ఈ (2015 జనవరి) నెల 3వ తేదీన 'ఆంధ్రజ్యోతి' జనవాక్యంలో “ప్రభుత్వ భూములలోనే రాజధానిని నిర్మించాలి” అంటూ వంద మందికి పైగా తెలుగు రచయితలు చేసిన ప్రకటన విడుదలయింది. ఆ పేర్లలో సి.వి. పేరు కూడా చూసిన కొందరు నాకు ఫోన్లు చేశారు... "ఆయన ఇంకా బతికే వున్నారా?" అని. “ఉన్నారు. బెజవాడలోనే” అన్న నా జవాబు విన్న తర్వాత వారి పాత జ్ఞాపకాలు కొన్ని నాతో ప్రస్తావించారు. అయితే ఈ ఫోన్లు చేసినవారందరూ అరవైయేళ్ళకు పైబడ్డవారు. ఈ తరం వారికి సి.వి. దాదాపు తెలియడు. 1965లో 'విషాద భారతం' కావ్యం నుండి 1975లో 500 పేజీల 'పారిస్ కమ్యూన్'మహాకావ్యం వెలువడేలోగా మరో రెండు కవితా సంపుటులు (కారుచీకటిలో కాంతిరేఖ, ఊళ్ళోకి స్వాములవారు వేంచేశారు) ఇంకో రెండు కావ్యాలు (నరబలి, సత్యకామ జాబాలి) మాత్రమేకాక రెండు సాహిత్య విమర్శనా రచనలు (ఖడ్గసృష్టి కావ్య పరామర్శ; గురజాడ శ్రీశ్రీలపై సోమసుందర్ దాడి) వీరు చేశారు. వీటితోపాటు మరెన్నో విడి కవితలూ, వ్యాసాలూ రాసిన రచయిత, కవి... సి.వి.!
ఆయన కలం అక్కడితో ఆగిపోయిందనుకుంటే పొరపాటు. 2000వ సంవత్సరంలో, అనగా తను 70 ఏళ్ళు పూర్తిచేసుకున్న తర్వాత వెలువడిన 'దళిత ఉద్యమ వైతాళికుడు. 'కుసుమ ధర్మన్న కవీంద్రుడు' అనే పుస్తకం రాసేనాటికి మొత్తం 27 పుస్తకాలు ఆయన వెలువరించారు. వీటిల్లో విషాద భారతం, నరబలి, సత్యకామ జాబాలి, 'ఏడుకొండలవాడా! గోవిందా గోవింద!!' లాంటివి ఆనాడే పునర్ముద్రణ పొందాయి. ఆయన రాసిన పుస్తకాలలో 'కౌటిల్యుని అర్థశాస్త్రం' పైనా స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ - మార్క్స్ గురించీ వున్నాయి. ఇంతేకాదు 'సింధు నాగరికత' గురించీ, డార్విన్ పరిణామవాదం పైన కూడా సి.వి. రాశారు. 'రంగనాయకమ్మ రాసిన నాస్తికత్వం ఒక పరిశీలన' పై హేతువాద నాస్తికోద్యమం - రంగనాయకమ్మకి సమాధానం' అని సి.వి. రంగనాయకమ్మను విమర్శించగా, ఆమె నీడతో యుద్ధం అని సి.వి. పై ప్రతివిమర్శ చేశారు. దానికి రంగనాయకమ్మకి మళ్ళీ సమాధానం అంటూ సి.వి. మరొక పుస్తకం రాయగా, రంగనాయకమ్మ సి.వి.ని మరొకసారి ఖండిస్తూ ఇంకొక పుస్తకం రాశారు. ఇదంతా 1979లో విజయవాడలో 'జనసాహితి' నిర్వహించిన అధ్యయన తరగతులలో రంగనాయకమ్మ ప్రవేశపెట్టిన 'నాస్తికత్వం ఒక పరిశీలన' పత్రంతో మొదలై, జనసాహితి నుండి రంగనాయకమ్మ విభేదిస్తూ రాజీనామా చేసిన 1980ల తర్వాత కూడా కొనసాగి 1981 చివరికి ముగిసింది. ప్రజా ఉద్యమ నిర్మాణాల వాస్తవిక సమస్యలతో తలమునకలవకుండా, ఆచరణ - అన్వయానికి సంబంధించిన విషయాలను సైద్ధాంతిక సమస్యలుగా తర్కించుకొన్న చర్చగా దాన్ని నేను అర్ధం చేసుకొన్నాను.
'ప్రాచీన భారతంలో చార్వాకం', ఆంధ్రలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు (1981), భారత జాతీయ పునరుజ్జీవనం (1984) గ్రంధాలు ప్రజా సాంస్కృతికోద్యమ చరిత్రల గురించిన అవగాహన నందించేవి. కులవ్యవస్థపైన సి.వి. చేసిన రచనలు ప్రత్యేకంగా పేర్కొనదగినవి. 1). వర్ణవ్యవస్థ, 2).ప్రాచీన యుగంలో కులవ్యవస్థ, 3). మధ్య యుగాలలో కులవ్యవస్థ, 4). ఆధునిక యుగంలో కులవ్యవస్థ, 5). మను ధర్మశాస్త్రం - శూద్ర దళిత బానిసత్వం. (వీటిపైన 'ప్రజాసాహితి'లో 4 నెలలపాటు పరిచయ వ్యాసాలొచ్చాయి). 6). దళిత ఉద్యమ వైతాళికుడు-కుసుమ ధర్మన్న కవీంద్రుడు
సి.వి.ని ఎరిగిన అత్యధికులకు ఆయన రచనల సమగ్రతత్వం తెలియదు. తాము ఎరిగిన కొద్ది రచనలను మాత్రమే ప్రస్తావిస్తూంటారు. ఇంత అరుదైన, ఎంతో విస్తృతంగా రాసిన రచయిత ఇంకా జీవించే వున్నాడని ఎరగకపోవడం ఆశ్చర్యం!బాధాకరం!!
సి.వి. పేరెరిగిన వారి పరిస్థితే యిలా వున్నపుడు, పేరే ఎరగనివారి గురించి యిక చెప్పేదేముంది.ఈ జనవరి 14తో సి.వి.గా పేరొందిన చిత్తజల్లు వరహాలరావుకి 85 ఏళ్ళు పూర్తవుతాయి. గుంటూరు పట్టణంలో పుట్టి, అక్కడే ఎ.సి. కళాశాలలో బి.ఎ.; మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో దిగ్దంతుల వద్ద ఎం.ఎ. చదువకొని, కొద్దికాలం నిరుద్యోగిగా మచిలీపట్నంలో వుండి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ 'సహకారశాఖ'లో ఇన్స్పెక్టర్ గా చేరి ఆడిటర్ గా ముప్ఫైఏళ్ళ క్రితమే విజయవాడలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 60వ దశకంలో కక్ష సాధింపుకు గురై ఉద్యోగంలో ఎన్నో వొడిదుడుకులనెదుర్కొన్న కాలంలో "జనశక్తి" పత్రికలో పనిచేశారు. వీరి కవితలు దాదాపు అన్నీ 'జనశక్తి' పత్రికలోనే వచ్చేవి. శ్రీశ్రీ ఖడ్గసృష్టి వెలువడిన సంవత్సరం 1966లోనే దానిపై సి.వి. చేసిన కావ్య పరామర్శ 'జనశక్తి' దినపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఆంధ్రాలో 1955 ఉప ఎన్నికల సందర్భంలో, కమ్యూనిస్టులు గెలుస్తారని భయపడిపోయిన పాలకవర్గాలు వారి పత్రికల ద్వారా కమ్యూనిస్టులపై విపరీత దుష్ప్రచారం గావించారు. అందుకు శ్రీశ్రీని ఒంటరిగా టార్గెట్ చేసి పత్రికల ద్వారానే కాక భౌతికంగా కూడా దాడిచేశారు. ఆ రోజుల్లో శ్రీశ్రీని సమర్ధిస్తూ కమ్యూనిస్టుల పక్షాన నిలబడి రచనలు చేసిన కొద్దిమందిలో సి.వి. ఒకరు. “చచ్చింది! అభ్యుదయ కవిత్వం పీడా విరగడైంది!! అనుకునే అన్నయ్యలకు ఉలికిపాటు కలిగించే విధంగా మరొక అభ్యుదయ కావ్యం విషాద భారతం వెలువడుతున్నది. అభ్యుదయ కవిత్వం పుబ్బలో పుట్టి మఖలో గిట్టే మూన్నాళ్ళ ముచ్చట కాదని నిరూపించేందుకేమో ఈ కావ్యావతరణ” అంటూ కె.వి. రమణారెడ్డి తన ముందుమాటలో ప్రాణాగ్నిగా ఆ కావ్యాన్ని 1965లో అభివర్ణించాడు. భారత పార్లమెంటరీ వ్యవస్థలోని అప్రజాస్వామిక తత్త్వాన్ని, పాలకుల మోసపూరిత అభ్యుదయాన్ని, అంత తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన కావ్యం, బహుశా భారతదేశంలోనే నాటికి మరొకటి లేదంటే అతిశయోక్తి కాకపోవచ్చు. కానీ అభ్యదయ సాహిత్యాన్ని నిలబెట్టిన వారిలో సి.వి.ని ఒకరుగా అరసం ఈ నాటికీ గుర్తించలేదు. "ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని” అన్నట్లుగా 'ఖడ్గసృష్టి' వెలువడిన 1966లోనే దానిపై కావ్య పరామర్శచేసి, ఆ కాలానికి శ్రీశ్రీని స్పష్టమైన మార్పిస్టు దృక్పధంతో విశ్లేషించి నిరూపించినా, 1970లో గురజాడా శ్రీశ్రీలపై సోమసుందర్ చేసిన దాడిని తిప్పికొట్టి వారి విశిష్టతను చాటిచెప్పినా, ఆ కృషికి గాని, చర్యకు గాని తగిన గుర్తింపుని దశాబ్దాలుగా ఆయన పొందలేదు. 1970లో ఖమ్మంలో జరిగిన విరసం మొదటి మహాసభకు హాజరయి, సభ్యునిగా చేరిన సి.వి.ని, మతం అనే "శవవాహక వృత్తి చేస్తున్నవాని” గా (1972 గుంటూరులో జరిగిన 3వ విరసం రాష్ట్ర మహాసభలో త్రిపురనేని మధుసూదనరావు ప్రసంగం) పరిగణించటంతో వారి నుండి కూడా విస్మరణకు గురయ్యారు. బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ దగుల్బాజీతనాన్ని ఎండగడుతూ, దానిపై కొందరిలో పెరుగుతున్న భ్రమలను విమర్శించినందుకు, వారూ ఆయన్ను దూరం పెట్టేశారు. కుళ్లికంపు కొడుతున్న కులవ్యవస్థ, కాలం చెల్లినా యింకా చావని ఫ్యూడల్ వర్గవ్యవస్థ లక్షణంగా, మొత్తంగా దోపిడీ వ్యవస్థలో అంతర్భాగంగా పెనవేసుకుని వున్నదనీ, కులవ్యవస్థ వొక్కటే విడిగా పరిష్కారమయేది కాదనీ, కులవాదంతో కులాన్ని నిర్మూలించలేమనీ గట్టిగా అభిప్రాయపడే సి.వి.ని, ఉన్న వ్యవస్థలోనే తమ తమ స్థానాలకై పాకులాడే సంస్కరణవాద కెరీరిస్టు సెక్షన్లు తగినంత పట్టించుకోలేదు. వర్ణవ్యవస్థ, వర్గవ్యవస్థ అవిభాజ్యాలేగాక పరస్పర సంబంధితాలు కూడా అంచేతనే వర్ణ-వర్గ వ్యవస్థలపై నిరంతర పోరాటం జరిపినపుడే భారత ప్రజలకి వాస్తవమైన భవిష్యత్తు వుంటుంది. ఈ దేశానికి 1947 ఆగస్టు పదిహేను అర్ధరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. కానీ మన గ్రామసీమల్లో జీవించే కోట్లాది పేదప్రజలకు మాత్రం యింకా స్వరాజ్యం రాలేదు" అంటూ 1984లో "భారత జాతీయ పునరుజ్జీవనం”లో చేసిన సి.వి. నిర్ధారణల కాలంల 30 ఏళ్ల చరిత్రా రుజువుపరిచింది. శాస్త్రజ్ఞుల వేదికల నుండి కూడా మధ్యయుగాల మౌఢ్యాలే వినిపిస్తున్నవేళ సమస్త ప్రజాస్వామిక సాంస్కృతికోద్యమకారులూ, లౌకికవాదులూ సి.వి.ని మరొక మారు అర్థంచేసుకునే ప్రయ్నతం చేస్తారని ఆశిద్దాం.
(సి.వి. 86వ పుట్టినరోజు సందర్భంగా 14 జనవరి 2015న ఆంధ్రజ్యోతిలో దివికుమార్ (జనసాహితి) గారు రాసిన వ్యాసం)


