిత ఉద్యమం-దాని ప్రాధాన్యత" అన్న బుక్ లెట్ లో పునర్ముద్రించబడింది.)
ఆనాడు ‘దళిత పాంథర్ల’ ఉద్యమ ప్రభావం దళితులమీదేకాక మొత్తంగా శ్రమజీవుల విముక్తిని కోరేవారందరిపై మరీ ముఖ్యంగా నాటి యువతరంపై బలంగా ప్రభావం వేసింది. భూమిలో (భూ సంబంధాలలో) అత్యంత హింసాత్మక దోపిడీ రూపం అస్పృశ్యతేననీ, భారత సమాజంలో “వర్గము-కులము” పెనవేసుకునే ఉన్నాయన్న సత్యాన్నీ, వర్గదోపిడీ వ్యతిరేక పోరాటంతో కులపీడన వ్యతిరేక పోరాటాన్ని తప్పనిసరిగా జోడిస్తేతప్ప ఈ దేశంలో దళితులకూ, శ్రమజీవులందరికీ దోపిడీ, పీడనల నుండి విముక్తి లభించదని దళిత పాంథర్ల మేనిఫెస్టో ప్రకటించింది. అందుకు ముఖ్యంగా కృషిచేసిన వారిలో ఒకడైన నామ్ దేవ్ ఢసాల్ తన ఉద్యమజీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని కూడా చివరిరోజులదాకా తను నమ్మిన పీడిత ప్రజల విముక్తికి, కుల, మతాలకతీతంగా శ్రమజీవులైన పీడిత దళితులందరి ఐక్యత కోసం పరితపిస్తూ కృషిసల్పారు.
2014 జనవరి 15న తన 65వ ఏట నామ్ దేవ్ ఢసాల్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సమరశీల దళిత ఉద్యమానికి పునాదులు వేసిన నామ్ దేవ్ ఢసాల్ కి పిడిఎస్ఓ విప్లవ జోహార్లర్పిస్తున్నది.
పోస్ట్ కి ఆధారం: జనశక్తి (ఫిబ్రవరి, 2014)

