విద్యా, ఉపాధి రంగాల సమస్యలపై 'ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సు'ను విజయవంతం చేయండి!

0
మిత్రులారా!
విద్య అనేది సమాజ పురోగమనానికీ, దేశ అభివృద్ధికీ, మానవ వికాసానికీ దోహాదపడాలి. దానికొక సామాజిక ప్రయోజనం ఉండాలి. విద్యా బోధన మూస (మెకానికల్) పద్ధతిలో సాగకూడదు. అది సృజనాత్మకతతో సాగాలి. సరిగ్గా దీనికి విరుద్ధంగానే నేటి విద్యావిధానం ఉంది. 'దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని' ప్రముఖ విద్యావేత్త డి.ఎస్.కొఠారి చెప్పి 50 యేళ్ళు గడిచినా, తరగతి గదిని దేశ భవిష్యత్ కి కేంద్రంగా కన్నా మార్కెట్ లో డిమాండ్ - సప్లై మేరకు మానవ యంత్రాలను ఉత్పత్తి చేసే పరిశ్రమగానే పాలకులు మార్చారు. విద్యార్థుల మెదళ్ళని వీలైనంత ఎక్కువ డేటాను స్టోర్ చేసుకునే మెమరీగా తీర్చిదిద్ది, జ్ఞానాన్ని ప్రశ్న - జవాబుల పద్దతికి పరిమితం చేసారు. విద్య లక్ష్యం మార్కులు, ర్యాంకుల సాధనే పరమావధిగా కుదించి అశాస్త్రీయ పద్ధతుల్లో విద్యావిధానాన్ని పాలకులు అమలుచేస్తున్నారు. విలువలు లేని మరియు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వలేని ఈ విద్యా విధానం విద్యార్థులు, యువత చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడి ఆత్మహత్యలు చేసుకునేలా తయారుచేస్తుంది. మరోవైపు పాలకులు పెంచి పోషిస్తున్న మద్యం, గంజాయి, డ్రగ్స్, పోర్న్ సైట్స్ వంటి విష సంస్కృతి విద్యార్థి యువతను హింసా వాదులుగాను, రేపిస్టులుగాను తయారు చేస్తుంది.
◆ ప్రస్తుతం మన దేశం 113 బిలియన్ డాలర్ల విద్యా మార్కెట్ గా ఉందనీ, అది 2025 నాటికి 225 బిలియన్ డాలర్లు, 2030 నాటికి 400 బిలియన్ డాలర్లగా పెరిగి ప్రపంచంలో అతిపెద్ద విద్యా మార్కెట్ గా అవతరించబోతుందనీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విద్యా మార్కెట్ పై గుత్తాధిపత్యం సాధించేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్ విద్యా సంస్థలు గుంటకాడ నక్కల్లా కాచుక్కూర్చొన్నాయి. ఇప్పటికే ప్రపంచీకరణ విధానాలు విద్యని వ్యాపార పరిశ్రమగా మార్చేశాయి. దీంతో విద్యారంగం 70 శాతానికి పైగా ప్రయివేటీకరించబడింది. అంతేకాకుండా విద్యారంగం తీవ్ర సంక్షోభానికి గురై, నేడది సామాన్యులకు అందని సరుకై పోయింది. అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం-2020 గానీ, ఇటు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విద్యాసంస్కరణల పేరుతో చేపడుతున్న విధానాలు గానీ ఉన్న కాస్తో కూస్తో ప్రభుత్వ విద్యను కూడా కుదేలు చేసి, కార్పొరేట్లకు కట్టబట్టే వైపుగా సాగుతున్నాయి.
◆ 90 వేల రైల్వే ఉద్యోగాలకు 2 కోట్ల 50 లక్షలకి పైబడి అభ్యర్థులు పోటీపడటం, 5వ తరగతి అర్హతకు సరిపోయే పోస్టులకు 3,700 మంది పి.హెచ్.డి, 28,000 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్, 54,000 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అప్లై చేయడం వంటి ఘటనలు దేశంలో నిరుద్యోగం ఎంత భయానక స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి. సంక్షోభాలను, సమస్యలను, వాటికి గల కారణాలను దాచిపెట్టి 'కష్టపడి బాగా చదివితే, వారికి ఉద్యోగాలు రాకుండా ఎవరూ ఆపలేరు' అనే పాలకుల ప్రవచనాల మధ్య పెరుగుతున్న ప్రస్తుత తరాలకి నిరుద్యోగ సమస్య తీవ్రత తెలుసుకోవడానికి ఇంత కంటే నిజజీవిత ఉదాహరణలు అక్కర్లేదు!
◆ ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంత యువకుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకొనే అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టిన సందర్భంలో కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరిగిన సందర్భంలో కానీ దేశవ్యాప్తంగా యువకులు పెల్లుబికిన ఆగ్రహంతో నిరసనాందోళనలు చేపట్టారు. దీని వెనుక రోజురోజుకూ ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండటం; యేళ్ళతరబడి ఉద్యోగాలకై ఎదురుచూస్తూ కుటుంబానికీ భారం కావడం; రోజురోజుకీ పెరుగుతున్న పూట గడవని పరిస్థితులు; నిత్యం వారు అనుభవిస్తున్న అభద్రత, మనోవేదనలు వంటివి నిరుద్యోగ యువత ఆకస్మిక ఆందోళనలకీ ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.
◆ ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే... రక్షణ, రవాణా, కమ్యూనికేషన్, బొగ్గు, గనులు, ఓడరేవులు, విద్యుత్తు, ఉక్కు, రైల్వేలు, విమానయానం, చమురు, గ్యాస్‌, బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటీకరించటం లేదా వాటిని నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో పాలకులు కార్పొరేట్లకి తెగనమ్ముతున్నారు. మరోవైపు ముష్టివేతనాలైన ఫర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగమొస్తే చాలనుకొనే పరిస్థితుల్లో ప్రయివేట్, కార్పొరేట్ కంపెనీల్లో చేరుతుంటే... ట్విట్టర్, మెటా, బైజూస్, అమెజాన్ వంటి కంపెనీలు వేలమంది ఉద్యోగులను నిరంకుశంగా తొలగిస్తున్న ఘటనలు చూస్తున్నాం. యిటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో యువతకి పోరాటం తప్ప మరో మార్గముందా?!పోరాడకుండా యువతకి భవిష్యత్తుందా?!
◆ పాలకులు అనుసరిస్తున్న ఈ విద్యా, ఉపాధి వ్యతిరేక విధానాలను గురించి ఆలోచించనీయకుండా కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థి, యువతను వాటి చుట్టూ తిప్పుతూ వారిని బలి పశువులు చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు విద్యార్థి యువతను ఉపయోగించుకుంటూ వారిని ప్రక్క దారి పట్టిస్తున్నారు. కనుక వీటన్నిటిని సరైన కోణంలో అర్థం చేసుకుంటూ విద్యా, ఉపాధి రంగాల్లో నెలకొన్న సంక్షోభానికి కారణమైన, పాలకులు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలపైన విద్యార్థి, యువత పోరాడాల్సి ఉంది. కనుక విద్యా, ఉపాధిరంగ సమస్యలపై మరింత లోతుగా చర్చించేందుకు, కార్యక్రమాలను రూపొందించుకునేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో డిసెంబర్ 22, 2022న విశాఖపట్నంలో 'ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సు' జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, ప్రజాతంత్రవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
డిమాండ్లు:
  1. జాతీయ విద్యా విధానం - 2020ను రద్దు చేయాలి!
  2. విలీనాల పేరుతో జరుగుతున్న పాఠశాలల మూసివేతను ఆపాలి!
  3. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ మరియు ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణను విరమించుకోవాలి!
  4. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులకు, రాష్ట్రంలోని 2 లక్షల 30 వేల పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ యివ్వాలి!
  5. వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. మూసివేసిన చక్కెర, జూట్, ఫెర్రో-ఎల్లాయిస్ తదితర పరిశ్రమలను తెరిపించాలి!
  6. పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులను, సంక్షేమ హాస్టళ్ల బకాయిలను విడుదల చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి!
  7. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన విద్యార్థులకు సరిపడా సీట్లు కేటాయించాలి. రద్దు చేసిన సోషల్ సైన్సెస్ కోర్సులను తిరిగి పునరుద్ధరించాలి!
  8. కొత్తగా తీసుకువస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ని నిలిపి వేయాలి.
  9. ప్రభుత్వ జూనియర్ & డిగ్రీ కళాశాలలోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఫ్యాకల్టీని పర్మినెంట్ చేయాలి!
  10. రాష్ట్రంలో విద్యార్థులకు సరిపడా ప్రభుత్వ జూనియర్&డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలి. అద్దె భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు సొంత భవనాలు కేటాయించాలి!
  11. డిగ్రీ వరకు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి!
  12. గిరిజన ప్రాంతాల్లో సమగ్రమైన పాఠశాల, కళాశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి!
___________________________________
తేదీ : 22-12-2022, గురువారం
సమయం : ఉదయం 10 గం.లకు
వేదిక : అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, డాబాగార్డెన్స్, విశాఖపట్నం
___________________________________
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఉత్తరాంధ్ర జిల్లాలు
ప్రచురణ తేదీ : 02-12-2022, విశాఖపట్నం
ప్రచురణ కర్తలు : ఎస్.రుద్రి, పి.విశ్వనాథ్, కె.సోమేష్
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)